ఖమ్మం డీఎంహెచ్‌వోపై విజి’లెన్స్‌’

Vigilance on Khammam DMHO– ‘నవతెలంగాణ’ కథనాలతో కదలిక
– ఆధారాలు సమర్పించాలని వరంగల్‌ రీజియన్‌ విజిలెన్స్‌ ఆఫీస్‌ నుంచి ఆదేశాలు
– మహబూబాబాద్‌ ఎమ్మెల్యేను అడ్డుపెట్టుకుని ఎంక్వయిరీ నుంచి బయటపడే యత్నం
– ముఖ్యమంత్రి పేషీ సూచన మేరకే ఎంక్వయిరీకి ఆదేశించినట్టు సమాచారం
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి / ఖమ్మం
ఖమ్మం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖలో చోటు చేసుకుంటున్న అవకతవకలపై ‘నవతెలంగాణ’లో ప్రచురితమైన కథనాలు, పబ్లిక్‌ హెల్త్‌ అండ్‌ మెడికల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌, టీఎస్‌ (పీహెచ్‌ఎంఈయూ) ఖమ్మం జిల్లా కమిటీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రీజినల్‌ విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆఫీసర్‌ ఎ.బాలకోటి విచారణకు ఆదేశించారు. డీఎంహెచ్‌వో మాలతి నాలుగేండ్ల క్రితం బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి వైద్యారోగ్యశాఖలోని వివిధ విభాగాల్లో నిధుల దుర్వినియోగం జరిగినట్టు ఆమెపై ఆరోపణలున్నాయి. దాంతో ఆయా సెక్షన్‌ల నుంచి వివరాలు సమర్పించాల్సిందిగా విజిలెన్స్‌ ఏఎస్పీ సూచించారు. ‘నవతెలంగాణ’ కథనంలో ప్రస్తావించిన ప్రతి అంశానికీ సంబంధించిన వివరణను విజిలెన్స్‌ ఆఫీసర్‌ కోరారు. గత నెల 25వ తేదీన డీఎంహెచ్‌వో ఆఫీస్‌కు ఈ వివరాలు సమర్పించాల్సిందిగా ఆదేశాలు అందాయి. ఈ విషయం బయటకు రాకుండా డీఎంహెచ్‌వో కార్యాలయం జాగ్రత్త పడింది. డీఎంహెచ్‌వో కార్యాలయం నుంచి వివరాలు పంపినా.. అవి పూర్తిస్థాయిలో లేకపోవడంతో తిరిగి పంపించాల్సిందిగా విజిలెన్స్‌ ఆఫీసర్‌ ఆదేశాలిచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేషీ నుంచే విజిలెన్స్‌ అధికారులకు ఈ వ్యవహారంపై ఆదేశాలున్నట్టు సమాచారం.
విజిలెన్స్‌ అధికారి అడిగిన వివరాలు ఏంటి..?
జిల్లాలో ఎన్ని ప్రయివేటు హాస్పిటల్స్‌ ఉన్నాయి? 2019 సంవత్సరం నుంచి వాటిలో శాశ్వత, తాత్కాలిక ప్రాతిపదికన అనుమతులు ఎన్నింటికి ఇచ్చారు, 2019 నుంచి 2023వరకు హైదరాబాద్‌ నుంచి వచ్చిన హయ్యర్‌ అఫీషియల్స్‌ను హౌటల్‌ రూమ్స్‌లో ఉంచేందుకు చేసిన ఖర్చు ఎంత?, 2019 నుంచి 2021 వరకు నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం)కు మంజూరైన నిధులు ఎన్ని? వాటిలో ఎంత ఖర్చు చేశారు, 2019 నుంచి 2023 వరకు ఎన్ని ప్రయివేటు వాహనాలను అద్దె ప్రాతిపదికన శాఖ అవసరాలకు వినియోగించారు. వాటికి చెల్లించిన వ్యయం ఎంత? 2019 నుంచి 2022 వరకు కరోనా వ్యాప్తి నియంత్రణకు వచ్చిన నిధులు ఎన్ని? వాటిలో ఎంత మొత్తం ఖర్చు చేశారు? అలాగే రెమ్‌డిసివర్‌ ఇంజిక్షన్‌లు, ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్లు ఎన్ని వచ్చాయి? వాటి పంపిణీ వివరాలతో పాటు ఖమ్మంలోని మమత మెడికల్‌ కళాశాలకు ఎన్ని పంపిణీ చేశారో వివరాలను కూడా అందించాల్సిందిగా కోరారు. అలాగే 2019 నుంచి కారుణ్య నియామకాలు, సంబంధిత ఉద్యోగుల అర్హతలకు సంబంధించిన వివరాలూ సమర్పించాల్సిందిగా అడిగారు. 2019 నుంచి 2023 వరకు నేషనల్‌ క్వాలిటీ ఎస్యూరెన్స్‌ స్టాండర్డ్స్‌ (ఎన్‌క్యూఏఎస్‌) నిధులు ఎన్ని వచ్చాయి? వాటిని ఎలా ఖర్చు చేశారు? తదితర వివరాలను ఆర్డర్స్‌ అందిన వారం రోజుల్లో అందించాల్సిందిగా ఆదేశాలిచ్చారు.
