టిక్ టాక్ పై మాట మార్చిన ట్రంప్..

నవతెలంగాణ – వాషింగ్టన్‌: చైనాకు చెందిన సోషల్‌ మీడియా యాప్‌ టిక్‌టాక్‌ను అమెరికాలో నిషేధం విధించే అవకాశాలపై ఆ దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను మళ్లీ అధికారంలోకి వస్తే.. టిక్‌టాక్‌ను దేశంలో నిషేధించబోనని స్పష్టంచేశారు. ఈ సామాజిక మాధ్యమంపై చర్యలకు సంబంధించిన బిల్లును ఇటీవల అమెరికా ప్రతినిధుల సభ ఆమోదించిన సంగతి తెలిసిందే. డొనాల్డ్‌ ట్రంప్‌ కూడా తొలుత దీనికి పరోక్షంగా మద్దతు పలికారు. అయితే, కొన్ని రోజుల క్రితమే టిక్‌టాక్‌లో చేరిన ఆయన.. తాజాగా నిర్ణయాన్ని మార్చుకున్నట్లు న్యూయార్క్‌ పోస్ట్‌ కథనం వెలువరించింది. రిపబ్లికన్‌ పార్టీకి చెందిన ట్రంప్‌.. అక్కడి మీడియా ప్రతినిధి ఛార్లీ కిర్క్‌తో మాట్లాడుతూ టిక్‌టాక్‌ అంశంపై స్పందించారు. ‘మీరు అధికారంలోకి వస్తే టిక్‌టాక్‌పై నిషేధం విధించబోనని కచ్చితంగా చెప్పగలరా?’ అని ప్రశ్నించగా.. అందులో సందేహమేముంది? నేను ఎప్పటికీ టిక్‌టాక్‌ను బ్యాన్‌ చేయను’ అంటూ ట్రంప్‌ సమాధానమిచ్చారు.

 

Spread the love