– ప్రచారంలో దూకుడు పెంచిన సిపిఐ(ఎం) పార్టీ శ్రేణులు
– అడుగు అడుగునా ఘన స్వాగతం పలుకుతున్న గిరిజన పల్లెలు
నవతెలంగాణ-దుమ్ముగూడెం
ఈ నెల 30 వ తేదీన జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఐ(ఎం) ఎమ్మెల్యే అభ్యర్దిగా బరిలో ఉన్న కారం పుల్లయ్య ప్రచారంలో దూసుకుపోతున్నాడు. సోమవారం తన స్వగ్రామమైన మారాయిగూడెం గ్రామంలో ప్రచారం నిర్వహించారు. గ్రామస్తులు డప్పు చప్పులతో సాంప్రదాయ నృత్యాలతో, నుదిటిన తిలకం దిద్ది పూలమాలలతో ఘనస్వాగతం పలికారు. ముందు కారం పుల్లయ్య ఆదివాసీల ఇలవేల్పు రెండవ మేడారంగా ప్రసిద్దిగాంచిన సమ్మక్క, సారలమ్మ గద్దెలను దర్శించుకున్నారు. ఈ సందర్బంగా దేవరబాలలు సోడి అచ్చమ్మ, శాంతమ్మలు ప్రత్యేక దీవెనలు అందజేశారు. అనంతరం తల్లి దండ్రుల దీవెనలు తీసుకుని గ్రామంలో ప్రచారం నిర్వహించారు. సిపిఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు యలమంచి వంశీకృష్ణ అద్యక్షతన నిర్వహించిన ప్రచార సభలో పుల్లయ్య మాట్లాడారు. నేను మీ ప్రాంతంలో పేద గిరిజన కుటుంబం నుండి వచ్చిన బిడ్డగా గత పది ఏళ్లుగా క్రీయాశీల రాజకీయాల్లో ఉంటూ ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తూ పార్టీ పిలుపు మేరకు పోడు భూములకు పట్టాలు, తునికి ఆకు బోనస్ ఇప్పించడంలో ముందుండి పోరాటాలు నిర్వహించానని తెలిపారు. ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్దులు బరిలో ఉన్న బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన అభ్యర్దులకు ఈ ప్రాంత సమస్యలు పట్టని నాయకులు అన్నారు. పార్టీలో పూర్తి కాలపు కార్యకర్తగా ఉన్న నాకు ఈ నెల 30 వ తేదీన జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో సుత్తి కొడవలి నక్షత్రం పై ఓట్లు వేసి గెలిపిస్తే చట్ట సభలో పోడు కొట్టి సాగుచేస్తున్న ప్రతి పేద గిరిజనులకు హక్కు పత్రాలు, విద్య, వైద్యం, రహదారులు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాల కల్పన కోసం కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు యలమంచి రవికుమార్, నాయకులు బొల్లి సూర్యచందర్‌రావు, మర్మం చంద్రయ్య, సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ బి.రమేష్, సోయం జోగారావు, మారాయిగూడెం గ్రామపంచాయితీ సర్పంచ్ తొడం తిరుపతిరావు, రేసు వీరస్వామి, కూరం వీరభద్రం, యలమంచి శ్రీనివాసరావు, బొల్లి సత్యనారాయణ, కుమ్మరికుంట్ల సాంబశివరావు, కొమరం చంటి, నాగమణి, మర్మం మహేందర్ తదితరులు పాల్గొన్నారు.