సాగర్‌ ఎడమ కాలువకు నీరివ్వండి

సాగర్‌ ఎడమ కాలువకు నీరివ్వండి– పంటలను కాపాడండి : రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జూలకంటి రంగారెడ్డి
–  రైతు సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ, ధర్నా
నవతెలంగాణ- మిర్యాలగూడ
నాగార్జునసాగర్‌ ఎడమ కాలువకు నీటిని విడుదల చేయాలని రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో మంగళవారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణ కేంద్రంలోని సీపీఐ(ఎం) కార్యాలయం నుంచి రాజీవ్‌ చౌక్‌ మీదుగా బైక్‌ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జూలకంటి మాట్లాడుతూ.. నాగార్జునసాగర్‌ ఎడమ కాలువ ఆయకట్టు పరిధిలో రైతులు వరి నాట్లు వేసుకున్నారని చెప్పారు. సాగునీరు విడుదల అవుతుందని కొందరు, బోర్లు.. బావుల కింద మరికొందరు రైతులు వరి నాట్లు వేసుకున్నారని, ఇప్పుడు భూగర్భ జలాలు తగ్గిపోయి బోర్లు బావులు ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వర్షాలు లేక వాగులు, చెరువులు కూడా ఎండిపోయాయని, దీంతో సాగు, తాగునీటి కరువు ఏర్పడిందని అన్నారు.
జిల్లాలో 30శాతం మేరకు రైతులు వరి నాట్లు వేసుకున్నారని, పంట పొలాలు పొట్ట దశలకు చేరుకున్నాయని అన్నారు. ఇప్పుడు నీరు అందక పైర్లు ఎండిపోతున్నాయని తెలిపారు. నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులో 520 అడుగుల నీటిమట్టం ఉందని, 15 టీఎంసీ నీటిని వాడుకోవడానికి అవకాశం ఉందని, పది రోజులపాటు ఎడమ కాలువ నీటిని విడుదల చేసి చెరువులు కుంటలు నింపి భూగర్భ జలాలను పెంపొందించాలని కోరారు. దాని ఫలితంగా పంట పొలాలు కూడా చేతికి వస్తాయన్నారు. అవసరమైతే కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి ఆల్మట్టి ప్రాజెక్టు నుంచి నీటిని తెప్పించుకొని పంట పొలాలను కాపాడాలని కోరారు. అనంతరం కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్‌ మల్లేష్‌, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, నాయకులు నూకల జగదీష్‌ చంద్ర, రాగిరెడ్డి మంగారెడ్డి రవి నాయక్‌ డాక్టర్‌ మల్లు గౌతమ్‌ రెడ్డి రేమిడాల పరశురాములు, వినోద్‌ నాయక్‌, శశిధర్‌ రెడ్డి, తిరుపతి రామ్మూర్తి, ఎండి అంజాద్‌, పగిడోజు రామ్మూర్తి, కంచర్ల ఊర్మిల, గోలి వెంకట్‌ రెడ్డి, పోలేపల్లి గోవింద్‌ రెడ్డి, సిహెచ్‌ సైదమ్మ, గాయం వీరారెడ్డి, కోడిరెక్క మల్లయ్య, పాపా నాయక్‌, పిల్లుట్ల సైదులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love