మేమొస్తే…2 లక్షల ఉద్యోగాల భర్తీ

If we try...replacement of 2 lakh jobs– జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటిస్తాం..
– టీఎస్‌పీఎస్‌సీని కాదు… బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్నే రద్దు చేద్దాం : రేవంత్‌రెడ్డి
– 14న సడక్‌ బంద్‌ : కోదండరామ్‌
– ఆదనంగా 258 ఓఎంఆర్‌ షీట్లు ఎక్కడివి? : ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌
– సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిరుద్యోగుల రౌండ్‌ టేబుల్‌ సమావేశం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
‘అయ్యకు కాళేశ్వరం..అన్నకు టీఎస్‌పీఎస్‌సీ..చెల్లెకు సింగరేణి కమీషన్లు కురిపించే ఏటీఎమ్‌లుగా మారాయి. వారికి వాటి నుంచి వచ్చే కమీషన్లు తప్ప రాష్ట్రంలోని నిరుద్యోగులు పడుతున్న గోస కనపడటం లేదు. ఈసారీ కమీషన్ల ద్వారా వచ్చిన పైసలు పంచి కేసీఆర్‌ గెలవాలని చూస్తున్నడు. ఆయన ఎన్ని డబ్బుల్నైనా పంచుకోనివ్వండి.. కిరాయి మనుషులను తెచ్చుకోనియ్యండి..సీసాలు పంచుకోనియ్యండి..రాష్ట్రంలోని 30 లక్షల మంది నిరుద్యోగులున్నరు. వారు తల్లిదండ్రులను, బంధువులను చైతన్యపరిచినా చాలు. కేసీఆర్‌ను ఇంటికి పంపడానికి 60 డేస్‌ టైమ్‌ కేటాయించండి. టీఎస్‌పీఎస్‌సీ రద్దు కోసం కాదు కేసీఆర్‌ ప్రభుత్వాన్ని రద్దు చేయడమే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం. తెలంగాణకు పట్టిన చీడ, పీడ కమీషన్ల కేసీఆర్‌ మాత్రమే. బొక్కలో దాక్కున్న ఎలుకను బయటకు రప్పించాలంటే పొగబెట్టినట్టుగానే కేసీఆర్‌ ఫామ్‌ హౌస్‌, ప్రగతిభవన్‌ల నుంచి బయటకు రావాలంటే నిరుద్యోగ యువత కదలాలి. నిరుద్యోగ రౌండ్‌ టేబుల్‌ సమావేశం తీర్మానించినట్టుగా ఈ నెల 14న జరగబోయే జాతీయ రహదారుల దిగ్బంధనం కార్యక్రమానికి పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాం. మహబూబ్‌నగర్‌- హైదరాబాద్‌ (బెంగుళూరు-హైదరాబాద్‌ హైవే) జాతీయ రహదారిని దిగ్బంధించే బాధ్యతను ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌, నేను తీసుకుంటున్నాం. నిరుద్యోగులంతా ఒక్కటై రోడ్లెక్కితే కేసీఆర్‌ గద్దె దిగుడు ఖాయమే’ అని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే ఏటా జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించి రెండు లక్షలకుపైగా ఉన్న ఖాళీలను వెంటనే డేట్ల వారీగా భర్తీ చేస్తామని ప్రకటించారు. ఖాళీ అయిన పోస్టులను కూడా వెనువెంటనే నింపుతామని హామీనిచ్చారు.
ఆదివారం హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో టీఎస్‌పీఎస్‌సీ ప్రక్షాళన చేయాలనీ, కొత్త బోర్డు ఆధ్వర్యంలోనే పరీక్షలు నిర్వహించాలని డిమాండ్‌ చేస్తూ నిరుద్యోగుల రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. దీనికి నిరుద్యోగ నాయకులు శివానందస్వామి, మిత్రదేవి, మహేశ్‌ అధ్యక్షత వహించారు. రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ..పార్టీ ఫిరాయింపుదారులకు, రాజకీయ పదవులు దక్కనివారికి, దళారులకు పునరావాస కేంద్రంగా టీఎస్‌పీఎస్‌సీ మారిందని ఆరోపించారు. గుమస్తా స్థాయి లేని వారు గ్రూప్‌-1 పరీక్ష ఎలా నిర్వహిస్తారు? పేపర్‌ లీకేజీ జరిగినప్పుడే బోర్డును రద్దెందుకు చేయలేదు? అర్హులను నియమిస్తే ఈ పరిస్థితి వచ్చేదా? అత్యున్నత ఉద్యోగ నియామకాలు చేపట్టే బోర్డులో ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందేంటి? కొందరు దళారులుగా మారి పోస్టులను అమ్ముకుంటున్నది వాస్తవం కాదా? లీకేజీలు, ఈ నిర్లక్ష్యానికి కారణం సీఎం కేసీఆర్‌ కాదా? ఐటీ మంత్రి తారక రామారావు టీఎస్‌పీఎస్‌సీ అవకతవకలపై ఏం సమాధానం చెబుతారు? అని ప్రశ్నల వర్షం కురిపించారు. కేటీఆర్‌కు రూ.100 కోట్ల పరువు నష్టం చెల్లిస్తే ఆయన్ను ఎన్నయినా తిట్టొచ్చా? అని ప్రశ్నించారు. టీఎస్‌పీఎస్‌సీ అవతవకల విషయంలో సీఎంవో అధికారి రాజశేఖర్‌రెడ్డి, లింగారెడ్డి, పీఏను ఎందుకు అరెస్టు చేయలేదని నిలదీశారు. గ్రూపు-1 పరీక్షపై హైకోర్టు సింగిల్‌, డబుల్‌ బెంచ్‌లు చెంపలు వాయించినా బుద్ధి రాలేదన్నారు. సచివాలయం నిషేధిత ప్రాంతమా? ఎవ్వరినీ లోనికి రానివ్వని అది అవసరమా? అని అన్నారు. కేసీఆర్‌కు లేనిది..కోదండరామ్‌కు ఉన్నది విశ్వసనీయతనే అన్నారు. పోరాటాన్ని కోదండరామ్‌ ముందుకు తీసుకెళ్లాలని కోరారు. ఆయన వెనకాల తాము నడుస్తామన్నారు.
14న సడక్‌ బంద్‌ : టీజేఎస్‌ అధ్యక్షులు, ప్రొఫెసర్‌ కోదండరామ్‌
నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని నిరసిస్తూ టీఎస్‌పీఎస్‌సీ బోర్డు రద్దు కోరుతూ ఈ నెల 14న సడక్‌ బంద్‌ చేపడుతున్నామనీ, అందులో భాగంగా కరీంనగర్‌, వరంగల్‌, సూర్యాపేట, మహబూబ్‌నగర్‌ గుండా హైదరాబాద్‌ వచ్చే నాలుగు జాతీయ రహదారులను దిగ్బంధించనున్నట్టు ప్రకటించారు. విద్యార్థులంతా రోడ్లమీదికొచ్చి ప్రభుత్వాన్ని స్తంభింపజేయాలని పిలుపునిచ్చారు. 16 పరీక్షలు లీకేజీ అయ్యాయంటేనే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. అన్ని పరీక్షలోనూ అవతవకలు జరిగాయని ఆరోపించారు. అయితే, గ్రూపు-1 ప్రిలిమినరీలోనే సాక్ష్యాలు బయటపడి దొరికిపోయారని తెలిపారు. బిస్వాల్‌ కమిటీ రిపోర్టు, రిటైర్డ్‌మెంట్ల ద్వారా అయిన ఖాళీలు, ప్రభుత్వ రంగ సంస్థల్లోని పెండింగ్‌ పోస్టులను కలుపుకుంటే రాష్ట్రంలో 3.10 లక్షలకుపైగా ఖాళీలున్నాయన్నారు. 30 లక్షలకుపైగా ఉన్న నిరుద్యోగులతో రాష్ట్ర ప్రభుత్వం ఆటలాడుకుంటూ వారి మానసిక సైర్థ్యాన్ని దెబ్బతీస్తున్నదనీ, ఇది కనీసం మానవీయత లేని ప్రభుత్వమని విమర్శించారు.
జనార్ధన్‌రెడ్డి, బోర్డు సభ్యులు తప్పుకోవాలి : ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌
గ్రూప్‌-1 ప్రిలిమినరీతో పాటు పలు పరీక్షల నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించిన టీఎస్‌ఎపీఎస్‌సీ చైర్మెన్‌ జనార్ధన్‌రెడ్డి, బోర్డు సభ్యులు వెంటనే తప్పుకోవాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ సూచించారు. గ్రూప్‌-1 ప్రిలిమినరీ రెండో సారి నిర్వహించినప్పుడు బయోమెట్రిక్‌ ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు.
అదనంగా 258 ఓఎంఆర్‌ షీట్లు ఎక్కడ నుంచి వచ్చాయని నిలదీశారు. టీఎస్‌పీఎస్‌సీ తప్పిదాలపై ప్రశ్నించే వారిపై కేసులు పెట్టి వేధించడం అలవాటుగా మారిందన్నారు. ప్రభుత్వ తీరు వల్ల విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వాపోయారు. పేపర్లు ఎలా లీకవుతున్నాయి? ఎవరెవరు పరీక్ష రాశారు? ఉద్యోగాలు నిజాయితీ పొందిందెవరు? అక్రమ పద్ధతిలో సంపాదించిందెవరు? అనే దాన్ని తెలుసుకోవాలంటే సీఎంఓ కార్యాలయ, టీఎస్‌పీఎస్‌సీ సిబ్బంది, ఉద్యోగం పొందిన వారి కాల్‌డేటా తీస్తే దొంగలందరూ బయటపడుతారన్నారు.
ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌ మాట్లాడుతూ..ఏ సమాజాన్నైనా మార్చగలిగే శక్తి యువతకు ఉందన్నారు. యువతకు అన్యాయం చేసే ఇలాంటి సర్కారు మనకు అవసరమా? అని ప్రశ్నించారు. కార్యక్రమంలో ప్రొఫెసర్‌ వినాయక్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎన్నం శ్రీనివాస్‌రెడ్డి, డాక్టర్‌ రియాజ్‌, అశోక్‌(అశోకా ఇనిస్టిట్యూట్‌), విద్యార్థి నిరుద్యోగ వేదిక చైర్మెన్‌ చనగాని దయాకర్‌, 1969 ఉద్యమకారుల సంఘం నాయకులు కె.మోహన్‌రావు, జర్నలిస్టు వేణుగోపాల్‌రెడ్డి, వెంకటేశ్‌ నాయక్‌(ఓయూ), సురేశ్‌, గ్రూపు-1 పరీక్ష బాధితులు, డీఎస్సీ అభ్యర్థులు, తదితరులు పాల్గొని మాట్లాడారు.

Spread the love