Friday, April 17, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిఅంబేద్కర్‌ ఆశయానికి వారసులెవరు? విరోధులెవరు?

అంబేద్కర్‌ ఆశయానికి వారసులెవరు? విరోధులెవరు?

- Advertisement -

ఏప్రిల్‌ 14, డిసెంబర్‌ 6 అంబేద్కర్‌ జయంతి, వర్ధంతులకు లక్షలాదిగా ప్రజలు ఆయన విగ్రహాల వద్దకు చేరుతున్నారు. దండలేసి దండాలు పెడుతున్నారు. కానీ, ఆయన ఆశయ వారసులెవరు? విరోధులెవరు? తేల్చుకోవలసిన సమయమిది. అంబేద్కర్‌ను పూజించే భక్తులుగా మారుతున్న సంఖ్య పెరుగుతుంది. కానీ, ఈ భక్తితో మూఢత్వం పెరిగి పరోక్షంగా చాందస వాదులకు మేలు చేస్తుంది. అంబేద్కర్‌ బాట నడిచే, ఆశయాలు ఆచరించే వారి సంఖ్య పెరిగితే కులనిర్మూలనకు ఉపయోగపడుతుంది. ఆయన కీర్తి ప్రతిష్టలు ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్నాయి. మన దేశంలో ఆయన ఆశయాలకు వ్యతిరేకులు అధికారంలో ఉండటం వల్ల ఆయన చూపించిన మార్గాలు లక్ష్యాలు తిరోగమన వైపు ప్రయాణం చేస్తున్నాయి. దేశంలో ఎక్కువమంది ప్రజలను ప్రభావితం చేసిన నేతలలో గాంధీ, అంబేద్కర్‌లు మొదటి వరుసలో ఉంటారు. అయితే గాంధీ జాతిపితగా కొలవబడితే అంబేద్కర్‌ని మాత్రం దళిత నాయకుడిగా గౌరవిస్తున్నారు. కేవలం ఒక కులం నాయకుడిగా లేదా ఉపకులం నేతగా చూస్తున్నారు.

అంబేద్కర్‌ కులమతాలకతీతంగా పోరాడిన నాయకుడు. ఆయన లక్ష్యాలు, ఆశయాలు దేశంలో అవమానాలు, అసమానతలను రూపుమాపడానికి దిశ నిర్దేశం చేశాయి. వాటిని స్థిరీకరించాలనుకునే వారు కూడా అంబేద్కర్‌ విగ్రహాలకు మొక్కి ఆశయాలను తొక్కేస్తున్నారు. ఆరెస్సెస్‌ అనుబంధ సంస్థ సామాజిక సమరసత వేదిక దళితుల్లో హిందుత్వ భావాలను మతవిద్వేషాలను నింపుతున్నది. అంబేద్కర్‌ జయంతి రోజు ఆయన చిత్రపటానికి కుంకుమ బొట్లు, కొబ్బరికాయలు, అగర్‌బత్తిలతో ఆయన హిందుత్వానికి ప్రతినిధిగా చూపిస్తోంది. ముస్లిం క్రైస్తవ మత వ్యతిరేకిగా కొలుస్తూ అంబేద్కర్‌ని ఆరెస్సెస్‌ హైజాక్‌ చేసే కుట్ర చేస్తోంది.వాస్తవంగా అంబేద్కర్‌ ‘కులం పునాది హిందూ మతంలో ఉంది. దానిపై ఒక జాతిని ఒక నీతిని నిర్మించలేమని’ చెప్పాడు. చివరికి ‘పుట్టడడం నా చేతుల్లో లేదు కానీ, హిందువుగా మాత్రం చావను’ అని బౌద్దాన్ని స్వీకరించాడు.

పాలక పార్టీలు అంబేద్కర్‌ను కేవలం రాజ్యాంగ నిర్మాతగా, రిజర్వేషన్ల ప్రదాతగా కొలుస్తూ ఆయన లక్ష్యాలు, ఆశయాలు ప్రజలకు అర్థం కాకుండా నిరంతరంగా శ్రమిస్తున్నాయి. ఆయన ఆశయాన్ని ఐదు పైసల వంతు ఆచరించనివాళ్లు కూడా అంబేద్కర్‌ విగ్రహానికి దండలు వేసి దండాలు పెడుతున్నారు. వేల ఏండ్లుగా కొనసాగుతున్న అసమానతలకు మూలమైన మనుస్మృతి తమ ప్రాచీన భారత రాజ్యాంగం అంటూ ఆరెస్సెస్‌ ప్రకటిస్తుంది అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగం ఈ దేశానికి పనికిరాదంటూనే ఆయన చుట్టూ విగ్రహాల ప్రదక్షిణలు చేస్తున్నారు. రాజ్యాంగ మౌలిక లక్ష్యాలను కూకటి వేళ్లతో పెకిలిస్తున్నారు. ఒక కులంవారిలో ఒకరికి పదవులిచ్చి ఇదే సామాజిక న్యాయమంటున్నారు.ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతూ ప్రయివేటు రంగంలో రిజర్వేషన్లు కల్పించకుండా సామాజిక న్యాయం ఎలా సిద్ధించబడు తుంది? రాజ్యాంగ మూలస్తంభమైన ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కిస్తున్నారు. స్వయంగా బీజేపీ మంత్రులు, ఎంపీలే 2023 పార్లమెంట్‌ ఎన్నికల ముందు ”మాకు నాలుగు వందల సీట్లు ఇవ్వండి, భాజాప్త రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని” బహిరంగంగా వ్యాఖ్యలు చేశారు.

అంబేద్కర్‌ 1948లో కార్మిక వర్గానికి కనీస వేతన చట్టాన్ని రూపొందించాడు. మహిళలకు ప్రసూతి సెలవులు కల్పించాడు. అంతకుముందు ముందే కమ్యూనిస్టుల నాయకత్వంలో బొంబాయిలో జరిగిన నూలు మిల్లు కార్మికుల పోరాటంలో ఆయన ప్రత్యక్షంగా పాల్గొని సంపూర్ణ సంఘీభావం తెలిపాడు. నేడు ఆరెస్సెస్‌్‌ కనుసన్నల్లోని బీజేపీ సర్కార్‌ 29 కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్‌ కోడ్‌లు తీసుకొచ్చింది. కార్మికుల పొట్టలు కొడుతూ, కార్పొరేట్ల బొజ్జలు నింపుతూ కార్మిక వర్గానికి తీరని ద్రోహం చేస్తోంది. ఇదేనా అంబేద్కర్‌ ఆశయాన్ని గౌరవించడమంటే?1927 డిసెంబర్‌ 25న కర్మ గ్రహచారం పేరిట అస్పృశ్యులను పేదవాళ్లను అణిచివేస్తున్నటువంటి మనుస్మృతిని మహద్‌ మంచినీళ్లచెరువు పోరాటం సందర్భంగా అంబేద్కర్‌ తగలబెట్టాడు. స్త్రీ సమానత్వం కోసం అహర్నిశలు కృషి చేశాడు. పార్లమెంటులో హిందూ కోడ్‌ బిల్లులో స్త్రీలకు ఆస్తి హక్కు, వారసత్వ హక్కు, దత్తత హక్కు, విడాకుల హక్కు వంటివి ప్రవేశపెట్టి వారి రక్షణ కోసం నిలబడ్డాడు. నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం అంగీకరించకపోతే పార్లమెంటులో ఆయన కేంద్ర క్యాబినెట్‌ మంత్రికి రాజీనామా చేసి బయటకొచ్చాడు. బీజేపీ అధికారంలోకి వచ్చిన ఈ పన్నెండేళ్ల కాలంలో మహిళలపైన లైంగికదాడులు, దళితులపై దౌర్జన్యాలు, హత్యలు 250 రేట్లు పెరిగాయి.వారు అధికారాన్ని వెలగబెడుతున్న రాష్ట్రాల్లోనే అట్టడుగు వర్గాలపైన అత్యంత ఎక్కువ కొనసాగుతు న్నాయి.వీటిని అరికట్టకపోగా వారిపై లైంగికాడులకు ఒడిగట్టిన రేపిస్టులకు ఆ పార్టీ నాయకులు ఘన సత్కారం చేస్తున్నారు. అంబేద్కర్‌ మనుస్మృతిని తగలబెడితే నేటి ఆరెస్సెస్‌-బీజేపీ వారసులు మనుస్మృతియే మా ప్రాచీన రాజ్యాంగమని ప్రకటిస్తున్నారు. ఈ ద్వంద్వ వైఖరిని ప్రజలు గమనించాలి.

దళితుల కోసం కృషిచేస్తున్నామని నీతివాక్యాలు వల్లించే కేంద్రం వారికి కేటాయించిన బడ్జెట్‌ వివరాలు ఓసారి పరిశీలించాలి. 2014-15 నుంచి 2019-20 మధ్యకాలంలో దళితులకు 7.51 వేల కోట్ల రూపాయలు రావాల్సి ఉండగా కేవలం 20.8శాతం మాత్రమే కేటాయించింది. ప్రత్యేకించి నిటి అయోగ్‌ పేరిట 2017 సంవత్సరంలో ఎస్సీ,ఎస్టీ సబ్‌ ప్లాన్‌ చట్టాన్ని రద్దు చేసింది. 2019- 20 నుండి 2023-24 నాటికి సంక్షేమ పథకాలను కేవలం 10.6శాతం మాత్రమే దళితుల కేటాయించింది. ఇందులో కేవలం 3.3శాతం మాత్రమే ఖర్చు చేసింది. దళితుల అక్షరాస్యతలో సైతం నేటికి వెనుకబడి ఉన్నారు. దేశంలో సెంటు భూమిలేని దళితులు 73శాతం ఉండగా తెలం గాణలో 66శాతం ఉన్నారు. నూటికి అరవై శాతం మందికి భూమియే లేదు.గతంలో దళితులకు కేటాయించిన అసైన్డ్‌ భూములను లాక్కోవడం తప్ప ఆ భూములకు పట్టాలివ్వలేదు.

బీజేపీ పాలనలో భారత రాజ్యాంగం పెను ప్రమాదంలో కూరుకుపోయింది. హిందుత్వ ఎజెండాను అమలు చేసే క్రమంలో దళితులు, మైనార్టీలు, ఆదివాసులపై దౌర్జన్యాలు రెట్టింపు స్థాయిలో పెరిగాయి. దానికి మూలకారణం హిందూ కార్పొరేట్‌ దిగ్గజాల వెంట మోడీ సర్కార్‌ ఉండడమే. దేశంలో 81 కోట్ల మంది దారిద్ర రేఖకు దిగువన, పేదరికంలో మగ్గుతుంటే కార్పొరేట్‌కుల లాభాలు తెచ్చిపెట్టే విధానాలనే అవలంభిస్తోంది. ప్రపంచ ఆకలిసూచిలో దేశం 102 స్థానానికి చేరుకుంది. దారిద్రరేఖకు దిగువనున్న స్థానం111 చేరింది. వీటన్నింటిని పరిశీలిస్తే బీజేపీ ఎవరి పక్షాన నిలబడుతుందో అర్థం చేసుకోవచ్చు. అందుకే, బీజేపీ సర్కార్‌ రాజ్యాగంపై చేసున్న దాడిని తిప్పికొట్టాలి. ఉన్మాద విద్వేష చర్యలకు వ్యతిరేకంగా నిలబడాలి. ఇదే అంబేద్కర్‌కు మనమిచ్చే నిజమైన నివాళి.
(నేడు డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ 135వ జయంతి)

టి.స్కైలాబ్‌ బాబు
9177549646

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -