Sunday, May 10, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలువనం వీడుతాం... జనంలోకి రాం

వనం వీడుతాం… జనంలోకి రాం

- Advertisement -

టైగర్‌ కారిడార్‌ శివారులోనే ఉంటాం
చెంచులను కలవనివ్వకుండా ఒక్కొక్క కుటుంబంతో కౌన్సిలింగ్‌
ఆకర్షణీయమైన ప్యాకేజీ అంటూ ప్రచారం
బతుకులు ఆగం చేయొద్దని వేడుకోలు
గిరిజనేతరులు వెళ్లినా..అడవి శివారులోనే ఉంటామని వెల్లడి

నవతెలంగాణ – మహబూబ్‌నగర్‌ ప్రాంతీయ ప్రతినిధి
నల్లమల టైగర్‌ కారిడార్‌ నుంచి అడవి బిడ్డలను తరలించేందుకు చేస్తున్న ప్రయత్నాలు చివరి దశకు చేరుకున్నాయి. కౌన్సెలింగ్‌ పేరుతో చెంచులను ఒకరితో మరొకరు కల్వకుండా అడవి నుంచి తరలిస్తే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో విడివిడిగా చెబుతున్నారు. ఇక్కడి నుంచి తరలిస్తే అడవి శివారు ప్రాంతాలలోనే ఆవాసాలు ఏర్పాటు చేయాలని చెంచులు స్పష్టం చేశారు. పల్లె ప్రాంతాలలో ఆవాసాలు ఏర్పాటు చేస్తే జీవనోపాధికి ఇబ్బంది అవుతుందని చెంచులు అధికారులకు తెలిపారు. అయితే గిరిజనేతరులు మాత్రం తగిన పరిహారమిస్తేనే అడవిని వీడటానికి సిద్ధంగా ఉన్నామని అంటున్నారు. మా డిమాండ్లను అంగీకరించకుంటే అడవి విడిచి వెళ్లబోమని తెగేసి చెబుతున్నారు. అమ్రాబాద్‌ పరిధిలోని దట్టమైన అటవీ ప్రాంతాన్ని టైగర్‌ కారిడార్‌గా ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. పులులు, ఇతర జంతువులు తప్ప ఇక్కడ మానవ సంచారం ఉండరాదని, ఇది జంతువులకు ఇబ్బందికరంగా ఉంటుందని అధికారులు అంటున్నారు.

ఈ నేపథ్యంలో వందల సంవత్సరాల నుండి జీవనోపాధి పొందుతూ అడవిలో నివసిస్తున్న అడవి బిడ్డలను తరలించాలని అటవీశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే పలు దఫాలుగా చెంచులతో చర్చలు జరిపి కౌన్సిలింగ్‌ నిర్వహించారు. మొదటి దశలో పెళ్లి సార్లపల్లి సల్కలపల్లి కుడిచింతల బయిలు వంటి చెంచుపెంటలను తరలిం చాలని ప్రణాళిక సిద్ధం చేశారు. ఐదు చెంచుపెంటలను తరలించేందుకు చేస్తున్న ప్రయత్నాలు చివరి దశకు చేరుకున్నాయి. గిరిజనేతరులు అడవిని వీడి వెళ్లేందుకు సిద్ధంగా ఉండడంతో చెంచుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. చెంచుల సమ్మతి లేనప్పటికీ ఏకపక్షంగా చెంచులను తరలించే ప్రయత్నం చేశారు. ఆకర్షనీయమైన ప్యాకేజీ అంటూ ప్రచారం నల్లమల నుంచి చెంచులు బయటకు వస్తే ఆకర్షణీయమైన ప్యాకేజీ ఉంటుందని అధికారులు ప్రచారం చేస్తున్నారు. వారి ఫ్యామిలీకి 15 లక్షల ఆర్థిక సాయం రెండో ప్యాకేజీ కింద ఐదు ఎకరాల సాగు భూమి అందిస్తామని అంటున్నారు. వీటితోపాటు గృహవసతి మౌలిక వసతులు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

