నవతెలంగాణ-హైదరాబాద్ : అమెరికాలో పనిచేస్తున్న వేలాది మంది భారతీయ నిపుణులు వినియోగించుకునే హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్‌లో భారీ మార్పులు చేసేందుకు ట్రంప్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ వీసా విధానాన్ని సమగ్రంగా ప్రక్షాళన చేసేందుకు ఉద్దేశించిన కొత్త ప్రతిపాదనను శ్వేతసౌధం పరిశీలనకు పంపింది. ఈ పరిణామం హెచ్-1బీ వీసాదారులలో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
“హెచ్-1బీ నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా క్లాసిఫికేషన్ ప్రోగ్రామ్ సంస్కరణ” పేరుతో హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం (డీహెచ్ఎస్) ఈ ప్రతిపాదనను సోమవారం శ్వేతసౌధంలోని ఆఫీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ రెగ్యులేటరీ అఫైర్స్‌కు (ఓఐఆర్ఏ) సమర్పించింది. దీన్ని “ఆర్థికంగా కీలకమైనది”గా వర్గీకరించారు. అంటే, ఈ మార్పుల వల్ల వార్షికంగా కనీసం 100 మిలియన్ డాలర్ల ప్రభావం ఉండొచ్చని లేదా ఆర్థిక వ్యవస్థ, ఉద్యోగాలు, ఉత్పాదకత వంటి కీలక రంగాలపై గణనీయమైన ప్రభావం చూపిస్తుందని అర్థం.
అయితే, ఈ ప్రతిపాదనలోని పూర్తి వివరాలు ఇంకా బయటకు రాలేదు. వీసా అర్హత ప్రమాణాలు, యజమానుల బాధ్యతలు, వేతన నిబంధనలు, వార్షిక ఎంపిక ప్రక్రియ వంటి అంశాల్లో ఏ మార్పులు తీసుకురానున్నారనే దానిపై స్పష్టత లేదు. శ్వేతసౌధం సమీక్ష పూర్తయిన తర్వాతే ఈ ప్రతిపాదన వివరాలు ఫెడరల్ రిజిస్టర్‌లో ప్రచురిస్తారు. అనంతరం దీనిపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టి, వచ్చిన సూచనలు పరిశీలించాక తుది నిర్ణయం తీసుకుంటారు. ప్రస్తుతం ఈ ప్రతిపాదన సమీక్ష దశలోనే ఉన్నందున ప్రస్తుత హెచ్-1బీ నిబంధనలలో ఎలాంటి మార్పు లేదు.
కాగా, ఈ సమగ్ర ప్రక్షాళన ప్రతిపాదనకు అదనంగా, ప్రభుత్వం మరికొన్ని కఠిన నిబంధనలను కూడా పరిశీలిస్తోంది. వాటిలో క్యాప్-సబ్జెక్ట్ హెచ్-1బీ పిటిషన్‌పై అదనంగా 103,265 డాలర్ల ఫీజు విధించే ప్రతిపాదన ఒకటి. అలాగే, ఉద్యోగం కోల్పోయిన హెచ్-1బీ ఉద్యోగులు కొత్త ఉద్యోగం వెతుక్కోవడానికి లేదా ఇమ్మిగ్రేషన్ స్టేటస్ మార్చుకోవడానికి వీలు కల్పించే 60 రోజుల గ్రేస్ పీరియడ్‌ను తొలగించే ప్రతిపాదన కూడా సమీక్షలో ఉంది. ఈ వరుస పరిణామాలు అమెరికాలో పనిచేస్తున్న విదేశీ నిపుణులలో ఆందోళన రేకెత్తిస్తున్నాయి.



