‘వందేభారత్‌’ ప్చ్‌…

'వందేభారత్‌' ప్చ్‌...– 84 కిలోమీటర్ల వేగం నుంచి 76 కి.మీ వరకు తగ్గిన వేగం
– చార్జీ అధికం..స్పీడు స్వల్పం ..ఆర్టీఐలో వెలుగులోకి..
ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల కన్నా..దీటుగా వందే భారత్‌ తెచ్చాం…అని మోడీ ప్రభుత్వం చెప్పుకున్న మాటలు నీటిమూటలేనని స్పష్టమవుతోంది. ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో జనరల్‌ బోగీలను తగ్గించేసి..రిజర్వేషన్లతో ప్రయాణికుల జేబుల్లోనుంచి రైల్వేశాఖ పిండుకుంటోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.మరోవైపు వందే భారత్‌ ట్రైన్లు నత్తనడకన నడుస్తున్నాయన్న వాస్తవాలు సమాచారహక్కు చట్టం కింద బట్టబయలైంది.
న్యూఢిల్లీ : వందేభారత్‌ రైళ్ల వేగం తగ్గిపోతోంది. 2020-21లో సగటున గంటకు 84.48 కిలోమీటర్ల వేగంతో నడిచిన వందేభారత్‌ రైళ్లు 2023-24లో 76.25 కిలోమీటర్ల వేగంతో మాత్రమే నడిచాయి. మౌలిక సదుపాయాలకు సంబంధించిన పనులు జరుగుతున్నందున వందేభారత్‌ రైళ్లు మాత్రమే కాకుండా అనేక ఇతర రైళ్లు కూడా జాగరూకతతో కూడిన వేగంతో ప్రయాణిస్తున్నాయని రైల్వే అధికారులు తెలిపారు. దీనితో పాటు వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో కొన్ని చోట్ల రైళ్ల వేగాన్ని నియంత్రించాల్సి వచ్చిందని వారు చెప్పారు. భౌగోళిక పరిస్థితులు కూడా రైళ్ల వేగం తగ్గడానికి కారణమవుతున్నాయని వివరించారు.
కొంకణ్‌ రైల్వే పరిధిలోని చాలా ప్రాంతం ఘాట్లతో నిండి ఉంటుందని, అక్కడ రైళ్ల వేగం సహజంగానే తగ్గుతుందని అధికారులు తెలిపారు. ఉదాహరణకు ముంబయి సీఎస్‌ఎంటీ, మడ్‌గావ్‌ మధ్య నడుస్తున్న వందేభారత్‌ రైలు ఘాట్‌ మార్గంలోనే పయనిస్తుందని, తక్కువ ఎత్తున్న పర్వత శ్రేణి మీదుగా నడుస్తుందని చెప్పారు. అలాంటి ప్రదేశంలో వేగం పెంచితే భద్రత ప్రమాదంలో పడుతుందని అన్నారు. వర్షాకాలంలో పరిస్థితులు అనుకూలంగా ఉండవని, అప్పుడు గరిష్ట వేగాన్ని గంటకు 75 కిలోమీటర్లకే పరిమితం చేస్తామని తెలిపారు.
మధ్యప్రదేశ్‌కు చెందిన చంద్రశేఖర్‌ గార్‌ ఆర్‌టీఐ ద్వారా సేకరించిన సమాచారం ప్రకారం 2020-21లో వందేభారత్‌ రైళ్లు సగటున గంటకు 84.48 కిలోమీటర్లు, 2021-22లో 81.38 కిలోమీటర్లు, 2022-23లో 76.25 కిలోమీటర్ల వేగంతో నడిచాయి. వందేభారత్‌ రైలు గరిష్టంగా గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించ గలదు. అయితే దాని వేగం ఢిల్లీ-ఆగ్రా మార్గంలో మినహా దేశంలో ఎక్కడా 130 కిలోమీటర్లు దాటడం లేదు. కాగా వందేభారత్‌ రైళ్ల వేగాన్ని పెంచేందుకు ట్రాక్‌లను ఆధునీకరిస్తున్నామని ఓ అధికారి తెలిపారు. ఈ పనులు పూర్తయితే రైళ్ల వేగం గంటకు 250 కిలోమీటర్లకు పెరుగుతుందని చెప్పారు.
కొన్ని మార్గాల్లో వందేభారత్‌ రైళ్ల వేగం ఘోరంగా ఉంటోంది. డెహ్రాడూన్‌-ఆనంద్‌విహార్‌ (గంటకు 63.42 కిలోమీటర్లు), పాట్నా-రాంచీ (62.9 కిలోమీటర్లు), కోయంబత్తూరు-బెంగళూరు (58.11 కిలోమీటర్లు) రైళ్ల వేగం జాతీయ సగటు కంటే చాలా తక్కువగా ఉంటోంది. వందేభారత్‌ రైళ్లను ప్రవేశపెట్టి ఐదు సంవత్సరాలు గడిచినప్పటికీ ఏ మార్గంలోనూ ట్రాక్‌లను మార్చలేదు.

Spread the love