ఆదరించండి : వనమా

– రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తా
– అభివృద్ధి పనుల శంకుస్థాపనలో ఎమ్మెల్యే
నవతెలంగాణ-పాల్వంచ
కొత్తగూడెం నియోజకవర్గంలో నేను చేస్తున్న పనులకు సీఎం కేసీఆర్‌ నమ్మి మళ్ళీ టికెట్‌ ఇచ్చారని, ఆదరిస్తే రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తానని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. మంగళవారం పట్టణంలో ఆయన సుడిగాలి పర్యటనలు చేశారు. సుమారు రూ.15 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. వెంకటేశ్వర హిల్స్‌ కాలనీ, బాపూజీ నగర్‌, కాంట్రాక్టర్స్‌ కాలనీ, ప్రాంతాల్లో పాదయాత్రలు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలలో ఆయన కొత్తగూడెం నియోజకవర్గ ప్రజల ఆనందమే నా ఆనందమని అన్నారు. ప్రజలు జీవితాంతం సుఖసంతోషాలతో ఉండాలన్నదే నా కోరిక అని చెప్పారు. కొత్తగూడెం నియోజకవర్గం నా కన్నతల్లి లాంటిదన్నారు. పాల్వంచలో రాజకీయ ఓనమాలు నేర్చుకున్నా అని తెలిపారు. 18 సంవత్సరాలు పంచాయతీ సర్పంచ్‌గా, ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసి ప్రజల మన్ననలు పొందానని చెప్పారు. పాల్వంచలో పేదలకు 20 కాలనీలను నిర్మాణం చేశానని, 1 లక్ష మందికి ఇల్లు కట్టించానని, వేల మందికి ఇళ్ల స్థలాలను పంపిణీ చేసినట్లు చెప్పారు. పాల్వంచ కొత్తగూడెం ప్రజలకు ప్రస్తుతం కిన్నెరసాని జలాలను అందిస్తున్నానని, త్వరలోనే గోదావరి జలాలను అందిస్తానని చెప్పారు.
ఈ కార్యక్రమంలో వనమా రాఘవేంద్రరావు, డీసీఎంఎస్‌ వైస్‌ చైర్మెన్‌ కొత్వాల శ్రీనివాసరావు, మున్సిపల్‌ కమిషనర్‌ ఏ.స్వామి, డీఈ మురళి, ఏఈ రాజేష్‌, పబ్లిక్‌ హెల్త్‌ డీఈ శ్రీనివాస్‌, పెద్దమ్మ గుడి చైర్మెన్‌ మహిపతి రామలింగం, సొసైటీ వైస్‌ చైర్మెన్‌ కాంపల్లి కనకేష్‌, పట్టణ వి.ఆర్‌.ఎస్‌ అధ్యక్షులు మంతపురి రాజుగౌడ్‌, వర్కింగ్‌ కమిటీ అధ్యక్షులు ఎస్విఆర్కె ఆచార్యులు, మండల అధ్యక్షులు మల్లెల శ్రీరామ్మూర్తి, సింధు తపస్వి, బీఆర్‌ఎస్‌ నాయకులు వెంకటేశ్వరరావు, వై.రమణ మూర్తి నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Spread the love