నమ్మకం చాలా ముఖ్యం

నమ్మకం చాలా ముఖ్యంఅనుమానం ఏ బంధంలోనైనా చిచ్చు రేపుతుంది. భార్యా భర్తల మధ్య అనుబంధం పదికాలాల పాటు పదిలంగా ఉండాలంటే నమ్మకం చాలా ముఖ్యం. ఒక్కసారి అనుమానం మొదలైందంటే పచ్చని కాపురంలో చిచ్చుపెడుతుంది. నమ్మకం లేని చోట అనుమానం బలంగా ఉంటుంది. కాబట్టి భార్యా,భర్తల బంధానికి పునాది నమ్మకం. ఆ పునాది ఎంత పటిష్టంగా ఉంటే ఆ భార్యాభర్తల బంధం అంత బలంగా ఉంటుంది. అనుమానం అనే చిన్న బీజం జీవితాలను నాశనం చేస్తుంది. అంతటి ప్రమాదమైన అనుమానాన్ని మొదట్లోనే తుంచి వేయాలి. లేదంటే మహావృక్షమై కుటుంబాలనే కబళించేస్తుంది. అలాంటి ఓ సమస్యే ఈ వారం ఐద్వా అదాలత్‌లో…
దీప్తికి సుమారు 40 ఏండ్లు ఉంటాయి. ఆమె భర్త అనీల్‌ ఒక మీడియా సంస్థలో ఉద్యోగి. అతనికి 45 ఏండ్లు ఉంటాయి. వారికి ముగ్గురు అబ్బాయిలు. పెద్దబ్బాయి 10, రెండో అబ్బాయి 8, చిన్న బాబు 6వ తరగతి చదువుతున్నారు. దీప్తి ఒక ప్రయివేటు కాలేజీలో ఉద్యోగం చేస్తుంది. కానీ ఆమె ఏటీఎం కార్డు అనిల్‌ దగ్గరే ఉంటుంది. బస్‌ చార్జీలకు అవసరం వరకే దీప్తి చేతికి ఇస్తాడు. అది కూడా ఆమె లెక్కలు చెప్పాలి. తాను సంపాదిస్తున్నా ఇష్టం వచ్చిన చీర కొనుక్కునే హక్కు కూడా ఆమెకు లేదు. ఎప్పుడైనా పండగలు, పుట్టినరోజు, పెండ్లి రోజుకి ఆమె డబ్బుతోనే చీర కొనిచ్చి తిడతాడు. ఆ తిట్లు భరించలేక ఆ చీర లేకపోయినా బాగుంటుంది అనిపించేది దీప్తికి.
దీప్తికి కనీసం ఫోన్‌ కూడా లేదు. ‘నీకెందుకు ఫోన్‌. ఇంట్లో ఉంది కదా! కాలేజీలో ఎటూ ఫోన్‌ అవసరం ఉండదు’ అంటాడు. కనీసం వాళ్ళ అమ్మ వాళ్ళతో మాట్లాడాలన్నా దీప్తికి చాలా ఇబ్బందిగా ఉండేది. ఇంట్లో ఉండే ఫోన్లో పిల్లలు క్లాసులు వింటారు. ఆమె తీసుకున్న రెండు నిమిషాలకే తిరిగి ఇవ్వమంటూ గోల చేస్తారు. దీప్తి అనిల్‌కు రెండో భార్యా. మొదటి భార్య వదిలేసి వెళ్ళిపోతే తర్వాత ఈమెను పెండ్లి చేసుకున్నాడు. దీప్తిని అతను ఒక యంత్రంలా భావిస్తాడు. ఆమెను తన కుటుంబ సభ్యులతో కలవనియ్యడు, మాట్లాడనియ్యడు. కనీసం ఆమెకు ఆరోగ్యం బాగోలేక పోయినా పట్టించుకోడు. ఒకసారి దీప్తి ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటుంటే ఒంటరిగా వదిలేసి అనిల్‌ ఫంక్షన్‌కి వెళ్ళిపోయాడు. ఆమె ఫోన్‌ చేసినా స్పందించలేదు. ఇంటికి ఫోన్‌ చేస్తే వాళ్ళ చిన్న బాబు వచ్చి ఇంటికి తీసుకు వెళ్ళాడు.
