విద్యతోనే మనం అభివృద్ధి సాధించగలం..

ఎస్ కృష్ణ ఆదిత్య ములుగు జిల్లా కలెక్టర్
నవతెలంగాణ – గోవిందరావుపేట
89 లక్షలతో జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల, 60.20 లక్షలతో మండల పరిషత్ ప్రాధమిక పాఠశాలల అభివృద్ధి. డిజిటల్ తరగతుల ద్వారా ఉన్నత విద్యార్థులకు విద్యా బోధన. ప్రైవేట్ కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ జరగాలి. పాఠశాల స్థితిగతులలో కీలక మార్పులు తీసుకువచ్చి విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్య అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మన ఊరు మనబడి కార్యక్రమాన్ని రూపొందించిందని జిల్లా కలెక్టర్ యస్. క్రిష్ణ అధిత్య అన్నారు.తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా మంగళవారం గోవిందరావు పేట మండలం దుంపిల్లగూడెం లోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో, గోవిందరావు పేట మండల పరిషత్ ప్రాధమిక పాఠశాలలో మన ఊరు మన బడిలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను జిల్లా కలెక్టర్  యస్. క్రిష్ణ అధిత్య, ఎంపిపి శ్రీనివాస్ రెడ్డి, జెడ్పీ టి సి హరిబాబు లతో కలిసి ప్రారంభించారు.అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంల లో జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ యస్. క్రిష్ణ అధిత్య మాట్లాడుతూ దుంపిల్లగూడెం లోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలోని ఆవరణం లో ప్రాధమిక పాఠశాల ఇంగ్లీష్ మీడియం అదనపు తరగతి గది, విద్యార్థులు కలిసి భోజనం చేసేందుకు డైనింగ్ హాల్, విద్యాబోధనకై స్మార్ట్ టీవీ 82” ఎల్ఈడి స్క్రీన్ ను 89 లక్షల వ్యయంతో మన ఊరు మనబడి కింద అభివృద్ధి చేశామని అన్నారు. గోవిందరావు పేట మండల పరిషత్ ప్రాధమిక పాఠశాలలో డైనింగ్ హాల్, 3 డిజిటల్ తరగతి గదులను ప్రారంభించుకున్నామని అన్నారు. ఇందులో భాగంగా జిల్లాలో 23,500 విద్యార్థిని, విద్యార్థులకు యూనిఫామ్ లు అందిస్తునానమని అన్నారు. అదేవిధంగా 1 వ తరగతి నుండి 5 వ తరగతి వరకు ప్రింటెడ్ వర్క్ బుక్స్, 6 వ తరగతి నుండి 10 వ తరగతి వరకు 100% టెక్స్ట్ బుక్స్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున వచ్చాయని విద్యార్థులకు అంధిస్తున్నామని అన్నారు. జిల్లాలో 370 పాఠశాలలకు  ఫస్ట్ పేజ్ లో 125 పాఠశాలలో అభివృద్ధి పనులు చేపట్టి ప్రారంభించుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. ఇందుకు గాను 50 కోట్లు నిధులు విడుదల చేయడం జరిగిందని అన్నారు. త్రాగునీరు, ప్రహరీగోడ, విద్యుత్ లైట్లు, గ్రీన్ బోర్డులు, మేజర్, మైనర్ రిపేర్ పనులు, డిజిటల్ తరగతులు, ప్రతి తరగతి గదిలో ఫాన్స్ లైటింగ్, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఆధునిక టాయిలెట్ల నిర్మాణం, పాఠశాలకు పెయింటింగ్, కిచెన్ షెడ్ నిర్మాణం, విద్యార్థులకు ఉపాధ్యాయులకు అవసరమైన ఫర్నిచర్ ఏర్పాటు మొదలగు పనులు పూర్తి చేశామని కలెక్టర్ తెలిపారు. పాఠశాలల్లో ఉన్నత తరగతుల్లో చదివి విద్యార్థులకు విషయ పరిజ్ఞానం సులువుగా అందాలనే ఉద్దేశంతో డిజిటల్ తరగతులను ప్రారంభిస్తున్నామని, హైదరాబాద్, వరంగల్ స్థాయిలో విద్యా వ్యవస్థ బలోపేతం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని అన్నారు. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా సర్వoగా సుందరంగా తీర్చిదిద్దిన ప్రభుత్వ పాఠశాలలను సంరక్షించాల్సిన బాధ్యత విద్యార్థులు, గ్రామస్తులపై ఉందని, ప్రభుత్వం సుందరంగా తీర్చిదిద్దిన పాఠశాలను పకడ్బందీగా నిర్వహించాలని, మన ఊరిలోనే పాఠశాలను మనమే పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్రభుత్వం కల్పించిన వసతులను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు. పదవ తరగతి విద్యార్థులకు ప్రత్యేకంగా స్టడీ మెటీరియల్ రూపొందించి శిక్షణ అందించడం వల్ల గత రెండు సంవత్సరాలు గా మెరుగైన ఫలితాలు సాధించామని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఈరోజు నుంచి ఉదయం రాగిజావ అందించే కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభిస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులకు యూనిఫార్మ్స్, నోట్, టెక్స్ట్ బుక్స్ లను పంపిణీ చేశారు. ఎంపీపీ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో మౌళిక వసతులు కల్పిస్తూ ప్రైవేటుకు ధీటుగా అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ మన ఊరు మనబడి కార్యక్రమాన్ని ప్రారంభించారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులకు ప్రభుత్వ ఉద్యోగాలలో మొదటి ప్రాధాన్యత ఉంటుందని అన్నారు. విద్యార్థి తల్లిదండ్రులు నిత్యం వ్యవసాయంపైనే కాకుండా మీ పిల్లల చదువుల మీద కూడా శ్రద్ధ చూపించాలని అన్నారు. పిల్లలు చదువుకునే పాఠశాలలో వారి విద్యాభ్యాసం ఏ స్థాయిలో ఉందో పాఠశాల ఉపాధ్యాయుల ద్వారా తెలుసుకోవాలన్నారు. ప్రతిరోజు క్రమం తప్పకుండా పాఠశాలకు పంపించాలి అన్నారు. ఇక్కడ బోధన చేసే ఉపాధ్యాయులు ప్రభుత్వం నిర్వహించే పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారని, ప్రైవేటు పాఠశాలలో కేవలం పదవ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఉత్తీర్ణత పొంది ఉంటారని, ప్రభుత్వ పాఠశాలలో ఉచిత విద్యను, ఉచిత పుస్తకాలు, ఉచిత స్కూల్ డ్రెస్, ప్రతి విద్యార్థికి ప్రభుత్వం సరఫరా చేస్తుందన్నారు. గతంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న వారు జిల్లాస్థాయి రాష్ట్రస్థాయి ప్రభుత్వ ఉద్యోగ రంగాలలో ఉన్నారని తెలిపారు. దేశంలోనే మిగిలిన రాష్ట్రాలకు వైద్య, సంక్షేమ, విద్యా రంగాలలో తెలంగాణ ప్రభుత్వం ఆదర్శంగా నిలుస్తుందని, ప్రజల శ్రేయస్సు గురించి ఆలోచించే ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం వల్ల ఇది సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు. జడ్పీటీసీ హరిబాబు మాట్లాడుతూ విద్యార్థినీ, విద్యార్థులు ఉన్నత విద్యను చదువుకునే విధంగా భవనాల ఏర్పాట్లు పూర్తిస్థాయిలో కట్టించడం జరిగిందని అన్నారు. గతంలో విద్యార్థులు చదువుకోవాలంటే చెట్ల కింద కూర్చొని, చదువుకునేవారని పాఠశాల భవనాలు సరిపోయే విధంగా ఉండేవి కావని విద్యార్థులు వర్షాకాలం వస్తే పాఠశాలలకు సెలవులు ఇచ్చేవారని అన్నారు. గత ప్రభుత్వాల హయాంలో ప్రభుత్వ పాఠశాలలపై శ్రద్ధ వహించలేదని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ నాణ్యమైన విద్య ప్రతి పేదవాడికి అందాలనే ఉద్దేశంతో ప్రతి ప్రభుత్వ పాఠశాలను మన ఊరు మనబడి కింద అభివృద్ధి చేసుకుంటున్నామని, జిల్లా కలెక్టర్ ఏజెన్సీ ప్రాంతాలలో పాఠశాల భవనాల గుర్తించి, ప్రత్యేక శ్రద్ధ చూపించి త్వరితగతిన పనులు పూర్తి చేయించారని ఆయన అభినంధించారు.ఈ కార్యక్రమంలో మండల స్పెషల్ ఆఫీసర్ డిఆర్డిఓ నాగ పద్మజ, డిఈ ఓ పానిని, ట్రైబల్ వెల్ఫేర్ ఈ ఈ హేమలత, వైస్ ఎంపీపీ స్వప్న లక్ష్మారెడ్డి, కొ ఆప్షన్ మెంబర్ బాబర్, దుంపెల్లి గూడెం సర్పంచ్ వాణి రాజు, గోవిందరావుపేట సర్పంచ్ లక్ష్మి, తహసిల్దార్ రాజ్ కుమార్, ఎంపీడీవో ప్రవీణ్, ప్రధానోపాధ్యయులు కాంతరావు, అనమెరి, ఉపద్యాయులు, విద్యార్థిని, విధ్యార్థులు, ప్రతినిధులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

Spread the love