Friday, May 29, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిజీవించే హక్కుకు విఘాతం!

జీవించే హక్కుకు విఘాతం!

- Advertisement -

నేరం రుజువయ్యేవరకు ప్రతి నిందితుడూ నిర్దోషే అన్నది సహజ న్యాయసూత్రం. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 నిర్దేశం ప్రకారం… ప్రతి పౌరుడికీ జీవించే హక్కు ఉంది. దానిని అకారణంగా కానీ, ఏ కారణంగానైనా కానీ నిర్దాక్షిణ్యంగా హరించడం న్యాయ సూత్రాలకు విరుద్ధం. కానీ, దేశంలో వివిధ కేసుల్లో 5 లక్షల 30 వేల మందికి పైగా జైళ్లలో ఉంటే, అందులో 75 శాతం మంది నేరం రుజువు కాకుండానే అప్రకటిత కారాగార శిక్ష అనుభవించాల్సి రావడం విచారకరం. విచారణలో తీవ్రమైన జాప్యం, న్యాయాన్ని పొందలేని నిందితుల కుటుంబ నేపథ్యం, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో పాలకుల నిరంకుశ, ప్రతీకార భావన- అనేకమంది ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గిపోవడానికి కారణమవుతున్నాయి. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి, రాజ్యాంగ విలువలకూ, సహజ న్యాయసూత్రాలకూ తీవ్రమైన విఘాతం కలిగిస్తోంది. 2020 ఢిల్లీ అల్లర్ల కేసులో జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి సంఘం నాయకుడు ఉమర్ ఖలీద్‌ను ఉపా చట్టం కింద అరెస్టు చేసి ఐదేళ్లు దాటుతోంది. ఇంతవరకూ విచారణ ప్రారంభం కాలేదు. ఛార్జిషీట్ దాఖలు ప్రక్రియ కూడా నత్తనడకన సాగు తోంది. మధ్యలో బెయిల్ కోసం అనేకసార్లు ప్రయత్నించినా కోర్టులు నిరాకరి స్తున్నాయి. ‘భారీ కుట్ర’ అంటూ దర్యాప్తు సంస్థలు బనాయించిన ఆరోపణలనే ప్రాథమిక ఆధా రంగా పరిగణించి, బెయిల్ ఇవ్వటానికి నిరాకరించడం రాజ్యాంగం ప్రసాదించిన వ్యక్తిగత స్వేచ్ఛకు ఆటంకం కలిగిస్తోంది. ఏళ్ల తరబడిన నిర్బంధం తరువాత నిందితులపై నేరం రుజువు కాకపోతే- వారు కోల్పో యిన జీవితాన్ని ఎలా తిరిగి ఇస్తారన్న ప్రశ్న కూడా చాలా విలువైనది.

బ్రిటీషు పాలకులు భారత పౌరులపై ప్రయోగించిన నిర్బంధ, నిరంకుశ చట్టాలకు గంపగుత్త రూపం ఉపా. ఈ చట్టంలోని సెక్షన్ 43డి (5) ప్రకారం- దర్యాప్తు సంస్థ చూపించిన ప్రారంభ ఆధారాలనే నిజమన్నట్టు కోర్టులు భావించి, నిందితులకు బెయిల్ ఇవ్వకూడదనేది అత్యంత కఠినమైన నిబంధన. పూర్తి విచారణ జరపకుండానే ఎన్నేళ్లయినా జైలులో బంధించడం పట్ల అనేకమంది న్యాయ నిపుణు లు, ప్రజాస్వామ్య వాదులు మొదటి నుంచీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. మత ప్రాతిపదికన పౌరసత్వ చట్ట సవరణ తీసుకురావటాన్ని దేశంలో అనేకమంది వ్యతిరేకించగా, ఉమర్ ఖలీద్ వంటి వారూ నిరసన ఉద్యమంలో పాల్గొన్నారు. అది రాజ్యాంగబద్ధమైన హక్కు. అదెలా భారీ కుట్ర, దేశద్రోహమూ అయిందో దర్యాప్తు సంస్థలు ఇంతవరకూ ఒక్క రుజువూ చూపలేదు. అయినప్పటికీ పదేపదే బెయిల్ నిరాకరణ కొనసాగుతోంది. ఉపా లాంటి కేసుల్లో సైతం నిందితులను ఏళ్ల తరబడి నిర్బంధించడం సరైంది కాదని, అక్కడ కూడా బెయిల్ పొందటాన్ని హక్కుగా భావించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.వి. నాగరత్న ఇటీవల వ్యాఖ్యానించడం- ఈ అంశానికి ఉన్న ప్రాధాన్యాన్ని ముందుకు తెస్తోంది. 2019 – 2023 మధ్య ఉపా చట్టం కింద 10,440 మందిని అరెస్టు చేసి జైళ్లలో ఉంచితే, ఇంతవరకూ విచారించి దోషులుగా తేల్చింది కేవలం 335 మందినే! మిగతా వారంతా కేవలం ఆరోపణలతోనే కారాగారాల్లో మగ్గుతున్నారు. ఇందులో మోడీ–అమిత్ షా హయాంలోని బీజేపీ ప్రభుత్వం దురుద్దేశపూరితంగా బనాయించిన కేసులే ఎక్కువన్నది బహిరంగ రహస్యం.

మోడీ రాజకీయ, పాలనాపరమైన విధానాలను ప్రశ్నించటమే దేశద్రోహమన్న తీరులో చట్టాలను దుర్విని యోగం చేయడం, దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పడం ప్రజాస్వా మ్యానికి సిగ్గుచేటు. మానవీయ విలువలకు తలవొంపు. ఇక సాధారణ కేసుల్లో కూడా లక్షలాది మంది సామాన్యులు విచారణ, బెయిళ్లు లేకుండానే చీకటి జైళ్లలో కునారిల్లిపోతున్నారు. ఇందులో దళితులు, ఆదివాసీలు, వెనుకబడిన తరగతుల వారే అత్యధికంగా ఉండడం గమనార్హం. విశాఖ ఏజెన్సీలోని వందలాది మంది ఆదివాసీలు గంజాయి కేసుల్లో ఇరికించబడి, విచారణ లేకుండానే కారాగార శిక్ష అనుభవిస్తున్నారు.
న్యాయ సహాయం అందకపోవడం, పెద్దఎత్తున ధనరూపంలో పూచీకత్తులు చెల్లించే ఆర్థిక స్తోమత లేకపోవడం వారి విలువైన జీవితాన్ని జైలు గోడలకే పరిమితం చేస్తోంది. రాజ్యాంగ సూత్రాలూ, న్యాయ సుభాషితాలూ మాటలకే పరిమితం కావడంవల్ల ప్రయోజనం లేదు. పాలకుల కక్షకు, రాజకీయ దురుద్దేశాలకూ చట్టాలూ, న్యాయవ్యవస్థ ఉపకరణాలు కాకూడదు. అందుకే న్యాయవ్యవస్థ పౌరుల రాజ్యాంగబద్ధ హక్కులను కాపాడే నిబద్ధతతో వ్యవహరించాలి. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అన్నట్టు – “రాజ్యాంగం ఎంతగొప్పదైనా, దాన్ని అమలుచేసే మనుషుల మీదే దాని జయాపజయాలు ఆధారపడి ఉంటాయి.”

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -