– రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పర్యావరణానికి ప్రమాదంగా మారిన సింగిల్ యూస్ ప్లాస్టిక్ వాడకాన్ని ప్రతిఒక్కరూ స్వచ్ఛందంగా నిషేదించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పిలుపు నిచ్చారు. శనివారం హైదరాబాద్‌లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం నిషేధంపై వర్క్‌షాపు నిర్వహించారు. అందులో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మెన్ రాజీవ్‌శర్మ, ఆయా శాఖల ప్రధాన కార్య దర్శులు, ముఖ్య కార్యదర్శులు పాల్గొ న్నారు. సీఎస్ శాంతి కుమారి మాట్లాడు తూ..ప్లాస్టిక్ వస్తువుల స్థానంలో స్టీల్, పింగాణీ వస్తువుల వాడకాన్ని అలవాటు చేసుకోవాలని సూచించారు. ప్లాస్టిక్ నిషేధం పై ఇప్పటికే ప్రభుత్వం పలు ఉత్తర్వులు జారీ చేసిన విషయాన్ని ప్రస్తావించారు. ప్లాస్టిక్ నిషేధాన్ని సచివాలయ స్థాయిలో స్వచ్ఛందంగా పాటించడం ద్వారా ఆదర్శంగా నిలవాలని సూచించారు. ప్రస్తుతం వినియోగిస్తున్న ప్లాస్టిక్‌లో కేవలం 9 శాతం మాత్రమే రీ-సైక్లింగ్ జరుగుతోందని, మిగిలిన ప్లాస్టీక్ వ్యర్థాలు నాలాలు, చెరువులు, నదీ జలాల్లో కలుస్తూ జీవనానికి పెను ముప్పుగా పరిణమిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే, రాష్ట్రంలోని 142 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 17 లక్షల మంది స్వయం సహాయక బృందాల మహిళలతో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై పౌరులను చైతన్య పరుస్తున్నామని తెలిపారు. అదేవిధంగా, ప్రతీ గ్రామంలో చెత్త నుండి ప్లాస్టిక్ వ్యర్దాలను వేరు చేస్తున్నామని వివరించారు. కాలుష్య నివారణ మండలి చైర్మెన్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు రాజీవ్ శర్మ మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతతో వ్యక్తిగంతగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్లాటిక్ నిషేధంపై ఇప్పటికే జిల్లా స్థాయిలో కమిటీలున్నాయని, ప్రజా చైతన్య కార్యక్రమాలను మరింత విస్తృత స్థాయిలో చేపట్టాలని సూచించారు. ప్లాస్టిక్ వస్తువుల స్థానంలో వినియోగించే ప్రత్యామ్నాయ వస్తువులపై ఏర్పాటు చేసిన ప్రదర్శనను సీఎస్ ప్రారంభించారు. ప్లాస్టిక్ నిషేధంపై ముద్రించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు.