Tuesday, May 5, 2026
E-PAPER
Homeజాతీయంప్రజాతీర్పును గౌరవిస్తాం!

ప్రజాతీర్పును గౌరవిస్తాం!

- Advertisement -

కేరళంలో ఓటమికి కారణాలను సమీక్షిస్తాం
బెంగాల్‌లో ప్రభుత్వ వ్యతిరేకతతోపాటు
అనేక అంశాలు బీజేపీకి కలిసివచ్చాయి : తాజా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై
సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో ప్రకటన
న్యూఢిల్లీ
: కేరళంలో వామపక్ష ప్రజాతంత్ర సంఘటన (ఎల్‌డీఎఫ్‌) ఓటమి, పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ విజయం ఈ రెండూ సోమవారం వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ప్రధానమైన అంశాలుగా ఉన్నాయని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో పేర్కొంది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. మరోవైపు డీఎంకే నేతృత్వంలోని కూటమికి కూడా తమిళనాడులో ఎదురు దెబ్బ తగిలింది. అక్కడ విజరు నాయకత్వంలో టీవీకే ప్రధానమైన శక్తిగా ఆవిర్భవించింది. అసోంను బీజేపీ నిలబెట్టుకోగలిగింది, మరోవైపు పుదుచ్చేరిలో ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌తో కలిసి విజయం సాధించింది.
కేరళంలో పదేండ్ల నిరంతర పాలన కొనసాగించిన అనంతరం ఎల్‌డీఎఫ్‌ ఓటమిని చవిచూసింది. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మోపుతూ వచ్చిన ఆర్థిక ఇబ్బందులన్నింటినీ ఎదుర్కొంటూ ఈ పదేండ్ల కాలంలో ప్రజల సంక్షేమానికి, వారి ఆకాంక్షలను నెరవేర్చడానికి చేయగలిగినంతా చేసింది.

ఇక పశ్చిమ బెంగాల్‌లో, అవినీతిమయమైన తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉండడంతో సహా అనేక కారణాల రీత్యా బీజేపీ లాభపడింది. బీజేపీ సాగించిన తీవ్రమైన మతోన్మాద, విచ్ఛిన్నకర, విద్వేష ప్రచారం, పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు పెట్టడం, ఎన్నికల కమిషన్‌తో సహా కేంద్ర సంస్థల దుర్వినియోగం, సర్‌ ప్రక్రియ ఇవన్నీ కూడా వారి విజయానికి దోహదపడ్డాయి. ఇటువంటి తీవ్రమైన ప్రతికూల వాతావరణంలో కూడా వామపక్షాలు తమ పనితీరును స్వల్పంగా మెరుగుపరుచుకోగలిగాయి. పశ్చిమ బెంగాల్‌, అసోం, పుదుచ్చేరిల్లో బీజేపీ నేతృత్వంలోని మితవాద మతోన్మాద శక్తులు ఆధిపత్యాన్ని పెంచుకుంటూ వచ్చాయి. ఈ పరిణామం లౌకికవాద, ప్రగతిశీల, ప్రజాతంత్ర శక్తులకు తీవ్రమైన ఆందోళన కలిగిస్తోందని పొలిట్‌బ్యూరో పేర్కొంది. పార్టీ, దాని మిత్రపక్షాల పట్ల విశ్వాసం ఉంచి, ఓటు వేసిన ప్రజలకు, కార్యకర్తలకు సీపీఐ(ఎం) కృతజ్ఞతలు తెలియ జేసింది. ప్రజలిచ్చిన తీర్పును సీపీఐ(ఎం) గౌరవిస్తుంది, కేరళంలో ఎల్‌డీఎఫ్‌ ఓటమికి దారి తీసిన కారణాలపై ఆత్మపరిశీలన చేసుకుంటుందని పొలిట్‌బ్యూరో పేర్కొంది. అవసరమైన దిద్దుబాటు చర్యలను పార్టీ తీసుకుంటుందని, లౌకికవాదం, ప్రజాస్వామ్య పరిరక్షణకు, ప్రజల హక్కులకోసం పోరాటాలు కొనసాగిస్తుందని వివరించింది. రాబోయే కాలంలో జరగబోయే పొలిట్‌బ్యూరో, కేంద్ర కమిటీ సమావేశాలు ఈ ఎన్నికల ఫలితాలపై సమ్రగ విశ్లేషణ జరుపుతాయి. తాజా ఫలితాలతో తలెత్తిన నూతన రాజకీయ పరిస్థితుల వల్ల ఎదురయ్యే సవాళ్ళను ఎదుర్కొనడానికి కార్యాచరణను రూపొందిస్తాయని పొలిట్‌బ్యూరో ప్రకటన పేర్కొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -