రాహుల్‌ ప్రశ్నించగానే అదానీ ఇంజిన్‌ షెడ్డుకు పోయింది

– ‘భారత్‌ న్యాయ్‌ యాత్ర’తో ప్రధాని ఇంజిన్‌ కూడా పని చేయదు
– మోడీ మెడిసిన్‌కు ఎక్స్‌పైరీ డేట్‌
– ఆ మందు అస్సలు పని చేయదు : నాగ్‌పూర్‌ కాంగ్రెస్‌ ఆవిర్భావ సభలో సీఎం రేవంత్‌ రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
‘ప్రతి మందుకూ ఒక ఎక్స్‌పైరీ డేట్‌ ఉంటుంది. అదేవిధంగా ప్రధాని మోడీ అనే మెడిసిన్‌కు కూడా ఎక్స్‌పైరీ డేట్‌ అయిపోయింది. రాబోయే రోజుల్లో నరేంద్ర మోడీ మెడిసిన్‌ ఈ దేశంలో పని చేయదు’ అని టీపీసీసీ అధ్యక్షులు, తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి అన్నారు. గురువారం మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో నిర్వహించిన కాంగ్రెస్‌ 139వ ఆవిర్భావ సభకు హాజరైన రేవంత్‌ బీజేపీపై నిప్పులు చెరిగారు. నరేంద్ర మోడీ ఎప్పుడూ ‘చప్పన్‌ ఇంచ్‌ ఛాతీ’ అని గొప్పలు చెప్పుకుంటారని, కానీ ఆయన నేతృత్వంలో నడుస్తున్న లోక్‌సభలోనే అగంతకులు ప్రవేశించి హంగామా చేస్తుంటే, ఏమి చేయలేకపోయారని ఎద్దేవా చేశారు. ‘మోడీ జీ….రేపు ఎర్రకోట మీద కాంగ్రెస్‌ జెండా ఎగరకుండా ఆపడం మీతరం కాదు’ అని హెచ్చరించారు. డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ అంటే అదానీ, ప్రధాని తప్ప మరేమీకాదన్నారు. రాహుల్‌ గాంధీ ఒక్కసారి లోకసభలో ప్రశ్నించగానే అదానీ ఇంజిన్‌ ఆగిపోయిందన్నారు. రిపేర్‌ కోసం షెడ్డుకు పోయిందని విమర్శించారు. రాహుల్‌ ఈ సారి మణిపూర్‌ నుంచి ముంబాయి వరకు చేపడుతున్న భారత్‌ న్యారు యాత్రతో ప్రధాని ఇంజిన్‌ కూడా పని చేయబోదని హెచ్చరించారు. ఆయన చేపట్టే యాత్రతో కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాహుల్‌ కన్యాకుమారి నుంచి కాశ్మీర్‌ వరకు దాదాపు 150 రోజులపాటు నాలుగువేల కిలోమీటర్ల మేర చేసిన భారత్‌ జోడో యాత్రతో మొదట కర్నాటకలో తర్వాత తెలంగాణరాష్ట్రంలో అధికారంలోకి వచ్చామన్నారు. ఇప్పుడు రాహుల్‌ యాత్ర మహారాష్ట్రలోకి రాబోతుందని చెప్పారు. అక్కడ కూడా కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల దృష్ట్యా రాబోయే 100 రోజులు కాంగ్రెస్‌ పార్టీ నాయకులకు, శ్రేణులకు చాలా కీలకమని రేవంత్‌ తెలిపారు. రానున్న 100 రోజుల్లో దేశం కోసం, పార్టీ కోసం సమయం కేటాయించి కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు కష్టపడాలంటూ నాయకులకు, కార్యకర్తలకు ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు.

Spread the love