జయం మనదే!

Victory is ours!– 4-1తో టెస్టు సిరీస్‌ మన సొంతం
– ధర్మశాల టెస్టులో భారత్‌ ఘన విజయం
– ఇంగ్లాండ్‌పై ఇన్నింగ్స్‌ 64 పరుగులతో గెలుపు
– అశ్విన్‌ మాయకు ఇంగ్లాండ్‌ 195/10
జయం మనదే. ఐదు మ్యాచుల టెస్టు సిరీస్‌ను టీమ్‌ ఇండియా 4-1తో సొంతం చేసుకుంది. ధర్మశాల టెస్టులో ఇంగ్లాండ్‌ను చిత్తు చేసిన ఆతిథ్య భారత్‌ ఇన్నింగ్స్‌ 64 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కెరీర్‌ వందో టెస్టు మాయగాడు అశ్విన్‌ (5/77) ఐదు వికెట్ల మాయకు ఇంగ్లాండ్‌ కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్‌లో బెన్‌స్టోక్స్‌ సేన 195 పరుగులకే ఆలౌటైంది. మూడు రోజుల్లోనే లాంఛనం ముగించిన రోహిత్‌సేన.. 4-1తో టెస్టు సిరీస్‌ను, ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ పాయింట్ల పట్టికలో అగ్రస్థానం కైవసం చేసుకుంది.
బజ్‌బాల్‌ వచ్చింది. బజ్‌బాల్‌ మెరిసింది. కానీ స్పిన్‌బాల్‌ ముంగిట చివరకు బజ్‌బాల్‌ చిత్తుగా ఓడింది!. హైదరాబాద్‌ టెస్టులో విజయంతో బజ్‌బాల్‌ మేనియా కనిపించగా.. ఆ తర్వాత వరుసగా నాలుగు టెస్టుల్లో విజయాలు సాధించిన భారత్‌ సొంతగడ్డపై తిరుగులేని రికార్డును నిలుపుకుంది. కీలక ఆటగాళ్ల సేవలు దూరమైనా.. బలమైన ఇంగ్లాండ్‌ మెడలు వంచింది. 4-1తో టెస్టు సిరీస్‌ను సాధించింది. చైనామన్‌ స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలువగా, యువ సంచలనం యశస్వి జైస్వాల్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌’ అవార్డును దక్కించుకున్నాడు.
నవతెలంగాణ-ధర్మశాల
ఐదు మ్యాచుల మహా టెస్టు సిరీస్‌లో భారత్‌ విజయం సాధించింది. ధర్మశాల టెస్టులో ఇంగ్లాండ్‌ను ఇన్నింగ్స్‌ 64 పరుగుల తేడాతో చిత్తు చేసిన టీమ్‌ ఇండియా.. 4-1తో టెస్టు సిరీస్‌ను సాధించింది. ట్రంప్‌కార్డ్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ కెరీర్‌ వందో టెస్టులో తనదైన మాయ చూపించాడు. అశ్విన్‌ ఐదు వికెట్ల మాయజాలంతో ఇంగ్లాండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 195 పరుగులకే కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్‌లో 259 పరుగుల లోటుతో రెండోసారి బ్యాటింగ్‌కు వచ్చిన ఇంగ్లాండ్‌ 48.1 ఓవర్లలోనే చేతులెత్తేసింది. ఇంగ్లాండ్‌ బ్యాటర్‌ జో రూట్‌ (84, 128 బంతుల్లో 12 ఫోర్లు) అర్థ సెంచరీతో ఓ ఎండ్‌లో నిలబడినా.. సహచర బ్యాటర్ల నుంచి మద్దతు లభించలేదు. జానీ బెయిర్‌స్టో (39, 31 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), టామ్‌ హర్ట్‌లీ (20, 24 బంతుల్లో 4 ఫోర్లు) ఇంగ్లాండ్‌ ఓటమి అంతరాన్ని కుదించగలిగారు. పేస్‌ దళపతి జశ్‌ప్రీత్‌ బుమ్రా (2/38), చైనామన్‌ స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ (2/40) సైతం వికెట్ల వేటలో మెరువటంతో ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌ లోటును సైతం అధిగమించలేదు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 477 పరుగుల భారీ స్కోరు నమోదు చేయగా.. రోహిత్‌ శర్మ (103), శుభ్‌మన్‌ గిల్‌ (110), దేవదత్‌ పడిక్కల్‌ (65), యశస్వి జైస్వాల్‌ (57), సర్ఫరాజ్‌ ఖాన్‌ (56) రాణించారు. ఐదు మ్యాచుల టెస్టు సిరీస్‌ను 4-1తో గెల్చుకున్న భారత్‌.. ఆంటోనీ డి మెల్లో ట్రోఫీని అందుకుంది. సిరీస్‌లో 712 పరుగులు బాదిన యశస్వి జైస్వాల్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌’గా నిలువగా.. స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కించుకున్నాడు.
