Thursday, July 23, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంయుద్ధ వ్యయం 37.5 బిలియన్ డాలర్లు!

యుద్ధ వ్యయం 37.5 బిలియన్ డాలర్లు!

- Advertisement -

మరిన్ని నిధులివ్వండి.. ఇరాన్‌కు 
చైనా, రష్యా సహకరిస్తున్నాయి
సెనెట్ ప్యానల్ ఎదుట 
అమెరికా రక్షణ మంత్రి హెగ్‌సేథ్
నిలదీసిన డెమొక్రాట్ సెనెటర్లు

ఈ నెలలో ఇరాన్‌తో ఘర్షణలు ప్రారంభమైన తర్వాత తొలిసారిగా అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్‌సేథ్, జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ ఛైర్మన్ జనరల్ డాన్ కెయిన్ మంగళవారం సెనెట్ ప్యానల్ ఎదుట హాజరై సాక్ష్యమిచ్చారు. ఇరాన్‌పై సాగిస్తున్న యుద్ధం కారణంగా ఇప్పటి వరకూ 37.5 బిలియన్ డాలర్లు ఖర్చయ్యాయని సెనెట్ అప్రోప్రియేషన్ కమిటీకి హెగ్‌సేథ్ తెలియజేశారు. అయితే హెగ్‌సేథ్ చెప్పిన దాని కంటే యుద్ధ వ్యయం ఇంకా చాలా ఎక్కువగానే ఉండవచ్చునని నిపుణులు ఇప్పటికే స్పష్టం చేశారు. కాగా యుద్ధానికి అవసరమైన నిధుల కోసం మరింత ఆర్థిక సాయం చేయాలని హెగ్‌సేథ్ కోరారు. హార్ముజ్ జలసంధి మీదుగా నౌకలను నడిపించేందుకు సైనిక ప్రయత్నం ‘రహస్యం’గా కొనసాగిందని, ఇరాన్ దాడులు జరుగుతున్నప్పటికీ అమెరికా తన నియంత్రణను నిలుపుకుంటూ ఈ వ్యూహాత్మక జలమార్గం మీదుగా 500 మిలియన్ బ్యారల్స్ వరకూ చమురు రవాణాకు సాయపడిందని తెలిపారు. ఇరాన్ కార్యకలాపాలలో కొన్నింటికి చైనా, రష్యా సహకరిస్తున్నాయని ఆరోపించారు. దానికి అడ్డుకట్ట వేయడానికి తమ వద్ద అనేక మార్గాలు ఉన్నాయని అంటూ వాటిని రహస్యంగానే ఉంచాలని చెప్పారు. పికాక్స్ పర్వతం కింద ఉన్న అణు కేంద్రంపై దాడి చేయడానికి అమెరికాకు ఉన్న సైనిక సామర్ధ్యంపై ప్రశ్నించగా సమాధానాన్ని నిరాకరించారు. ‘మా సామర్ధ్యాలలో చాలా వాటిని రహస్యంగానే ఉంచుతున్నాం’ అని చెప్పారు. కాగా యుద్ధాన్ని ఎలా కొనసాగించాలనే విషయంపై ట్రంప్‌కు నివేదికలు అందజేస్తానని కెయిన్ తెలిపారు. యుద్ధంలో మానవ నష్టం సహజమేనని అన్నారు. ఇదిలావుండగా హెగ్‌సేథ్‌పై కమిటీ సభ్యుడు, మిచిగాన్ డెమొక్రాట్ సెనెటర్ గ్యారీ పీటర్స్ మండిపడ్డారు. ఆయనను ఓ విఫలమైన వ్యక్తిగా అభివర్ణించారు. ట్రంప్ ప్రభుత్వ యుద్ధ వ్యూహంపై ఆందోళన వ్యక్తం చేశారు. యుద్ధానికి కారణమేమిటని మరో డెమొక్రాట్ సెనెటర్ కిర్‌స్టెన్ గిల్లీబ్రాండ్ నిలదీశారు. ఇరాన్ క్షిపణి ప్రయోగ సామర్ధ్యాలను ధ్వంసం చేస్తున్నామంటూ హెగ్‌సేథ్ చేస్తున్న వాదనలలో వాస్తవం లేదని, ఆయన ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు.

తొలి ఆరు రోజుల యుద్ధ వ్యయాన్ని 11.3 బిలియన్ డాలర్లుగా ట్రంప్ ప్రభుత్వం గతంలో అంచనా వేసింది. ఇప్పుడు తాజాగా సెనెట్ కమిటీ ముందు ఉంచిన అంచనాలను పెంటగాన్ ఏ ప్రాతిపదికన రూపొందించిందీ తెలియడం లేదు. సుమారు 90 బిలియన్ డాలర్ల అదనపు నిధులు ఇవ్వాలని ట్రంప్ గత నెలలో కాంగ్రెస్‌ను కోరిన విషయం తెలిసిందే. యుద్ధంపై తీవ్ర అసహనంతో ఉన్న చట్టసభ సభ్యులతో ఆయన మరోసారి ఘర్షణకు సిద్ధమవుతున్నారు. పైగా నవంబరులో మధ్యంతర ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్‌లో అరకొర మెజారిటీతో నెట్టుకొస్తున్న రిపబ్లికన్లకు ఈ ఎన్నికలు అగ్నిపరీక్ష కాబోతున్నాయి. యుద్ధ ప్రణాళికలపై ట్రంప్ తమకు ముందస్తు సమాచారం ఇవ్వలేదని ప్రతిపక్ష డెమొక్రాట్లతో పాటు అధికార రిపబ్లికన్లు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -