అన్ని వసతులతో ఈఎస్‌ఐ గ్రేవ్‌ యార్డ్‌ను అభివృద్ధి చేస్తాం

మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌
నవతెలంగాణ-బేగంపేట్‌
ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించే విధంగా అన్ని సౌకర్యాలు, వసతులతో ఈఎస్‌ఐ గ్రేవ్‌ యార్డ్‌ను అభివృద్ధి చేయనున్నట్టు రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. గురువారం సచివాలయంలోని తన చాంబర్‌లో సనత్‌ నగర్‌ నియోజకవర్గ పరిధిలోని జీహెచ్‌ఎంసీ, ఇంజనీరింగ్‌, శానిటేషన్‌, విద్యుత్‌, హార్టికల్చర్‌ తదితర శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా అమీర్‌ పేట డివిజన్‌ లో గల ఈఎస్‌ఐ గ్రేవ్‌ యార్డ్‌ అభివృద్ధి కోసం రూపొందించిన నమూనాలను ఖైరతాబాద్‌ జోన్‌ జోనల్‌ కమిషనర్‌ రవి కిరణ్‌ మంత్రికి ఫోటో ప్రదర్శన ద్వారా వివరించారు. సుమారు ఏడున్నర ఎకరాల విస్తీర్ణంలో ఉన్న గ్రేవ్‌ యార్డ్‌ ను రూ. 4.5 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేసి ఏడాది లోగా అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందని మంత్రి తెలిపారు. అన్ని సౌకర్యాలు, వసతులతో రాష్ట్రంలోనే నెంబర్‌ 1 మోడల్‌ గ్రేవ్‌ యార్డ్‌ (వైకుంఠ ధామం)గా నిర్మించడం జరుగుతుందని పేర్కొన్నారు. నియోజకవర్గ పరిధిలో కోట్లాది రూపాయల విలువైనఅభివృద్ధి పనులు జరుగుతున్నాయని, అధికారులు వారంలో 2 రోజుల పాటు క్షేత్రస్థాయిలో పర్యటించి పనులు మరింత వేగవంతంగా జరిగేలా పర్యవేక్షించాలని ఆదేశించారు. కొన్ని పనులు ఇంకా ప్రారంభించలేదని, త్వరితగతిన ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. శంకుస్థాపన జరిగిన వారం రోజుల లోపే పనులు ప్రారంభించే విధంగా పర్యవేక్షించాలని ఆదేశించారు. పేద, మద్య తరగతి ప్రజలు అధికంగా ఉండే ప్రాంతాలలో రోడ్లు, డ్రయినేజీ, వాటర్‌ వంటి సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. వివిధ శాఖలకు చెందిన అధికారులు సమన్వయంతో వ్యవహరించి పనుల మంజూరు, అనుమతుల ప్రక్రియలో జాప్యం జరగకుండా చూడాలని ఆదేశించారు. సనత్‌ నగర్‌లోని నెహ్రూ నగర్‌ పార్క్‌ ను ఎంతో అద్బుతంగా నిర్మించారని, స్థానిక ప్రజలు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారని అధికారులను మంత్రి అభినందించారు. వర్షాకాలం ప్రారంభానికి ముందే పార్క్‌ల అభివృద్ధి, వివిధ కాలనీలు, బస్తీలలో మొక్కలు నాటేందుకు అవసరమైన ప్రణాళికలను సిద్దం చేసుకోవాలని చెప్పారు. సనత్‌ నగర్‌ లో అత్యధికంగా 55 పార్క్‌ లు ఉన్నాయని, వాటి అభివృద్ధి పై కూడా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఇంకా చేపట్టవలసిన అభివృద్ధి పనులకు సంబంధించి ప్రతిపాదనలను అందజేస్తే మంజూరుకు చర్యలు తీసుకుంటానని అధికారులకు చెప్పారు. జూన్‌ 20వ తేదీన బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణం నిర్వహించనున్నందున ఇప్పటి నుండే అవసరమైన అభివృద్ధి పనులను గుర్తించి చేపట్టి సకాలంలో పూర్తయ్యే విధంగా ప్రణాళికలను సిద్దం చేసుకోవాలని సూచించారు. నేచర్‌ క్యూర్‌ హాస్పిటల్‌ లైన్‌ రోడ్డు, 60 ఫీట్‌ రోడ్డు తదితర పనులను త్వరగా పూర్తిచేయాలని చెప్పారు. క్షేత్రస్థాయిలో పర్యటించి అన్ని ప్రాంతాలలో స్ట్రీట్‌ లైట్‌లు వెలిగేలా చూడాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జోనల్‌ కమిషనర్‌ లు రవి కిరణ్‌, శ్రీనివాస్‌ రెడ్డి, డీసీ ముకుంద రెడ్డి, ఈఈలు సుదర్శన్‌, ఇందిర, శానిటేషన్‌ డీఈ శ్రీనివాస్‌, హార్టికల్చర్‌ డీడీ శ్రీనివాస్‌, టౌన్‌ ప్లానింగ్‌ ఏసీపీలు రమేష్‌, క్రిస్టోఫర్‌, స్ట్రీట్‌ లైట్‌ ఈఈ సంతోష్‌, డీఈఈలు కిరణ్మయి, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.
బన్సీలాల్‌ పేట డివిజన్‌ లో పర్యటించిన మంత్రి
ప్రజలు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. బన్సీలాల్‌ పేట డివిజన్‌ లోని సీ క్లాస్‌ లో వివిధ శాఖల అధికారులతో కలిసి మంత్రి పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాలనీలో డ్రయినేజీ, రోడ్ల సమస్యను పరిష్కరించాలని స్థానిక ప్రజలు మంత్రిని కోరారు. స్పందించిన మంత్రి డ్రయినేజీ లైన్‌కు పునరుద్దరణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా కాలనీలోని అన్ని రోడ్ల అభివృద్ధికి ప్రతిపాదనలను రూపొందించి అందజేయాలని చెప్పారు. తమకు నల్లా కనెక్షన్‌లు ఇప్పించాలని పలువురు మహిళలు మంత్రిని కోరగా, వెంటనే కనెక్షన్‌ లను ఇవ్వాలని వాటర్‌ వర్క్స్‌ అధికారులను ఆదేశించారు. కాలనీ ప్రజల అవసరాల కోసం కమ్యునిటీ హాల్‌ నిర్మాణం కోసం రూ. 25 లక్షలు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. వెంటనే ప్రతిపాదనలను అందజేయాలన్నారు. కార్పొరేటర్‌ హేమలత, జోనల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌ రెడ్డి, ఈఈ సుదర్శన్‌, వాటర్‌ వర్క్స్‌ జీఎం ప్రభు, శానిటేషన్‌ డీఈ శ్రీనివాస్‌, బీఆర్‌ఎస్‌ డివిజన్‌ అధ్యక్షుడు రాజు తదితరులు ఉన్నారు.

Spread the love