బేషరతుగా క్షమాపణలు చెప్పాలి
ప్రశ్నించే వారిని చంపడమే బీజేపీ విధానామా ? : ఎస్ఎఫ్ఐ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
విద్యార్థుల పట్ల బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. రాష్ట్ర అధ్యక్షులు ఎస్.రజనీకాంత్, రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు ఒక ప్రకటన విడుదల చేశారు. తమ హక్కుల కోసం, న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడుతున్న విద్యార్థులపై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడం, “కాల్చిపారేయాలి” అన్నట్టుగా బాధ్యతారాహిత్యంగా మాట్లాడడం అత్యంత అభ్యంతరకరం, సిగ్గుచేటు అని విమర్శించారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రతి పౌరునికి, ముఖ్యంగా విద్యార్థులకు తమ సమస్యలపై శాంతియుతంగా నిరసన తెలిపే రాజ్యాంగబద్ధమైన హక్కు ఉందని గుర్తుచేశారు. అలాంటి విద్యార్థులను నేరస్థులుగా చిత్రీకరిస్తూ, వారిపై హింసను ప్రోత్సహించేలా మాట్లాడడం బీజేపీ నాయకుల ప్రజాస్వామ్య వ్యతిరేక వైఖరికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార మదంతో, అహంకారంతో విద్యార్థి ఉద్యమాలను అణచి వేయాలని బీజేపీ నాయకులు ప్రయత్నించడం సమంజసం కాదని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను వినాల్సిన ప్రజాప్రతినిధులు, వాటి పరిష్కారానికి కృషి చేయకుండా విద్యార్థులపై విద్వేషాన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్య విలువలను అవమానించడమేనని దుయ్యబట్టారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి వెంటనే తన వ్యాఖ్యలను బేషరతుగా ఉపసంహ రించుకోవాలని కోరారు. దేశంలోని విద్యార్థి లోకానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆయన వ్యాఖ్యలకు నిరసనగా, బీజేపీ ప్రజావ్యతిరేక వైఖరిని ఎండగడుతూ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
విద్యార్థులపై కొండా విశ్వేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలు సిగ్గుచేటు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



