అబద్ధాలతో లబ్దిదారులను మోసం చేస్తోన్న ప్రభుత్వం
ఇచ్చిన హామీని అమలు చేయాలి
మహిళా సమాఖ్యలకు ఇస్తున్న బస్సుల్లో వికలాంగులకు 5 శాతం రిజర్వేషన్ ఇవ్వాలి
లబ్దిదారులకు ఇంటివద్దనే ముఖ గుర్తింపు చేపట్టాలి
మాట తప్పితే ముఖ్యమంత్రి, మంత్రుల పర్యటనలను అడ్డుకుంటాం : ఎన్పీఆర్డీ ధర్నాలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యం అడివయ్య
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో జూన్ 2న కొత్తగా 2 లక్షల మందికి చేయూత పింఛన్లను మంజూరు చేస్తామంటూ ప్రభుత్వం ఇచ్చిన హామీ ఏమైందని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్పీఆర్డీ ) ప్రశ్నించింది. ఇదే అంశంపై వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.అడివయ్య నేతృత్వంలో బుధవారం హైదరాబాద్ లోని సెర్ప్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. పింఛన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామిని అమలు చేయాలనీ, మహిళా సమాఖ్యలకు ఇస్తున్నా ఆర్టీసీ బస్సుల్లో 5 శాతం రిజర్వేషన్ అమలు చేయాలనీ, వికలాంగులకు ముఖ గుర్తింపు ఇంటి వద్దనే చేయాలని ప్ల కార్డులను ప్రదర్శిస్తూ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వికలాంగులు నినాదాలు చేశారు. అనంతరం సెర్ప్ డైరెక్టర్ కృష్ణమూర్తికి వినతిపత్రం సమర్పించారు. ధర్నాను ఉద్దేశించి అడివయ్య మాట్లాడుతూ 2023 అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టో లో చేయూత పెన్షన్స్ లలో వికలాంగులకు రూ.4,016 నుంచి. రూ.6 వేలకు, మిగతా చేయూత పెన్షన్స్ రూ.2,016 నుంచి రూ.4 వేలకు పెంచుతామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని గుర్తుచేశారు.
అధికారంలోకి వచ్చాక ప్రజా పాలన పేరుతో 24.85 లక్షల మంది అర్హులైన చేయూత లబ్ధిదారుల నుంచి కొత్తగా పెన్షన్స్ కోసం దరఖాస్తులు స్వీకరించినట్టు తెలిపారు. 30 నెలల నుంచి వారికి ప్రభుత్వం పెన్షన్స్ మంజూరు చేయలేదని విమర్శించారు. 2026-27 వార్షిక బడ్జెట్ సందర్బంగా అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా జూన్ 2న రాష్ట్రంలో 2 లక్షల మందికి కొత్తగా పెన్షన్స్ మంజూరు చేస్తామని ప్రకటించి మాట తప్పారన్నారు. ప్రభుత్వ ప్రకటన నేపథ్యంలో సుమారుగా 11.22 లక్షల మంది కొత్తగా చేయూత పెన్షన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ కొత్తగా చేయూత పెన్షన్స్ మంజూరు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే కొత్త చేయూత పెన్షన్స్ మంజూరు చేయాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా పోస్టాఫీసుల ద్వారా పంపిణి చేస్తున్న చేయూత పెన్షన్స్ ను బ్యాంకుల ద్వారానే పంపిణి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 2023 అక్టోబర్ నాటికి 44 లక్షల మందికి పెన్షన్స్ వస్తే 2026 మార్చి నాటికి 42 లక్షల మందికే పెన్షన్స్ వస్తున్నాయని అడివయ్య విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీ వికలాంగులకు చేయూత నిస్తుందని చెప్పిన ముఖ్యమంత్రి వికలాంగుల చేతికందే ఆసరాను ఎందుకు తీసివేశారని ప్రశ్నించారు. పెన్షన్స్ పెంచాలంటే నిధులు లేవంటున్నా ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన 30 నెలల కాలంలో పబ్లిసిటీ కోసం ఎన్ని కోట్లు ఖర్చు చేశారో ప్రకటించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రికి