మరణానికి ముందు బాధితుడి ఆవేదన.. “నిందితులను కఠినంగా శిక్షించండి”
హత్య కేసుగా దర్యాప్తు.. పరారీలో నిందితుల కోసం ప్రత్యేక బృందాల గాలింపు
నవతెలంగాణ–గీసుగొండ
గీసుగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనలో తీవ్రంగా గాయపడిన ఏనుమాముల ఎన్‌టీఆర్ నగర్‌కు చెందిన వ్యాపారి. కాంగ్రెస్ నాయకుడు అడుప మహేష్ (45) చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. దీంతో తొలుత హత్యాయత్నం కింద నమోదు చేసిన కేసును పోలీసులు హత్య కేసుగా మార్చి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూలై 18న రాత్రి సుమారు 9 గంటల సమయంలో మహేష్‌ను అతని స్నేహితుడు జన్ను మధు ఫోన్ చేసి గొర్రెకుంటలోని కోటిలింగాల దేవాలయం సమీపానికి రావాలని కోరాడు. మొదట నిరాకరించినప్పటికీ బలవంతంగా అక్కడికి పిలిపించి మద్యం తాగించినట్లు తెలిసింది. అనంతరం అక్కడికి వచ్చిన పత్తి కుమార్, “నా గురించి ఎమ్మెల్యే వద్ద ఎందుకు చెడుగా మాట్లాడుతున్నావు?” అంటూ వాగ్వాదానికి దిగినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
అనంతరం మహేష్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించి హత్యాయత్నానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన మహేష్‌ను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. సుమారు 50 శాతం కాలిన గాయాలు కావడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రికి తరలిస్తుండగా, భువనగిరి సమీపంలో ఆయన మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. మృతుడి భార్య అడుప నాగలక్ష్మి ఫిర్యాదు మేరకు పత్తి కుమార్, జన్ను మధుపై తొలుత హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు, మహేష్ మృతి చెందడంతో కేసును హత్య కేసుగా మార్చి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు ప్రస్తుతం పరారీలో ఉండగా, వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.
మరణానికి ముందు బాధితుడి ఆవేదన
చికిత్స పొందుతున్న సమయంలో మహేష్ తనకు జరిగిన ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తనను నమ్మి వచ్చిన వారే మోసం చేసి ఈ దారుణానికి పాల్పడ్డారని, ప్రజలకు ఇలాంటి పరిస్థితి రాకూడదని వేదన వ్యక్తం చేసినట్లు చెప్పారు. నిందితులు, వారికి సహకరించిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని, బాధ్యులెవరైనా శిక్ష తప్పక అనుభవించాలని కోరినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.
నిందితుడిపై గతంలోనూ కేసులు
పోలీసుల సమాచారం ప్రకారం ప్రధాన నిందితుడు పత్తి కుమార్ పై గతంలో హత్యతో పాటు పలు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఏనుమాముల పోలీస్ స్టేషన్‌లో అతనిపై రౌడీషీట్ కొనసాగుతుండగా, గతంలో ఒక హత్య కేసులో జీవిత ఖైదు శిక్ష కూడా అనుభవించినట్లు సమాచారం. ఈ సందర్భంగా గీసుగొండ సీఐ డి. విశ్వేశ్వర్ మాట్లాడుతూ.. నిందితులను త్వరలోనే అరెస్టు చేసి చట్టం ముందు నిలబెడతామని తెలిపారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే నేరస్థులపై కఠిన చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.