పిల్లలందరూ అనిల్‌కే సపోర్ట్‌ చేస్తారు. తల్లిని అస్సలు గౌరవించరు. పెద్ద బాబు అయితే అనిల్‌తో కలిసి దీప్తిని కొడతాడు. అది కూడా ఆమె ఎవరికీ చెప్పుకోలేని చోట. పెద్ద బాబు ఆర్యకు 15 ఏండ్లు ఉంటాయి. అప్పుడే అతను స్నేహితులతో కలిసి మందు తాగడం, సిగరేట్లు తాగడం లాంటివి చేస్తుంటాడు. ‘ఈ వయసులో ఎంటి ఈ పనులు’ అని అడిగితే తల్లిని తిడతాడు, కొడతాడు.
అనిల్‌ దగ్గరుండి మరీ కొడుకుని ప్రోత్సహిస్తాడు. ఒకసారి నెక్లెస్‌ రోడ్‌లో ఆర్యను పోలీసులు అరెస్టు చేశారు. అనిల్‌కు ఫోన్‌ చేస్తే అతను వెళ్ళాడు. ‘మీ బాబు వయసెంత? అతనికి అప్పుడే బండి ఇచ్చి పంపించారు. పైగా బాగా తాగి ఉన్నాడు. మీరు మీడియాలో పని చేస్తున్నారు. పైగా ఇది మొదటి సారి కనుక వదిలేస్తున్నా. ఇలా ఇంకో సారి జరిగితే కేసు పెడతాం’ అని పోలీసులు హెచ్చరించి పంపించారు.
ఇంత జరిగినా అనిల్‌ కొడుక్కు భయం చెప్పకుండా అలాగే వదిలేశాడు. ఆర్య భవిష్యత్‌ ఏం కావాలి? దీప్తి ఏం చెప్పినా ‘ముందు నీ సంగతి చూసుకో, తర్వాత నాకు చెప్పు’ అంటాడు. పైగా అనిల్‌ దీప్తి గురించి పిల్లలకు, చుట్టు పక్కల వారికి, బంధువులకు చెడ్డగా చెబుతుంటాడు. ఆమెకు ఎవరితోనే సంబంధం ఉందని ప్రచారం చేశాడు. అతను ఆమెను కలవడానికి రాత్రి పూట వస్తాడని పిల్లలకు చెప్పి కాపలా కాయమంటాడు. అలా ఆమెకు ఎలాంటి సపోర్ట్‌ లేకుండా చేశాడు. ఇక ఆమెకు పిల్లల ముందు ఎలాంటి విలువా లేకుండా పోయింది. ఆర్య ఏం చేసినా అనిల్‌ సపోర్ట్‌ చేస్తాడు. దాంతో తల్లి తప్పుడు మనిషిగా, తండ్రి మంచి వాడిగా కనిపిస్తున్నాడు. దీప్తిని అనుమానించడం, విపరీతంగా కొట్టడం ఇదే ఆ ఇంట్లో నిత్యం జరిగే పని. ఈ బాధలు భరించలేక దీప్తి ఒక సారి పోలీసులతో, మరో సారి తన కాలేజీ యాజమాన్యంతో కౌన్సెలింగ్‌ ఇప్పించింది. అయినా అతనిలో ఎలాంటి మార్పూ రాలేదు. ఒక వైపు కొడుకు చెడు మార్గం పట్టాడు. ఇలాంటి పరిస్థితుల్లో దీప్తి తనకు న్యాయం చేయమంటూ ఐద్వా లీగల్‌ సెల్‌కు వచ్చింది.
మేము అనిల్‌ను పిలిచి మాట్లాడితే ‘దీప్తి అమ్మ వాళ్ళు మంచి వాళ్ళు కాదు. అందుకే నేను అక్కడికి వెళ్ళను. దీప్తిని కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళనీయను. వాళ్ళంతా క్యారెక్టర్‌ లేని వాళ్ళు. అందుకే దీప్తిపై నాకు అనుమానం. తన చెల్లి, అక్క కూతురు ఇద్దరూ ఇంట్లో నుండి వెళ్ళి పోయి పెండ్లి చేసుకున్నారు. అందుకే వాళ్ళంటే నాకు అసహ్యం. ఇక మా బాబు పెద్దవాడు అవుతున్నాడు. వాడికి ఆ మాత్రం స్వేచ్ఛ ఇవ్వక పోతే ఎలా? ఇప్పుడే కదా లైఫ్‌లో ఎంజారు చేసేది. దానికి కూడా అడ్డు చెబుతుంది. దీప్తి అలా చేస్తుంది కాబట్టే ఆర్యకు ఆమంటే ఇష్టం లేదు. దాంతో తిడుతున్నాడు, కొడుతున్నాడు. తనకు అడ్డు చెప్పకపోతే ఆర్య అలా ఎందుకు చేస్తాడు. తప్పులన్నీ తన దగ్గర పెట్టుకొని ఇప్పుడు మాపైన కంప్లెయిట్‌ ఇవ్వడానికి మీ దగ్గరకు వచ్చింది’ అంటూ చెప్పుకొచ్చాడు.
