జిల్లాల్లోనే మెరుగైన వైద్యం అందేలా చర్యలు : ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఆదిలాబాద్, కొమురం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాల్లో ప్రభుత్వ వైద్య సేవలను మరింత బలోపేతం చేస్తున్నామనీ, ప్రజలకు సొంత జిల్లాల్లోనే మెరుగైన వైద్య సేవలందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. ఈ మేరకు ఆయా జిల్లాల్లో ప్రజలకు అందుతున్న వైద్య సేవలు, మౌలిక వసతులు, అభివృద్ధి పనుల పురోగతిపై సోమవారం హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్.అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలోని తన చాంబర్‌లో మంత్రి రాజనర్సింహ సమీక్షించారు. సమావేశంలో ఎమ్మెల్యేలు వెడ్మ బొజ్జు, పాయల్ శంకర్, డాక్టర్ పాల్వాయి హరీశ్ బాబు, కోవ లక్ష్మి, రామారావు పవర్, అనిల్ జాదవ్, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా జడ్ చొంగ్తు, టీజీఎంఎస్‌ఐడీసీ ఎండీ గౌరవ్ ఉప్పల్, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ, డీఎంఈ డాక్టర్ నరేంద్ర కుమార్, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్, డాక్టర్ రవీందర్ నాయక్, ఆరోగ్యశ్రీ సీఈవో హనుమంతు, ఆదిలాబాద్ రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ జయసింగ్ రాథోడ్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాల డీఎంహెచ్‌వోలు, ప్రభుత్వ ఆస్పత్రుల సూపరింటెండెంట్లు, ఇతర ఉన్నతాధికారులు, పాల్గొన్నారు. ఆదిలాబాద్ రిమ్స్‌తో పాటు ఆసిఫాబాద్, నిర్మల్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, జనరల్, జిల్లా, ఏరియా ఆస్పత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్ సెంటర్ల పనితీరును జిల్లాల వారీగా మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో ప్రభుత్వ ఆస్పత్రుల పనితీరు గతంతో పోలిస్తే గణనీయంగా మెరుగుపడిందని మంత్రికి తెలిపారు. డాక్టర్లు, నర్సింగ్, ఇతర వైద్య సిబ్బంది సంఖ్య పెరగడంతో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని చెప్పారు. స్థానిక అవసరాలకు అనుగుణంగా మరిన్ని సౌకర్యాలు కల్పించాలనీ, మౌలిక వసతులు కల్పించి కొన్ని ప్రత్యేక వైద్య విభాగాలను బలోపేతం చేయాలని కోరారు. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను మంత్రి దృష్టికి తీసుకురాగా, వాటిపై మంత్రి సానుకూలంగా స్పందించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని గిరిజన, అటవీ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు కూడా నగరంలోని ప్రజలకు అందుబాటులో ఉన్న అన్నిరకాల వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఏజెన్సీ ఏరియాల్లో ప్రభుత్వ ఆస్పత్రుల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నామని చెప్పారు. ఐటీడీఏల పరిధిలోని ఏరియాస్పత్రుల్లో దశలవారీగా సీటీ స్కాన్ సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని హామీనిచ్చారు. అవసరమైన చోట కొత్త సబ్ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు, ప్రస్తుతం ఉన్న పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియాస్పత్రుల అవసరానికి అనుగుణంగా అప్‌గ్రేడ్ చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.ఆదిలాబాద్, అసిఫాబాద్, నిర్మల్ జిల్లాలకు ఆదిలాబాద్ రిమ్స్‌ను ప్రధాన వైద్య కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని మంత్రి తెలిపారు. సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నామని చెప్పారు. కార్డియాలజి, నెఫ్రాలజీ, తదితర సూపర్ స్పెషాలిటీ సేవలను ఇప్పటికే ప్రారంభించామనీ, భవిష్యత్తులో అన్నిరకాల వైద్య సేవలను ఇక్కడే అందుబాటులోకి తీసుకొస్తామని హామీనిచ్చారు. ఏజెన్సీ జిల్లాల్లో మలేరియా, డెంగీ, వైరల్ జ్వరాలు, డయేరియా వంటి సీజనల్ వ్యాధులపై ప్రత్యేక అప్రమత్తతతో పనిచేయాలని ఆదేశించారు. అవసరమైతే ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించి గ్రామ స్థాయిలోనే వైద్య సేవలు అందించాలని సూచించారు. త్వరలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియాస్పత్రులకు అనుబంధంగా అదనపు అంబులెన్స్‌లను కూడా అందుబాటులోకి తీసుకొస్తామని హామీనిచ్చారు. 108, 102 అంబులెన్స్ సేవలకు అంతరాయం లేకుండా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఏజెన్సీలోని గర్భిణీలను ప్రసవ తేదీకి వారం, పది రోజుల ముందే హాస్పిటళ్లలోని బర్త్ వెయిటింగ్ రూమ్స్‌కు తరలించాలనీ, హైరిస్క్ గర్భిణుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ప్రభుత్వ వైద్యసేవలను బలోపేతం చేస్తాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