అరకొర ఆధారాలు..
విజిలెన్స్‌ అధికారి అడిగిన ఆధారాలను అరకొర సమాచారంతో డీఎంహెచ్‌వో కార్యాలయం నుంచి పంపినట్టు తెలుస్తోంది. అయితే వాటన్నింటినీ తిరిగి పంపించి జిరాక్స్‌ ప్రతులతో సమర్పించాల్సిందిగా విజిలెన్స్‌ అధికారి కోరారు. ఈమేరకు మే 11వ తేదీన తిరిగి పంపారు. అయినప్పటికీ ఆ వివరాలు సమగ్రంగా లేకపోవడంతో మళ్లీ 17వ తేదీన కూడా పంపించారని సమాచారం.
ఎంక్వయిరీ తప్పించేందుకు తంటాలా..?
ఖమ్మం డీఎంహెచ్‌వో అవకతవకలపై ‘నవతెలంగాణ’లో వచ్చిన కథనాలు నేరుగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క దృష్టికి ఉద్యోగ సంఘాల నేతలు తీసుకెళ్లారు. వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ దృష్టికి కూడా తీసుకెళ్లినా.. అక్కడ ఓ ఉద్యోగి అడ్డుకుంటున్నట్టు తెలుస్తోంది. జిల్లాలోని ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడు పీహెచ్‌సీలో ఒకప్పుడు ఫార్మసిస్టుగా పనిచేసిన ఉద్యోగి, అలాగే నేలకొండపల్లి మండలం బోదులబండ పీహెచ్‌సీలో ల్యాబ్‌టెక్నిషియన్‌గా పనిచేస్తూ డిప్యూటేషన్‌పై వైద్యారోగ్యశాఖలో విధులు నిర్వహిస్తున్న మరో ఉద్యోగి డీఎంహెచ్‌వోను ఈ వ్యవహారంలో కాపాడేందుకు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని సమాచారం. అలాగే హెల్త్‌ డైరెక్టరేట్‌లోనూ ఓ ఉన్నతస్థాయి ఉద్యోగి అండదండలు డీఎంహెచ్‌వోకు ఉన్నాయనే చర్చ జిల్లా వైద్యారోగ్యశాఖలో సాగుతోంది.
మహబూబాబాద్‌ ఎమ్మెల్యేతో పైరవీ?
మహబూబాబాద్‌ ఎమ్మెల్యే మురళీనాయక్‌తో ఉన్న బంధుత్వాన్ని అడ్డుపెట్టుకుని విజిలెన్స్‌ ఎం్వయిరీ నుంచి బయటపడేందుకు డీఎంహెచ్‌వో ప్రయత్నిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే నేరుగా సీఎం పేషీ నుంచే ఎంక్వయిరీకి ఆదేశాలు అందిన నేపథ్యంలో డీఎంహెచ్‌వో దిక్కుతోచని స్థితిలో పడ్డారని సమాచారం. జిల్లాలోని ముగ్గురు మంత్రులు మల్లు భట్టివిక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి దృష్టికి సైతం డీఎంహెచ్‌వో వ్యవహారాన్ని ఉద్యోగ సంఘాలు తీసుకెళ్లాయి. గతంలో డీఎంహెచ్‌వో తీరుపై ఏసీబీ అధికారులకు సైతం ఫిర్యాదులు వెళ్లటం గమనార్హం. విజిలెన్స్‌ ఎంక్వయిరీపై ‘నవతెలంగాణ’ డీఎంహెచ్‌వోను సంప్రదించింది. దీనిపై ఆమె నుంచి సరైన సమాధానం లేదు.
సెలవులో ఉన్నాను.. నాకు తెలియదు.. – బి. మాలతి, ఖమ్మం జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి
విజిలెన్స్‌ ఎంక్వయిరీకి ఆదేశాలు వచ్చినప్పుడు మా నాన్నగారు చనిపోవడంతో సెలవులో ఉన్నాను. కాబట్టి నాకు ఈ విషయం తెలియదు. ఆధారాలను పంపారో లేదో తెలుసుకుంటాను.

Spread the love