దానికి మేము ‘ప్రేమించి పెండ్లి చేసుకోవడం తప్పెలా అవుతుంది. ఈ రోజుల్లో ఇది సాధారణమయ్యింది. పైగా ఇంత చిన్న వయసులో మీ అబ్బాయి తాగడం తప్పులేదు కాని అమ్మాయిలు ప్రేమించి పెండ్లి చేసుకుంటే చెడిపోయినట్టు భావిస్తున్నారు. పైగా మీరు బాధ్యత కలిగిన మీడియా సంస్థలో పని చేస్తున్నారు. అలాంటిది ఎంత ఉన్నతంగా ఆలోచించాలి. కానీ మీ ఆలోచనలు ఇంత కుచించుకుపోయి ఉన్నాయి. దీప్తి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి మీకు ఇష్టం లేకపోతే మీరు వెళ్లకండి. ఆమెను వెళ్ళొద్దని చెప్పడం సరి కాదు. మీకు ఎలా ఓ కుటుంబం ఉందో ఆమెకు కూడా ఓ కుటుంబం ఉంది. మీ ఇష్టాలను ఆమెపై బలవంతంగా రుద్దడం సరైనది కాదు. కనీసం ఆమె వద్ద ఫోన్‌ కూడా లేకుండా చేశారు. ఆమె ఏటీఎం కార్డు మీ దగ్గరే పెట్టుకున్నారు. ఆమె సంపాదన కూడా ఆమె వాడుకునేందుకు హక్కు లేదు. తన ప్రతి అవసరానికి డబ్బు మీ వద్ద అడగాలి. మీరు ఇలా ప్రవర్తించడం అస్సలు మంచిది కాదు.
ఇక బాబు ఆర్య ప్రవర్తన మితిమీరిపోయింది. వయసుకు మించి చెడు అలవాట్లకు బానిసయ్యాడు. వయసు పెరిగే కొద్ది అతని పరిస్థితి ఏంటో మీరే ఆలోచించుకోండి. మత్తు పదార్థాలకు బానిసైతే ఏం చేస్తారు. దీప్తిని మీరు కొట్టడమే కాకుండా బాబుతో కూడా కొట్టిస్తున్నారు. పిల్లల ముందు ఆమెకు విలువ లేకుండా చేస్తున్నారు. రేపు వాళ్ళు పెద్ద వాళ్ళు అయితే మిమ్మల్ని కూడా లెక్క చేయరు. చేయి దాటి పోతారు. మీరే ఆలోచించుకోండి. మీ భార్యను గౌరవించి పిల్లలను మంచి పౌరులుగా తీర్చి దిద్దుతారో లేదా వాళ్ళ జీవితాలను నాశనం చేస్తారో మీ ఇష్టం’ అని చెప్పాము.
దానికి అతను ‘మీరు చెప్పింది నిజమే మేడమ్‌. నేను ఇంత దూరం ఆలోచించలేదు. ఆర్యను వెంటనే ఓ మంచి హాస్టల్లో చేర్పిస్తాను. దీప్తిని మంచిగా చూసుకుంటాను. లేని పోని అనుమానాలతో ఇన్ని రోజులు దీప్తిని బాధపెట్టాను. చాలా ఇబ్బందులకు గురిచేశాను. నేను ఇంత బాధపెట్టినా దీప్తి ఎప్పుడూ నాకు ఎదురు మాట్లాడలేదు. ఇవేవీ పట్టించుకోకుండా తనతో లెక్కలేకుండా ప్రవర్తించాను. ఇకపై నేను మారతాను. తనను ప్రేమగా చూసుకుంటాను’ అని చెప్పి వెళ్ళిపోయాడు.
– వై వరలక్ష్మి,
9948794051

Spread the love