జోరుగా స్వచ్ఛ కాలనీ కార్యక్రమం

నవతెలంగాణ – ఆర్మూర్  
పట్టణంలోని జర్నలిస్ట్ కాలనీలో అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో  ఆదివారం రెండు  గంటలు అనే నినాదంతో నిర్వహిస్తున్న స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమం 41 వ వారం ఉత్సాహంగా జరిగింది. కాలనీ అభివృద్ది కమిటి అద్వర్యంలో ఈ ఆదివారం కాలనీ లోని  రోడ్డు నెంబర్ 1 లో ఉత్సాహంగా శ్రమదానం నిర్వహించారు. ఈ రోడ్డుపై గత వారం కొంత భాగం శుభ్రం చేశారు. ఈ వారం ముళ్ళ పొదలను, పిచ్చి మొక్కలను తొలగించారు. పనికిరాని చెట్లను నరికేశారు. వ్యర్థాలను, చెత్తా చెదారాన్ని కుప్పలుగా పోసి నిప్పంటించి కాల్చేశారు. ఇరిగేషన్ భవనాల పరిసరాల్లో ఉన్న చెత్తను తొలగించి పరిశుభ్రం చేశారు. ఈ సందర్బంగా కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు గోసికొండ అశోక్ మాట్లాడుతూ 41 వారాలుగా  స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమాన్ని విజయవంతంగా  నిర్వహిస్తూ అన్ని కాలనీలకు ఆదర్శంగా నిలుస్తున్నామని తెలిపారు. కాలనీ అభివృద్ధికి పార్టీలకతీతంగా నిధులు మంజూరు చేసి ప్రోత్సహించాలని ఆయన అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులను కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ పట్టణ శాఖ అధ్యక్షులు సాయిబాబాగౌడ్ అభివృద్ది కమిటి ప్రతినిధులను అభినందించారు. ప్రతి ఆదివారం స్వచ్ఛ కాలనీ కార్యక్రమం నిర్వహిస్తూ కాలనీ వాసులకు పరిశుభ్రతపై చైతన్యపరచడం గొప్ప విషయమని ఆయన పేర్కొన్నారు.  కాలనీ అద్యక్షుడు గోసికొండ అశోక్, ఆలయ కమిటి  అద్యక్షుడు పుప్పాల  శివరాజ్ కుమార్, కాలనీ కోశాధికారి సత్యనారాయణ గౌడ్, ఉపాధ్యక్షులు  సుంకే శ్రీనివాస్, కార్యదర్శులు రాజు, రాజ్ కుమార్, ఎస్సారెస్పీ డి ఇ గణేశ్, ఎల్టీ కుమార్, యువజన కాంగ్రెస్ నాయకుడు శేక్ బబ్లూ తదితరులు పాల్గొన్నారు.
Spread the love