అశ్విన్‌ మ్యాజిక్‌ : 259 పరుగుల భారీ తొలి ఇన్నింగ్స్‌ లోటుతో రెండో ఇన్నింగ్స్‌ మొదలెట్టిన ఇంగ్లాండ్‌కు ఆఫ్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ చుక్కలు చూపించాడు. ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌లోనే వికెట్ల వేటకు తెరతీశాడు. ఫామ్‌లో ఉన్న ఓపెనర్లు బెన్‌ డకెట్‌ (2), జాక్‌ క్రావ్లీ (0) అశ్విన్‌ మాయకు తలొగ్గారు. డకెట్‌ను బౌల్డ్‌ చేసిన అశ్విన్‌.. క్రావ్లీని షార్ట్‌ లెగ్‌లో సర్ఫరాజ్‌ క్యాచ్‌తో సాగనంపాడు. నం.3 బ్యాటర్‌ ఒలీ పోప్‌ (19) సైతం అశ్విన్‌ మాయలో చిత్తయ్యాడు. మూడు ఫోర్లతో ఎదురుదాడి ప్రయత్నం చేసిన పోప్‌ స్వీప్‌ షాట్‌తో వికెట్‌ కోల్పోయాడు. 36/3తో ఇంగ్లాండ్‌ వందలోపే కుప్పకూలేలా కనిపించింది. టాప్‌-3 వికెట్లను పడగొట్టిన అశ్విన్‌కు కుల్దీప్‌ యాదవ్‌ తోడయ్యాడు. వందో టెస్టు బ్యాటర్‌ జానీ బెయిర్‌స్టో (39) ధనాధన్‌కు కుల్దీప్‌ తెరదించాడు. మూడు ఫోర్లు, సిక్సర్లతో దూకుడుగా ఆడిన బెయిర్‌స్టోను కుల్దీప్‌ యాదవ్‌ ఎల్బీగా సాగనంపాడు. ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ (2)ను అశ్విన్‌ మ్యాజిక్‌ బంతితో క్లీన్‌బౌల్డ్‌ చేయగా ఇంగ్లాండ్‌ 103/5తో ఓటమి కోరల్లో కూరుకుంది. లంచ్‌ విరామ సమయానికి ఇంగ్లాండ్‌ ఐదు వికెట్లు చేజార్చుకోగా.. ఓ ఎండ్‌లో జో రూట్‌ నిలబడ్డాడు.