చెంచు కుటుంబాలు గిరిజనేతరులు అడవిని వీడతాం… కానీ

”మేము అడవి నుంచి బయటకు రావడానికి సిద్ధమే. కానీ ప్రజలుండే గ్రామాల్లోకి వెళ్లలేం. అడవి శివారులోనే ప్రత్యేకంగా ఓ కాలనీ ఏర్పాటుచేసి అందులో ఉంచాలి. ప్రజల మధ్యకు వస్తే ఆచారాలు వ్యవహారాలలో తేడాలు ఉంటాయి. అందుకే ప్రభుత్వం నల్లమల అటవీ ప్రాంతానికి సమీపంలోనే చెంచు పెంటలను ఏర్పాటు చేయాలి’ చెంచు ఉద్యమకారులు కోరుతున్నారు. కట్టుబొట్టు ఆచార వ్యవహారాలు భిన్నంగా ఉండే తాము ప్రజల్లో ఎలా కలిసి ఉండాలని, అందుకే ప్రత్యేక కాలనీ ఏర్పాటు చేయాలని చెంచులు కోరుతున్నారు.కుటుంబానికి రూ. 15 లక్షల ప్యాకేజీ ఆశ చూపిస్తున్నా, అడవిని వదలకూడదని చెంచులు నిర్ణయించుకున్నారు. సార్లపల్లి, కొల్లంపెంటల్లో గిరిజనేతరులు ప్యాకేజీకి అంగీకరించినా, చెంచులు మాత్రం అడవికి దూరంగా వెళ్లేందుకు నిరాకరిస్తున్నారు. కొల్లంపెంటను పైలట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేసి, 11 కుటుంబాలను ఖాళీ చేయించేందుకు అధికారులు ప్రయత్నించారు: అడవి బయట పునరావాసం కల్పించినా, అక్కడ వారికి జీవనోపాధి కరువైందని విమర్శలొస్తున్నాయి.

చెంచుల ఆవేదన
బయటకు వెళ్లడం వల్ల తమకు కావాల్సిన తేనె, దుంపలు, వేట వంటి వనరులను కోల్పోతున్నామని చెంచులు వాపోతున్నారు. పర్యాటక కేంద్రాల మల్లెల తీర్థం వల్ల లేని ముప్పు, తమ వల్ల ఏముందని వారు ప్రశ్నిస్తున్నారు. కాలుష్యానికి కారణం అవుతున్న సలేశ్వరం లొద్ది మల్లయ్య వంటి ప్రదేశాలకు ప్రతి ఏటా వారం రోజుల పాటు లక్షలాది మంది వస్తుంటారు. పులులకు అప్పుడు లేని ఇబ్బంది తమ వల్ల పులులకు ఎందుకు వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

యూరేనియం తవ్వకాల కోసమే
అటవీ ప్రాంతంలో తరతరాలుగా నివసిస్తున్న ఆదిమ గిరిజన తెగ అయిన చెంచుల తరలింపు అనేది ఒక సంక్లిష్టమైన వివాదాస్పద అంశం. అయితే, పులుల సంరక్షణ పేరుతో యూరేనియం తవ్వకాలను చేపట్టేందుకే చెంచులను అడవి నుంచి బయటకు పంపుతున్నారన్న అబి óప్రాయం వ్యక్తం మవుతుంది. దానికోసం మా జీవితా లను ఛిన్నాభిన్నం చేయాలనుకోవడం సరికాదని చెంచుల తరలింపు వ్యతిరేక ఉద్యమ నాయకులు అంటున్నారు.

చెంచుల తరలింపు మానుకోవాలి
అభివృద్ధి పరిరక్షణ పేరుతో చెంచులను వారి మూలాల నుండి వేరు చేయడం, వారి సంస్కతిని, స్వేచ్ఛ ను హరించడమే. ఇదే విషయం సామాజిక కార్యకర్తలు దేశభక్తులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. చెంచులను మరింత అభివృద్ధి చేయాలి. అడవిని కాపాడుకుంటూనే, చెంచుల జీవన హక్కును కాపాడాల్సిన అవసరముంది.
-శంకర్‌ నాయక్‌, గిరిజన సంఘం నాయకులు,
అచ్చంపేట, నాగర్‌ కర్నూల్‌ జిల్లా.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -