బీజేపీకి ఓటు రిజర్వేషన్లకు పోటు

'కారు'కు ఓటేయించుకొని ఢిల్లీలో 'కమలా'నికి తాకట్టుపెట్టిన చరిత్ర కల్వకుంట్ల చంద్రశేఖర రావుదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. శనివారం కొత్తగూడెం,– రాజ్యాంగ పరిరక్షణకు ఇండియా కూటమికి ఓటేయాలి
– కేసీఆర్‌ ‘కారు’కు ఓటేయించుకొని బీజేపీకి తాకట్టుపెట్టారు
– 8లోగా రైతుభరోసా పూర్తి.. 9లోగా ఆసరా పింఛన్లు
– నన్ను అరెస్టు చేయడం ద్వారా రిజర్వేషన్ల రద్దుకు కుట్ర
బీజేపీకి ఓటేస్తే.. రిజర్వేషన్లు కోల్పోవాల్సిందే.. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దుష్యంత్‌కుమార్‌ గౌతమ్‌ ఓ ఇంటర్వ్యూలో అధికారంలోకి వచ్చిన వెంటనే రాజ్యాంగం మార్చుతామన్నది నిజం కాదా? ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు రద్దు చేయాలని, రాజ్యాంగాన్ని మార్చాలని బీజేపీ ప్రణాళికలు వేస్తోంది. రాజ్యాంగ రక్షణ, రిజర్వేషన్ల పరిరక్షణకు కాంగ్రెస్‌కు ఓటేయాలి. ఇండియా కూటమిని అధికారంలోకి తేవాలి.
– సీఎం ఎ.రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ- ఖమ్మం, మహబూబ్‌నగర్‌ ప్రాంతీయ ప్రతినిధులు
‘కారు’కు ఓటేయించుకొని ఢిల్లీలో ‘కమలా’నికి తాకట్టుపెట్టిన చరిత్ర కల్వకుంట్ల చంద్రశేఖర రావుదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. శనివారం కొత్తగూడెం, వనపర్తి జిల్లా కొత్తకోట, సికింద్రాబాద్‌, ముషీరాబాద్‌లో నిర్వహించిన జనజాతర సభలు, కార్నర్‌ మీటింగ్‌ల్లో సీఎం ప్రసంగించారు. ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అధ్యక్షతన కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో జరిగిన సభలో సీఎం ప్రసంగిస్తూ.. నమ్మించి మోసం చేసుట్ల కేసీఆర్‌ను మించినోడే లేడన్నారు. వచ్చే సంకీర్ణ ప్రభుత్వంలో నామ నాగేశ్వరరావును మంత్రిని చేస్తానన్న కేసీఆర్‌ మాటల వెనుక బీజేపీకి మద్దతు ఇచ్చే యోచన దాగుందన్నారు. రైతు వ్యతిరేక నల్లచట్టాలు, పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ బిల్లు, త్రిబుల్‌ తలాక్‌ చట్టం, సీఏఏ, కామన్‌ సివిల్‌ కోడ్‌ తెచ్చినప్పుడు.. ప్రతి సందర్భంలో నూ బీఆర్‌ఎస్‌, బీజేపీకి మద్దతు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణకు ద్రోహం చేసిన బీజేపీకి ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు. సీపీఐ(ఎం), సీపీఐ బలపరిచిన కాంగ్రెస్‌ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డికి చరిత్రలో నిలిచిపోయే స్థాయిలో మెజార్టీ ఇవ్వాలని కోరారు. రైతులు, కార్మికుల హక్కులపై పోరాడిన చరిత్ర ఉమ్మడి ఖమ్మం జిల్లాదని.. ఆర్‌ఆర్‌ఆర్‌ గెలుపు ద్వారా దాన్ని చాటాలని అన్నారు.
8లోగా రైతుభరోసా…
ఈనెల 9వ తేదీలోగా ఆసరా పెన్షన్లు ఖాతాలో పడతాయని ముఖ్యమంత్రి తెలిపారు. భద్రాద్రి రాముని సాక్షిగా ఆగస్టు 15కల్లా రూ.2 లక్షల పంట రుణాలు మాఫీ చేస్తామన్నారు. హరీశ్‌రావు సవాల్‌కు సిద్ధంగా ఉండాలన్నారు. ఆర్థికమంత్రి భట్టి గట్టోడు కాబట్టి బీఆర్‌ఎస్‌ చేసిన రూ.7 లక్షల కోట్ల అప్పులకు సంబంధించి రూ.27వేల కోట్లు బ్యాంకులకు చెల్లించి కూడా ప్రతినెలా మొదటి తేదీన జీతాలు, పెన్షన్లు ఇస్తున్నారన్నారు. రాష్ట్రంలో 69 లక్షల మందికి 65 లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతుభరోసా డబ్బులు వేశారన్నారు. ఈనెల 8వ తేదీలోగా ప్రతి చివరి రైతుకూ నగదు జమ చేస్తామని హామీ ఇచ్చారు. 9వ తేదీ తర్వాత ఏ ఒక్క రైతుకైనా భరోసా బకాయి ఉంటే అమరవీరుల స్థూపం దగ్గర ముక్కు నేలకు రాస్తానని సవాల్‌ విసిరారు. రైతుభరోసా కింద పుల్ల బెడితే.. విద్యుత్‌ కోతల పేరుతో కోతలు కోస్తే ఓట్లొస్తయే మోనన్న దింపుడుకల్లం ఆశ కేసీఆర్‌కు ఉందన్నారు. కాలకూట విషం కల్వకుంట్ల చంద్రశేఖరరావును ముందే పసిగట్టి మూడు అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కో సీటు మాత్రమే బీఆర్‌ఎస్‌కు ఇచ్చిన ఖమ్మం ప్రజలు ఎంతో చైతన్యవంతులని వ్యాఖ్యానించారు. ఖమ్మం లోక్‌సభ అభ్యర్థి రఘురాంరెడ్డి, మహబూబాబాద్‌ అభ్యర్థి బలరాంనాయక్‌ను మూడేసి లక్షల ఓట్ల మెజార్టీ చొప్పున గెలిపించాలని కోరారు.
రిజర్వేషన్లు, రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం : డిప్యూటీ సీఎం
రాజ్యాంగాన్ని, రిజర్వేషన్లను కాపాడుతామన్నందుకే సీఎం రేవంత్‌రెడ్డిని ఢిల్లీకి పిలిపించారని.. ఇలాంటి వాటికి కాంగ్రెస్‌ నాయకత్వం భయపడదని డిప్యూటీ సీఎం, ఆర్థికమంత్రి మల్లు భట్టివిక్రమార్క అన్నారు. పాల్వంచ స్పాంజ్‌ అండ్‌ ఐరన్‌ ఫ్యాక్టరీని తెరిపించి స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. రాబోయే ఐదేండ్లలో సంవత్సరానికి రూ.20వేల చొప్పున మహిళలకు రూ.లక్ష కోట్ల వడ్డీ లేని డ్వాక్రా రుణాలిస్తామని హామీ ఇచ్చారు.
అరుణతో నాకు పేచీ లేదు
బయ్యారం ఉక్కు కర్మాగారం ఇవ్వలేదు.. వరంగల్‌ రైల్వేకోచ్‌, ఐటీఆర్‌ కారిడార్‌, పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా గిరిజన యూనివర్సిటీ వంటి వాటికి అనుమతులు ఇవ్వని మోడీకి ఎందుకు ఓటేయాలని కోత్తకోట కార్నర్‌ మీటింగ్‌లో సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికె.అరుణ అక్రమ సంపాదన ఈ జిల్లా ప్రజలకు అంతా తెలుసన్నారు. ఆమెతో తనకు పేచీ లేదని, ఆమెపై తానెందుకు పగ పడతానని అన్నారు. దొంగలకు సద్ది మోసే ఆమెకు తనను విమర్శించే నైతికత లేదన్నారు. అధికారంలో వచ్చి 152 రోజులయ్యింది. అప్పడే సీఎం పదవి నుంచి దిగిపొమ్మని శాపనార్థాలు పెట్టడం చూస్తుంటే బీఆర్‌ఎస్‌, బీజేపీకి రేవంత్‌రెడ్డి అంటే మింగుడు పడటం లేదని తెలుస్తోందన్నారు. అవకాశం వచ్చినప్పుడే ఉపయోగించుకొని అభివృద్ధి చేసుకుందామని అన్నారు. మహబూబ్‌నగర్‌ పార్లమెంటు నియోజకవర్గం నుంచి చల్లా వంశీచంద్‌రెడ్డిని, నాగర్‌కర్నూల్‌ అభ్యర్థిగా మల్లు రవిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.

Spread the love