వీరేంద్ర సెహ్వాగ్ కి ఐసీసీ అత్యున్నత పురస్కారం..

న‌వ‌తెలంగాణ – హైద‌రాబాద్‌: టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కి ఐసీసీ అత్యున్నత గౌరవం లభించింది. ఐసీసీ ప్రతిష్టాత్మక హాల్ ఆఫ్ ఫేమర్ల జాబితాలో వీరేంద్ర సెహ్వాక్ కి చోటు కల్పించింది. వీరుతో పాటు భారత మాజీ మహిళా క్రికెటర్ డయానా ఎడుల్జీ, శ్రీలంక దిగ్గజ ఆటగాడు అరవింద డిసిల్వాకు కూడా ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమర్ల జాబితాలో చోటు దక్కింది. ఈ ముగ్గురినీ హాల్ ఆఫ్ ద ఫేమర్ల జాబితాలోకి చేరుస్తున్నట్టు ఐసీసీ ట్వీట్టర్ వేదికగా ప్రకటించింది. 45 ఏళ్ల సెహ్వాగ్ 1999-2013 మధ్యలో 104 టెస్టులు, 251 వన్డేలు, 19 టీ 20లలో భారత్ కి ప్రాతినథ్యం వహించాడు. 18641 పరుగులను సాధించాడు. ఇందులో 38 సెంచరీలు 72 హాఫ్ సెంచరీలున్నాయి. పార్ట్ టైమ్ స్పిన్నర్ కూడా. వీరుడు తన కెరీర్ లో 136 వికెట్లను పడగొట్టాడు. 67 ఏళ్ల డయానా 1976-93 మధ్య 20 టెస్టులు, 34 వన్డేలలో భారత్ కి ప్రాతినిథ్యం వహించింది. ఇప్పటికీ కూడా మహిళల టెస్ట్ క్రికెట్ లో అత్యధిక బంతులు సంధించిన రికార్డు యానా పేరిటే ఉండటం విశేషం. లెప్ట్ ఆర్మ్ బౌలర్ అయిన డయానా తన అంతర్జాతీయ కెరీర్ లో 109 వికెట్లను పడగొట్టింది. 58 ఏళ్ల అరవింద డిసిల్వ 1984-2003 మధ్యలో 93 టెస్ట్ లు, 308 వన్డే శ్రీలంకకు ప్రాతినిథ్యం వహించి 15645 పరుగులు సాధించాడు. 31 సెంచరీలు, 86 అర్థ సెంచరీలున్నాయి. డిసిల్వ కెరీర్ లో 135 వికెట్లను తీశాడు.

Spread the love