రూట్‌ విసిగించినా..! : సహచర బ్యాటర్లు స్పిన్‌కు విలవిల్లాడుతూ పెవిలియన్‌కు చేరగా.. ఓ ఎండ్‌లో జో రూట్‌ (84) నిలబడ్డాడు. పోప్‌, బెయిర్‌స్టోలతో భాగస్వామ్యాలు నమోదు చేసేందుకు ప్రయత్నించినా.. సాధ్యపడలేదు. ఆ తర్వాత టెయిలెండర్లతో కలిసి ఆశలు ఆవిరైన మ్యాచ్‌లో ఆఖరు వరకు నిలిచాడు. బెన్‌ ఫోక్స్‌ (2) వికెట్‌తో అశ్విన్‌ ఐదు వికెట్ల ఘనత సాధించగా.. మార్క్‌వుడ్‌ (0), టామ్‌ హర్ట్‌లీ (20)లను జశ్‌ప్రీత్‌ బుమ్రా ఒకే ఓవర్లో అవుట్‌ చేశాడు. షోయబ్‌ బషీర్‌ (13) కథ జడేజా ముగించగా.. జో రూట్‌ వికెట్‌తో కుల్దీప్‌ యాదవ్‌ సిరీస్‌ విజయాన్ని అందించాడు. 48.1 ఓవర్లలో ఇంగ్లాండ్‌ 195 పరుగులకే కుప్పకూలింది. ఇన్నింగ్స్‌ 64 పరుగుల తేడాతో భారత్‌ ఘన విజయం సాధించింది.
అండర్సన్‌… 700 : అంతకుముందు టీమ్‌ ఇండియా తొలి ఇన్నింగ్స్‌ వేగంగానే ముగిసింది. ఓవర్‌నైట్‌ స్కోరు 473/8తో బ్యాటింగ్‌కు వచ్చిన కుల్దీప్‌ యాదవ్‌ (30, 69 బంతుల్లో 2 ఫోర్లు), జశ్‌ప్రీత్‌ బుమ్రా (20, 64 బంతుల్లో 2 ఫోర్లు) ఎంతోసేపు క్రీజులో నిలువలేదు. కుల్దీప్‌ యాదవ్‌ను అవుట్‌ చేసిన జేమ్స్‌ అండర్సన్‌ టెస్టుల్లో 700వ వికెట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. సిరీస్‌ ఓటమి, ధర్మశాలలో ఇన్నింగ్స్‌ పరాజయం నైరాశ్యంలో ఉన్న ఇంగ్లాండ్‌ అభిమానులకు అండర్సన్‌ అద్వితీయ రికార్డు ఓ ఊరట. ఓవర్‌నైట్‌ స్కోరుకు 4 పరుగులు జోడించిన భారత్‌ 477 పరుగులకు ఆలౌటైంది. బుమ్రాను బషీర్‌ అవుట్‌ చేయటంతో భారత తొలి ఇన్నింగ్స్‌కు తెరపడింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 259 పరుగుల ఆధిక్యం సాధించింది. ఇంగ్లాండ్‌ బౌలర్లలో షోయబ్‌ బషీర్‌ (5/173) ఐదు వికెట్ల ప్రదర్శన చేయగా.. జేమ్స్‌ అండర్సన్‌ (2/60), టామ్‌ హర్ట్‌లీ (2/126), బెన్‌ స్టోక్స్‌ (1/17) రాణించారు.
స్కోరు వివరాలు
ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌ : 218/10
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ : 477/10
ఇంగ్లాండ్‌ రెండో ఇన్నింగ్స్‌ : జాక్‌ క్రావ్లీ (సి) సర్ఫరాజ్‌ (బి) అశ్విన్‌ 0, బెన్‌ డకెట్‌ (బి) అశ్విన్‌ 2, ఒలీ పోప్‌ (సి) యశస్వి (బి) అశ్విన్‌ 19, జో రూట్‌ (సి) బుమ్రా (బి) కుల్దీప్‌ 84, జానీ బెయిర్‌స్టో (ఎల్బీ) కుల్దీప్‌ 39, బెన్‌ స్టోక్స్‌ (బి) అశ్విన్‌ 2, బెన్‌ ఫోక్స్‌ (బి) అశ్విన్‌ 8, టామ్‌ హర్ట్‌లీ (బి) బుమ్రా 20, మార్క్‌వుడ్‌ (ఎల్బీ) బుమ్రా 0, షోయబ్‌ బషీర్‌ (బి) జడేజా 13, జేమ్స్‌ అండర్సన్‌ నాటౌట్‌ 0,ఎక్స్‌ట్రాలు : 8, మొత్తం : (48.1 ఓవర్లలో ఆలౌట్‌) 195.
వికెట్ల పతనం : 1-2, 2-21, 3-36, 4-92, 5-103, 6-113, 7-141, 8-141, 9-189, 10-195.
బౌలింగ్‌ : జశ్‌ప్రీత్‌ బుమ్రా 10-2-38-2, రవిచంద్రన్‌ అశ్విన్‌ 14-0-77-5, రవీంద్ర జడేజా 9-1-25-1, కుల్దీప్‌ యాదవ్‌ 14.1-0-40-2, మహ్మద్‌ సిరాజ్‌ 1-0-8-0.

178-178

టెస్టు క్రికెట్‌లో భారత్‌ గెలుపోటముల రికార్డు 178-178. చరిత్రలో తొలిసారి భారత్‌ టెస్టు విజయాలు, ఓటములు సమానంగా ఉన్నాయి. గతంలో భారత్‌ విజయాల కంటే ఓటములే ఎక్కువగా ఉండేవి. ఆస్ట్రేలియా (1.780), ఇంగ్లాండ్‌ (1.209), దక్షిణాఫ్రికా (1.105), పాకిస్థాన్‌ (1.042) మాత్రమే పాజిటివ్‌ గెలుపోటముల రికార్డుతో ఉన్నాయి.
700
టెస్టు క్రికెట్‌ చరిత్రలో 700 వికెట్లు పడగొట్టిన ఏకైక పేసర్‌గా జేమ్స్‌ అండర్సన్‌ నిలిచాడు. అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ల జాబితాలో ముత్తయ్య మురళీధరన్‌ (800), షేన్‌ వార్న్‌ (708) మాత్రమే అండర్సన్‌ ముంగిట ఉన్నారు. మురళీధరన్‌, షేన్‌ వార్నర్‌ ఇద్దరూ స్పిన్నర్లు కాగా.. అండర్సన్‌ ఒక్కడే పేస్‌ బౌలర్‌.
36
టెస్టుల్లో అశ్విన్‌ ఐదు వికెట్ల ప్రదర్శనలు 36. భారత బౌలర్లలో అనిల్‌ కుంబ్లేను (35)ను అశ్విన్‌ అధిగమించాడు. ఓవరాల్‌గా రిచర్డ్‌ హాడ్లి (36)తో కలిసి మూడో స్థానంలో ఉన్నాడు. ముత్తయ్య మురళీధరన్‌ (67), షేన్‌ వార్న్‌ (37) ముందున్నారు.
9/128
కెరీర్‌ వందో టెస్టులో అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాళ్లలో అశ్విన్‌ అగ్రస్థానంలో నిలిచాడు. ముత్తయ్య మురళీధరన్‌ 2006 బంగ్లాదేశ్‌తో టెస్టులో 9/141 గణాంకాలు నమోదు చేయగా.. అశ్విన్‌ ఆ గణాంకాలను దాటాడు. వందో టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో 4 ప్లస్‌ వికెట్లు పడగొట్టిన ఏకైక బౌలర్‌గానూ అశ్విన్‌ నిలిచాడు.
9/128
100 : స్వదేశంలో ఇంగ్లాండ్‌ అశ్విన్‌ పడగొట్టిన వికెట్లు వంద. ఈ జాబితాలో అశ్విన్‌ మూడో స్థానంలో నిలిచాడు. స్వదేశంలో స్టువర్ట్‌ బ్రాడ్‌ (106) ఆస్ట్రేలియాపై, జేమ్స్‌ అండర్సన్‌ (105) భారత్‌పై వందకు పైగా వికెట్లు పడగొట్టిన బౌలర్లలో ఉన్నారు.

Spread the love