Thursday, May 14, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సర్పంచ్ తీరుపై వార్డు సభ్యుల ఆగ్రహం

సర్పంచ్ తీరుపై వార్డు సభ్యుల ఆగ్రహం

- Advertisement -

నవతెలంగాణ – కామారెడ్డి/పాల్వంచ : పాల్వంచ మండలంలోని  ఫరీద్‌పేట్ గ్రామ పంచాయతీ బాడీ సమావేశాన్ని  గురువారం సర్పంచ్ వార్డ్ మెంబర్ల  తీవ్ర ఉద్రిక్తతల మధ్య  జరిగింది. గ్రామ నిధుల వినియోగంలో పారదర్శకత లేదని ఆరోపిస్తూ వార్డు సభ్యులు తగిరంచ రమాదేవి, దేవోల్ల ప్రత్యూష, జ్యోతి, వెంకట్ స్వామి గౌడ్, నర్సింలు సమావేశాన్ని మధ్యలోనే బహిష్కరించారు.

బాడీ తీర్మానం లేకుండా, వార్డు సభ్యులకు సమాచారం ఇవ్వకుండా భారీ మొత్తంలో బిల్లులు తీసుకున్నారని సభ్యులు ఆరోపించారు. ముఖ్యంగా కేవలం నాలుగు నెలల్లోనే రూ.11 లక్షల వరకు బిల్లులు తీసుకున్నారని,  పాత పెండింగ్ బిల్లులు ఇప్పటికీ క్లియర్ చేయలేదని మండిపడ్డారు. ఈ సమావేశంలో సభ్యులు మాట్లాడుతూ, “వార్డు సభ్యులకు చెప్పకుండా, తీర్మానం లేకుండా డబ్బులు ఎలా తీశారు? ప్రజలకు మేము ఎలా సమాధానం చెప్పాలి?” అంటూ సర్పంచ్ జీడిపల్లి నర్సింహారెడ్డి, ఉపసర్పంచ్‌ను నిలదీశారు.

సరైన సమాధానాలు రాకపోవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ సమావేశాన్ని బహిష్కరించారు. 2026లో తీసుకున్న బిల్లులకు 2023, 2024 సంవత్సరాలకు సంబంధించిన జియో – ట్యాగ్ ఫొటోలు ఎందుకు జత చేశారని సభ్యులు ప్రశ్నించారు. పాత పనులను కొత్త పనులుగా చూపిస్తున్నారా? అంటూ నిలదీశారు. “పాత బకాయిలు చెల్లించాలని కోరితే సర్పంచ్  ‘నేను 30 లక్షలు ఖర్చు పెట్టి గెలిచాను… అందరికీ ఇస్తూ పోతే నాకు ఏమి మిగులుతుంది’ అని మాట్లాడటం మాకు తీవ్ర బాధ కలిగించింది” అని వార్డు సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.

 పంచాయతీ కార్యాలయానికి వెళ్లినప్పుడు వార్డు సభ్యుల ఫోన్లు తీసుకుని పక్కన పెట్టి, తర్వాత మాట్లాడండి అని చెప్పడం ప్రజాప్రతినిధులను అవమానించే విధంగా ఉందని ఆరోపించారు. పాత బకాయిలు ఇంకా చెల్లించకపోయినా, ఎంపిక చేసుకుని కొంతమందికి మాత్రమే బిల్లులు క్లియర్ చేస్తున్నారని సభ్యులు మండిపడ్డారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన వార్డు సభ్యులు, “గ్రామ ప్రజలు మమ్మల్ని నమ్మి గెలిపించారు. కానీ గ్రామంలో జరుగుతున్న ఆర్థిక వ్యవహారాలు చూసి ప్రజలకు సమాధానం చెప్పలేని పరిస్థితి వచ్చిందన్నారు.

గ్రామ ప్రజల డబ్బుపై స్పష్టత లేకపోవడం బాధాకరం” అని తెలిపారు. సర్పంచ్ నర్సింహారెడ్డి గతంలో బీఆర్ఎస్ పార్టీలో వైస్ ఎంపీపీగా, ఇంచార్జ్ ఎంపీపీగా ఉన్న సమయంలో ఇలాంటి ఆరోపణలు రావడం ఇప్పుడు గ్రామ ప్రజల్లో చర్చనీయాంశమైందని పేర్కొన్నారు. ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా వార్డు సభ్యులను పట్టించుకోకుండా వ్యవహరించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని మండిపడ్డ సభ్యులు, అవసరమైతే తదుపరి రాజకీయ నిర్ణయాలు కూడా తీసుకుంటామని హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -