Saturday, August 8, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంపాలమూరు ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం

పాలమూరు ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం

- Advertisement -

రైతులు ఆందోళన చెందొద్దు
కృష్ణా జలాల్లో రాష్ట్ర హక్కులను సాధించి తీరుతాం : మంత్రి 
జూప‌ల్లి కృష్ణారావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

​ఉమ్మడి పాలమూరు జిల్లాలో పెండింగ్‌లో ఉన్న అన్ని సాగునీటి ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేస్తుందనీ, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని వంద శాతం పూర్తి చేసి రైతులకు సాగునీరందిస్తామని మంత్రి జూప‌ల్లి కృష్ణారావు హామీనిచ్చారు. ఉమ్మడి పాలమూరు జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఎల్‌నినో ప్రభావంతో దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నా, సాగునీటి అధికారుల ప్రణాళిక మేరకే జూరాల, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులకు నీటి నిర్వహణ జరుగుతోందని స్పష్టం చేశారు. ‌సీఎం రేవంత్‌రెడ్డి సొంత జిల్లాకు నీళ్లు ఇవ్వడం లేదంటూ బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని, ప్రజలను తప్పుదోవ పట్టించి రాజకీయ లబ్ది పొందేందుకే ఆ పార్టీ నేతలు ప్రాజెక్టుల వద్ద హంగామా చేస్తున్నారని పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్‌‌లోని సచివాలయం మీడియా సెంటర్‌లో ఎమ్మెల్యేలు మధుసూదన్‌రెడ్డి, వీర్లపల్లి శంకర్, ఈఎన్సీ (జనరల్) రమేష్‌బాబు, సీఈ విజయభాస్కర్‌రెడ్డితో క‌లిసి మంత్రి మీడియాతో మాట్లాడారు.

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా జూరాలతో పాటు ఇతర ప్రాజెక్టులకు ఇన్‌ఫ్లో పెరుగుతోందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. పై నుంచి వస్తున్న నీటికి అనుగుణంగా సాగునీటి అధికారులు ప్రణాళిక ప్రకారం కిందికి విడుదల చేస్తున్నారని చెప్పారు. ఈ విషయం ముందే తెలిసిన బీఆర్ఎస్ నేతలు ప్రాజెక్టుల వద్ద హంగామా, డ్రామాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. తమ ఒత్తిడితోనే అధికారులు నీటిని విడుదల చేశారంటూ ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. పాలమూరు బిడ్డ సీఎం రేవంత్‌రెడ్డి, ఆ జిల్లా అల్లుడు సాగునీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రైతులకు నీరివ్వటం లేదంటూ గులాబీ పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారమన్నారు. రేవంత్‌, ఉత్తమ్‌ సార‌ధ్యంలోనే ఉమ్మ‌డి పాల‌మూరు జిల్లా సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి తీరుతామ‌ని స్ప‌ష్టం చేశారు. కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులకు కాంగ్రెస్ హయాంలో మాజీ ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి శ్రీకారం చుట్టారని గుర్తుచేశారు. లక్షల ఎకరాలకు సాగునీరందించే ఆ ప్రాజెక్టులను పదేండ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. కల్వకుర్తి కింద అదనంగా 25 టీఎంసీల నీటిని అందించే ప్రాజెక్టును ఎందుకు నిర్మించలేదని ప్రశ్నించారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, కల్వకుర్తి ఎత్తిపోతల పనులను ఎందుకు పూర్తి చేయలేదని నిలదీశారు. పంపులు, మోటార్లు, కాల్వలు, డిస్ట్రిబ్యూటరీలు ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. మల్లన్నసాగర్‌పై గొప్పలు చెప్పుకున్న బీఆర్ఎస్ నేతలు పాలమూరు సాగునీటి ప్రాజెక్టులను ఎందుకు విస్మరించారో చెప్పాలని నిలదీశారు. భీమా ద్వారా వేలాది ఎకరాలకు సాగునీరందించే అవకాశాన్ని బీఆర్‌ ఎస్‌ నిర్లక్ష్యం వల్ల కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. జూరాలకు 50 టీఎంసీల వినియోగానికి అవసరమైన రిజర్వాయర్లు, గట్టు, తుమ్మిళ్ల వంటి ప్రాజెక్టులను ఎందుకు నిర్లక్ష్యం చేశారని ప్రశ్నించారు. తెలంగాణ నీటి హక్కులను గత బీఆర్ఎస్ ప్రభుత్వం ‘‘అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు ’’ ఆంధ్రప్రదేశ్‌కు ధారాదత్తం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా పరివాహక ప్రాంతంలో 811 టీఎంసీల నీటిలో తెలంగాణకు అధిక వాటా సాధించుకునే అవకాశాన్ని వదులుకుందని చెప్పారు. దీంతో ఆంధ్రప్రదేశ్‌కు 512 టీఎంసీలు, తెలంగాణకు కేవలం 299 టీఎంసీల హక్కులు కల్పించే పరిస్థితిని తీసుకొచ్చిందన్నారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం తెలంగాణ నీటి హక్కులను కాపాడేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పోరాడుతోందని, కృష్ణా జలాల్లో రాష్ట్ర హక్కులను సాధించి తీరుతామని స్పష్టం చేశారు. పాలమూరు జిల్లా రైతులు, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సాగు, తాగునీటి అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ ప్రాధాన్యంగా తీసుకుని వేగంగా పూర్తి చేస్తామని జూపల్లి తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -