నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ లేదు
రేవంత్ రెడ్డి, రాహుల్ కు గుణపాఠం చెప్పాలి:సర్‌పై బీఆర్‌ఎస్ శ్రేణులకు
మాజీ మంత్రి కేటీఆర్ అవగాహన
నవతెలంగాణ – ముషీరాబాద్
డిక్లరేషన్ల పేరుతో అన్ని వర్గాలను మోసం చేసిన కాంగ్రెస్ పాలకులను యువత నిలదీయాలని బీఆర్‌ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ పిలుపు ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా ఒక్క ఇల్లు కట్టకపోగా, హైడ్రాను తెచ్చి వేలాది ఇండ్లను కూలగొట్టారని ఆరోపించారు. ఒక్క ఏడాది కష్టపడండీ చాలు కాంగ్రెస్ పాలకులకు మిత్తితో సహా చెల్లించే సమయం వస్తుందని వ్యాఖ్యానించారు. కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న సర్ పట్ల పార్టీ కార్యకర్తలు అందరూ అప్రమత్తంగా ఉంటూ అర్హుల ఓట్లు పోకుండా చూడాలని చెప్పారు. ముషీరాబాద్ నియోజక వర్గ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం శనివారం ఓ ఫంక్షన్ హాలులో ఎమ్మెల్యే ముఠా గోపాల్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేటీఆర్ ప్రత్యేక ఓటర్ సవరణ, బీఆర్ఎస్ పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు పట్ల పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాలపై రాహుల్ గాంధీనీ యువత నిలదీయాలన్నారు. తెలంగాణ యువతకు మా కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేస్తే తిరిగి వచ్చి అండగా నిలబడతానని మాయమాటలు చెప్పిన రాహుల్ గాంధీ ఇప్పుడు ఎటు పోయారని ప్రశ్నించారు. పార్టీ తరఫున ఎంపిక చేసిన బీఎల్ఏలు ఏ ఒక్కరి ఓటు తొలగకుండా కాపాడే ప్రయత్నం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి అర్.ఎస్ ప్రవీణ్ కుమార్, పార్టీ నేతలు ఎమ్మెన్ శ్రీనివాస్, ముఠా జై సింహ, నాగేష్ ముదిరాజ్, ఎడ్ల హరిబాబు యాదవ్, ముచ్చకుర్తి ప్రభాకర్, బూత్ కమిటి ప్రతినిధులు పాల్గొన్నారు.



