నోటీసులిస్తే రావాల్సిందే..రాకుంటే ఏంచేయాలో మాకు తెలుసు

న‌వ‌తెలంగాణ – హైద‌రాబాద్‌ : మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మించాలన్నది కేసీఆర్‌ ప్రణాళికేనని రిటైర్డ్‌ ఇంజినీర్ల కమిటీ కాళేశ్వరం జ్యుడీషియల్‌ కమిషన్‌కు నివేదిక సమర్పించింది. ఈ నివేదికలో కీలక అంశాలను ప్రస్తావించింది. తుమ్మిడిహెట్టి దగ్గర తాము ప్రతిపాదించినా వద్దని పక్కన పడేశారని తెలిపింది. రిపోర్టును అప్పటికే సాగునీటిశాఖ మంత్రి, సీఎం కేసీఆర్‌కు అందించినా సంతకం చేయలేదని ఇంజినీర్లు తెలిపారు. ఈ మేరకు అప్పుడు ప్రతిపాదించిన నివేదికను రిటైర్డ్‌ ఇంజినీర్లు జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌కు అందజేశారు. అనంతరం పీసీ ఘోష్‌ మీడియాతో చిట్‌చాట్‌ చేశారు. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం సబ్‌కాంట్రాక్టర్లను గుర్తించే పనిలో ఉన్నామని తెలిపారు. ఆయా సంస్థలకు సంబంధించిన సమాచారాన్ని రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌ నుంచి తీసుకుంటామని చెప్పారు. ఆయా కంపెనీల ఖాతాలు, బ్యాంకు స్టేట్‌మెంట్లు పరిశీలిస్తే ఎంత మొత్తం చేతులు మారిందనేది తెలుస్తుందని చెప్పారు. అసిస్టెంట్‌ ఇంజినీర్లను విచారణకు పిలవాలా ? వద్దా ? అనే అంశంపై కసరత్తు చేస్తున్నట్టు చెప్పారు.
నోటీసులిస్తే రావాల్సిందే
విచారణకు రావాలని నోటీసులు ఇస్తే ఎవరైనా తప్పకుండా రావాల్సిందేనని జస్టిస్‌ పీసీ ఘోష్‌ వ్యాఖ్యానించారు. రాకుంటే ఏంచేయాలో తమకు తెలుసని చెప్పారు. ఈ విషయంలో తనకు అధికారాలు ఉన్నాయని గుర్తు చేశారు. అన్ని అఫిడవిట్లను పరిశీలించిన తర్వాతే సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌ అధికారులను పిలుస్తామని చెప్పారు. ఏఈఈ, డీఈఈలను విచారించాలా ? వద్దా ? అన్నది తర్వాత ఆలోచిస్తామని చెప్పారు. ప్రస్తుతానికి ఇంజినీర్లతో విచారణ పూర్తయిందన్నారు. వాళ్ల నుంచి అఫిడవిట్లు వచ్చాక ముందుకు వెళ్తామన్నారు. మొత్తం పది నుంచి 15 మందికి సబ్‌ కాంట్రాక్టులు ఇచ్చారనీ, వాటి వివరాలను సేకరించే పనిలో కమిషన్‌ నిమగమైనట్టు సమాచారం.

Spread the love