ప్రచారం మీద ఉన్న శ్రద్ధ చేయూత లబ్ధిదారుల మీద లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిధులు లేకుంటే కాంట్రాక్టు, కమిషన్స్ వచ్చే పనులకు నిధులు ఎందుకు కేటాయిస్తున్నారని నిలదీశారు. నిధులే లేకుంటే నియోజకవర్గ కేంద్రాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ విద్యా సంస్థలు ఎందుకు ఏర్పాటు చేస్తున్నారో చెప్పాలన్నారు. ముఖ్యమంత్రికి కమిషన్స్ వచ్చే పనులు తప్ప వికలాంగుల సంక్షేమం కన్పించడం లేదా అని ప్రశ్నించారు. ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి నిధులు కేటాయించకుండా, అభివృద్ధి గురించి మాట్లాడడం అంటే ప్రజలను మోసం చేయడమే అవుతుందని తేల్చిచెప్పారు. అధికారం కోసం 6 గ్యారంటీలు, 420 హామీలు ఇచ్చారని వాటిని అమలు చేయాలనే చిత్తశుద్ధి సీఎంకు లేదని అన్నారు. చేయూత పెన్షన్స్ పెంపు, కొత్త పెన్షన్స్ మంజూరు చేయకుంటే జూలై తరువాత జిల్లాల్లో ముఖ్యమంత్రి, మంత్రుల పర్యటనలను అడ్డుకుంటామని హెచ్చరించారు.
ఎన్పీఆర్డీ రాష్ట్ర అధ్యక్షులు కె.వెంకట్ మాట్లాడుతూ మండల మహిళా సమాఖ్యలకు ఆర్టీసీ బస్సులను అప్పగించిన పథకంలో 2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం, ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 1 అమలు చేయలేదని విమర్శించారు. వాటి ప్రకారం సంక్షేమ పథకాల్లో వికలాంగులకు 5 శాతం రిజర్వేషన్ అమలు చేయాల్సి ఉందని గుర్తుచేశారు. బస్సుల కేటాయింపుల్లో మహిళా వికలాంగులకు 5 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. మహిళా వికలాంగులు మహిళలకు కాదా ? అని ప్రశ్నించారు. ఎన్పీఆర్డీ రాష్ట్ర కోశాధికారి ఆర్ వెంకటేష్ మాట్లాడుతూ గ్రేటర్ హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలో చేయూత లబ్ధిదారుల ముఖగుర్తింపు కోసం తీవ్ర వైకల్యం కలిగిన వికలాంగులు, వయస్సు పైబడిన వృద్ధులు ప్రభుత్వ కార్యాలయం దగ్గరకు వెళ్ళడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వారికి ఇంటి వద్దనే ముఖగుర్తింపు చేయాలని డిమాండ్ చేశారు.
పెన్షన్స్ మంజూరు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం
సెర్ప్ డైరెక్టర్ హామీ
రాష్ట్రంలో చేయూత పెన్షన్స్ పెంపు, కొత్త పెన్షన్స్ మంజూరు కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని సెర్ప్ డైరెక్టర్ కృష్ణమూర్తి హామీ ఇచ్చారు.మహిళా సమాఖ్యలకు ఇస్తున్న ఆర్టీసీ బస్సులను మహిళా వికలాంగులకు ఇచ్చే అంశంపై ప్రభుత్వంతో చర్చిస్తామని తెలిపారు. చేయూత లబ్ధిదారుల ముఖ గుర్తింపు విషయంలో వికలాంగులు, వృద్ధులకు ఇంటి వద్దనే ముఖ గుర్తింపు చేసే విదంగా ఉత్తర్వులు జారీ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎన్పీఆర్డీ కేంద్ర కమిటీ సభ్యులు జె రాజు, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉపేందర్, సహాయ కార్యదర్శులు నాగలక్ష్మి, బాలేశ్వర్, రాష్ట్ర కమిటీ సభ్యులు పి శశికళ, ఎస్.రాజు, జగదీశ్, బంగారయ్య, రమేష్, షాయిన్ బేగం, చంద్రమోహన్, భాగ్యలక్ష్మి, నర్సిములు, లలిత, భుజంగా రెడ్డి, కుర్మయ్య, జయలక్ష్మి లతో పాటు గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, భువనగిరి, సంగారెడ్డి, వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లాల నుంచి వికలాంగులు హాజరయ్యారు.



