లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో మండలంలో హోమ్ ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. శుక్రవారం నుండి ఈనెల 6 తేదీ వరకు అధికారులు ఈ హోం ఓటింగ్ అవకాశాన్ని కల్పించారు. 80 ఏండ్లు దాటిన వృద్ధులు, 40 శాతానికి పైబడిన దివ్యాంగులు తమ ఇంటి వద్ద నుంచే ఓటు హక్కు వినియోగించుకునేలా ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. ఈ మేరకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మండల అధికార యంత్రాంగం సైతం అవసరమైన ఏర్పాట్లు చేసింది. నిన్న శుక్రవారం నార్లాపూర్ లో దివ్యాంగురాలు దానుక శారదా దేవి ఇంటి వద్దనే ఓటు హక్కు వినియోగించుకున్నారు. నేడు శనివారం కాటాపూర్ కు చెందిన గంగెల్లి ముత్తమ్మ, గంట వెంకట్ రెడ్డి, మర్రి రామకృష్ణ అనే ముగ్గురు, రంగాపూర్ గ్రామానికి చెందిన ఆగబోయిన ముత్తక్క, పంబాపూర్ గ్రామానికి చెందిన అర్రెం సమ్మక్క, బీరెల్లి గ్రామానికి చెందిన వంగరి రామక్క, దాయ ముత్తక్క, దామెరవాయి గ్రామానికి చెందిన లొడారి హరీష్ అనే వికలాంగుడు మొత్తం తొమ్మిది మంది, హోమ్ ఓటింగ్ సద్వినియొగం చేసుకున్నారు. ఒక్కరు బీరెల్లి గ్రామానికి చెందిన మోటపోతుల ఆదిలక్ష్మి అనే వృద్ధురాలు బంధువుల ఇళ్లకు ఊరికి వెళ్ళింది. ఏడుగురు దివ్యాంగులు, ఇద్దరు వృద్ధులు, మొత్తం తొమ్మిది మంది ఇంటి వద్దనే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ కార్యక్రమంలో పోలింగ్ పార్టీ, సెక్టార్ ఆఫీసర్ కె జితేందర్, ఏఎస్ఐ చింత నారాయణ, పంచాయతీ కార్యదర్శి జ్ఞానేశ్వరి, మైక్రో అబ్జర్వర్ ఎల్ సందీప్, స్థానిక బిఎల్వోలు పాల్గొన్నారు.