మురళీధర్‌ యాదవ్‌కు టికెట్‌ ఇవ్వడాన్ని ఖండిస్తున్నాం

– బీజేపీ నాయకులు
నవతెలంగాణ-నర్సాపూర్‌
నర్సాపూర్‌ అసెంబ్లీ బీజేపీ అభ్యర్థిగా మురళీధర్‌ యాదవ్‌ను బీజేపీ అధిష్టానం ప్రకటించడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేపీ నాయకులు తెలిపారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సింగయిపల్లి గోపి, రాష్ట్ర నాయకులు రఘువీరారెడ్డి, అసెంబ్లీ కన్వీనర్‌ వాల్దాస్‌ మల్లేష్‌ గౌడ్‌లు తీవ్రంగా ఖండించారు. ఆదివారం వారు నర్సాపూర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వ్యక్తికి టికెట్‌ కేటాయించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. బీజేపీ కోసం ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేస్తూ పార్టీ బలోపేతం కోసం పనిచేస్తున్న తమను కాదని ఈ మధ్యనే పార్టీలో చేరిన మురళీధర్‌ యాదవ్‌కు కేటాయించడం సరికాదన్నారు. ఈ ఎన్నికల్లో మురళీధర్‌ యాదవ్‌ను యధావిధిగా ఉంచితే మేము ఆయన కోసం పనిచేయబోమని వెల్లడించారు. నర్సాపూర్‌ నియోజకవర్గం గురించి బీజేపీ ఎన్నికల కమిటీ చైర్మెన్‌, ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌కు ఏమి తెలుసన్నారు. నర్సాపూర్‌ నాయకులతో చర్చించకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం సరైంది కాదన్నారు. బీజేపీ అధిష్టానం నర్సాపూర్‌ టికెట్‌ విషయంలో మరో మారు పునరాలోచించి, బీజేపీ అభివృద్దికి శక్తి వంచన లేకుండా కషి చేస్తున్న వారికి టికెట్‌ కేటాయించాలని వారు డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రవి గౌడ్‌, నాగేష్‌ గౌడ్‌, ప్రేమ్‌ కుమార్‌ యాదవ్‌, గుండం శంకర్‌, అరవింద్‌ గౌడ్‌, ప్రేమ్‌ కుమార్‌ యాదవ్‌, బాల్‌రాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love