వామపక్ష, లౌకిక, ప్రజాతంత్ర శక్తులతో ముందుకెళ్తాం

We will go ahead with left-wing, secular and democratic forces– ప్రజల మధ్య చిచ్చు పెట్టే మతోన్మాద బీజేపీని తెలంగాణలో అడుగుపెట్టనీయొద్దు
– కమ్యూనిస్టుల మద్దతు లేకుంటే మునుగోడులో బీఆర్‌ఎస్‌ గెలిచేదా? : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌.వీరయ్య
నవతెలంగాణ-సంగారెడ్డి
ప్రజల మధ్య చిచ్చు పెట్ట్టే మతోన్మాద బీజేపీని తెలంగాణలో అడుగుపెట్టనీయబోమని, దానికోసం వామపక్ష, లౌకిక, ప్రజాతంత్ర శక్తులతో ముందుకెళ్తామని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌.వీరయ్య స్పష్టంచేశారు. బుధవారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కేవల్‌ కిషన్‌ భవన్‌లో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా ఎస్‌.వీరయ్య మాట్లాడుతూ.. కేంద్రంలో మతోన్మాద, ప్రజా వ్యతిరేక బీజేపీని గద్దె దింపడమే తమ లక్ష్యమన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో మేం దీనికి కట్టుబడే బీఆర్‌ఎస్‌కు మద్దతు ఇచ్చామని, కమ్యూనిస్టుల మద్దతు లేకుంటే మునుగోడులో బీఆర్‌ఎస్‌ గెలిచేదా అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ బీజేపీని వ్యతిరేకిస్తున్నామని ప్రకటించడంతోనే కలిసి నడవాలని భావించామని, స్వయంగా సీఎం కేసీఆరే అనేక వేదికలపై కలిసే నడుస్తామని చెప్పారని గుర్తుచేశారు.
ఇప్పుడు బీఆర్‌ఎస్‌ వైఖరిలో ఎందుకు మార్పు వచ్చిందో, వామపక్షాలతో పొత్తు ఎందుకు వద్దనుకున్నారో కేసీఆర్‌.. ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. తెలంగాణలో రానున్న కాలంలో తమదే అధికారమని విర్రవీగిన బీజేపీని నిలువరించింది ఎర్రజెండానే అని తెలిపారు. ఒకవేళ మునుగోడులో బీజేపీ గెలిస్తే రాష్ట్రంలో నేడు రాజకీయ వాతావరణం మరోలా ఉండేదన్నారు. మతోన్మాద, ప్రజా వ్యతిరేక బీజేపీపై నిత్యపోరు కొనసాగిస్తూ వామపక్ష, లౌకిక, ప్రజాతంత్ర శక్తులతో ముందుకెళతామన్నారు. అనంతరం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చుక్క రాములు మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడేది ఎర్రజెండానే అన్నారు.
సమావేశంలో జిల్లా కార్యదర్శి జయరాజు, కార్యదర్శి వర్గ సభ్యులు బి.మల్లేష్‌,కె.రాజయ్య, ఎ.మాణిక్‌, బి.రాంచందర్‌, ఎన్‌.నర్సింహారెడ్డి, జి.సాయిలు తదితరులు పాల్గొన్నారు.

Spread the love