పాలేరు అసెంబ్లీ బరిలో తమ్మినేని వీరభద్రం

నవతెలంగాణ-ఖమ్మం రూరల్‌
పాలేరు నియోజకవర్గం సీపీఐ(ఎం) అభ్యర్థిగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పోటీ చేస్తున్నారు. 13-05-1954న ఖమ్మం రూరల్‌ మండలం తెల్దారుపల్లి గ్రామంలో జన్మించారు. సీపీఐ (ఎం) పూర్తికాలం కార్యకర్త పని చేస్తున్న ఆయన ప్రస్తుతం సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా పని చేస్తున్నారు.
రాజకీయ ప్రవేశం: 1971లో సీపీఐ(ఎం)లో చేరిక. సాధారణ కార్యకర్తగా రాజకీయ జీవితం ప్రారంభం. ఖమ్మం డివిజన్‌, ఖమ్మం జిల్లా యువజనోద్యమ నిర్మాణానికి కృషి చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడిగా, రాష్ట్ర కార్యదర్శిగా అనేక ఉద్యమాలు, పోరాటాలకు నాయకత్వం వహించారు. 1985లో ఖమ్మం డివిజన్‌ కార్యదర్శిగా ఎన్నికైనారు. 1990లో జిల్లా తాత్కాలిక కార్యదర్శిగా, 1991లో జిల్లా కార్యదర్శిగా ఎన్నికై 1996 వరకు పని చేశారు. తిరిగి 2001లో జిల్లా కార్యదర్శిగా రెండోసారి ఎన్నికైనారు. 1986లో రాష్ట్ర కమిటీ సభ్యుడిగా, 1990 నుండి రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడిగా, 1999 నుండి కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎన్నికై నేటి వరకు కొనసాగుతున్నారు. 2021లో జరిగిన అఖిల భారత మహాసభల్లో 7వ సారి కేంద్ర కమిటీ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైనారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 2014లో హైదరాబాద్‌లో, 2018లో నల్గొండలో మరియు 2021లో ఇబ్రహీంపట్నంలో జరిగిన రాష్ట్ర మహాసభల్లో సీపీఐ (ఎం) పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైనారు.
ప్రజా ప్రతినిధిగా అనుభవం : 1991లో మొదటిసారిగా ఖమ్మం పార్లమెంట్‌కు పోటీచేసి స్వల్పతేడాతో ఓటమిచెందారు. 1996లో ఖమ్మం నుండి పార్లమెంట్‌ సభ్యునిగా ఎన్నికైనారు. 2004లో ప్రతిష్టాత్మకంగా జరిగిన ఎన్నికల్లో ఖమ్మం అసెంబ్లీ స్థానం నుండి శాసన సభ్యునిగా ఎన్నికైనారు.
అభిమానించే నాయకుడు : పుచ్చలపల్లి సుందరయ్య
మరిచిపోలేని అనుభవం : 2,662 కి.మీ, 100 రోజుల పాదయాత్రలో ప్రజలు చూపిన ఆదరణ.
హాబీలు : అధ్యయనం, మార్క్సిస్టు తత్వశాస్త్రాన్ని, రాజకీయ అర్ధశాస్త్రాన్ని నిరంతరం అధ్యయనం చేయటం, బోధించటం, ఇంటర్నెట్‌ ద్వారా ప్రతిరోజూ జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలను పరిశాలన చేయటం, విశ్లేషించటం నిత్య కార్యక్రమం. పార్టీ కార్యక్రమాన్ని, పార్టీ నిర్మాణం, రాజకీయ పరిణామాలు, క్లాసులు బోధించటంలో మంచి అనుభవం వుంది. ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా అనేక మంది మేధావులు, పార్టీ నాయకులతో స్టడీసర్కిల్‌ నిర్వహించటం, అధ్యయనం పట్ల ఆయనకున్న పట్టుదలకు నిదర్శనం, నిత్యం ప్రజలతో మమేకమై ప్రజా సమస్యల్ని తెలసుకోవటం, పరిష్కారం చేయటం, పర్యటనలు, పార్టీ, కార్యక్రమాల్లో నిమగం.
మహాజన పాదయాత్ర: తెలంగాణ సమగ్రాభివృద్ధి, సామాజిక న్యాయం కొరకు 2016 అక్టోబర్‌ 17నుండి మహాజన పాదయాత్ర తమ్మినేని నాయకత్వంలో 9 మంది సభ్యులతో ప్రారంభమైంది. 2017 మార్చి వరకు సుమారు 5 నెలలు తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాలో 4,200 పైచిలుకు కి.మీ.లు పాదయాత్ర నిర్వహించారు. రాష్ట్రంలో దీని ప్రభావం వల్ల ప్రభుత్వం కూడా సామాజిక తరగతులకు పథకాలు ప్రవేశ పెట్టనైనది.

Spread the love