గెలుపెవ‌రిదో..?

Who won?– పాగా వేయాలని కాంగ్రెస్‌..
– పోగొట్టుకున్న చోటే రాబట్టుకోవాలని బీఆర్‌ఎస్‌
– సిట్టింగ్‌ స్థానం నిలుపుకొనేందుకు బీజేపీ యత్నం
– విజయమే లక్ష్యంగా దూసుకెళ్తున్న ప్రధాన పార్టీలు
– రసవత్తరంగా ఆదిలాబాద్‌ లోక్‌సభ సమరం
ఆదిలాబాద్‌ లోక్‌సభ సమరం రసవత్తరంగా మారుతోంది. ఇప్పటికే ఎన్నికల్లో ప్రధాన ఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ పూర్తికావడం.. ప్రధాన పార్టీల అభ్యర్థుల నామపత్రాలకు ఆమోదం లభించడంతో ప్రచార పర్వంపై మరింత దూకుడు పెంచుతున్నాయి. పల్లె, పట్టణాల్లో ప్రచారం హోరెత్తుతోంది. 16ఏండ్లుగా విజయం దక్కని ఈ స్థానంలో పాగా వేయాలని కాంగ్రెస్‌ భావిస్తుండగా.. గెలిచి పట్టు నిలుపుకోవాలని బీఆర్‌ఎస్‌ యత్నిస్తోంది. ఇక సిట్టింగ్‌ స్థానాన్ని నిలబెట్టుకోవాలని బీజేపీ ఆరాటపడుతుతోంది.
నవతెలంగాణ- ఆదిలాబాద్‌ ప్రాంతీయ ప్రతినిధి
ఆదిలాబాద్‌ లోక్‌సభ స్థానాన్ని దక్కించుకునేందుకు ప్రధాన పార్టీలు హోరాహోరీ తలపడుతున్నాయి. నెల రోజుల ముందు నుంచే ప్రచారం ప్రారంభమైనా.. నామినేషన్ల క్రతువు పూర్తికావడంతో మరింత ముమ్మరమవుతోంది. ఇప్పటికే కాంగ్రెస్‌ తరపున ఆదిలాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సభ నిర్వహించగా.. అంతకుముందు బీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ నియోజకవర్గ కార్యకర్తల సమావేశానికి ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ హాజరై శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. తాజాగా బీజేపీ తరపున మే 1న కాగజ్‌నగర్‌కు కేంద్ర హోమంత్రి అమిత్‌షా రానున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అగ్రనేతల పర్యటనలతో వేడెక్కిన ఎన్నికల సమరం.. పోలింగ్‌ సమయం దగ్గర పడుతుండటంతో మరింత పదునెక్కుతోంది. ఒకరిపై ఒకరు విమర్శల జడివాన కురిపించుకోగా.. అభ్యర్థుల గుణగణాలపైనా ఆరోపణాస్త్రాలు సంధించుకోవడం ఆసక్తికరంగా మారుతోంది.
విజయమే లక్ష్యంగా పావులు..!
ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు సమాయత్తమవుతున్నాయి. గత చరిత్రను పక్కన పెడితే.. తెలంగాణ ఉద్యమకాలంలో 2008లో లోక్‌సభ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి మాజీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి విజయం సాధించారు. ఆ తర్వాత ఆదిలాబాద్‌ లోక్‌సభ స్థానంలో గెలవని కాంగ్రెస్‌ ఈ సారి ఎలాగైనా విజయం దక్కించుకోవాలని గట్టి పట్టుదలతో ఉంది. ఉపాధ్యాయురాలు, ఆదివాసీ హక్కుల ఉద్యమకారిణి ఆత్రం సుగుణను ఆ పార్టీ నుంచి బరిలో దింపింది. తొలిసారి మహిళకు ఆ పార్టీ టికెట్‌ కేటాయించడమే కాకుండా గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతోంది. మంత్రి సీతక్క, ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మబొజ్జు, నియోజకవర్గాల ఇన్‌చార్జీలు గెలుపు కోసం తీవ్రంగా కష్టపడుతున్నారు. ఆయా నియోజక వర్గాలకు చెందిన ఇతర పార్టీల కీలక నాయకులను పార్టీలో చేర్చుకోవడం ద్వారా బలోపేతమే లక్ష్యంగా ముందుకు సాగుతూ ప్రజల్లో సానుకూల స్పందన వచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఉండటంతో లోక్‌సభ స్థానాన్ని సైతం చేజిక్కించుకునేందుకు ఉమ్మడి జిల్లాలో మరింత పట్టు సాధించాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
2014లో ఈ స్థానంలో గెలిచిన బీఆర్‌ఎస్‌ ఆ తర్వాత 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి చవిచూసింది. ఆ సమయంలో రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ఆదిలాబాద్‌ లోక్‌సభ స్థానం కోల్పోవడం ఆ పార్టీకి నిరాశను మిగిల్చింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ పార్టీ ఘోర ఓటమి పొందినా.. లోక్‌సభ పరిధిలో ఓట్లు మాత్రం ఇతర పార్టీల కంటే అధికంగానే సాధించింది. ఈ లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ నుంచి ఆసిఫాబాద్‌ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కును బరిలో దింపింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఉమ్మడి జిల్లాలో తిరుగులేని శక్తిగా ఉన్న గులాబీ పార్టీ.. ఆ తర్వాత డీలా పడింది. కోల్పోయిన చోటనే తిరిగి రాబట్టుకోవాలనే ఉద్దేశంతో ఈ ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో పట్టునిలుపుకోవాలని భావిస్తోంది.
ఇక 2019 ఎన్నికల్లో గెలిచిన బీజేపీ మరోసారి విజయం సాధించాలని విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. సిట్టింగ్‌ ఎంపీగా ఉన్న సోయం బాపురావును కాదని బీఆర్‌ఎస్‌ నుంచి బీజేపీలో చేరిన మాజీ ఎంపీ గోడం నగేష్‌కు టికెట్‌ కేటాయించింది. ఈ లోక్‌సభ పరిధిలో ఈ పార్టీకి తొలిసారి నలుగురు ఎమ్మెల్యేలు ఉండటం విజయానికి కలిసి వస్తుందని నేతలు విశ్వసిస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలు పల్లె, పట్టణాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అభ్యర్థి తరపున ప్రచారానికి అగ్రనేతలు కూడా జిల్లాకు రానున్నట్లు తెలుస్తోంది. గెలుపే లక్ష్యంగా ఆ పార్టీ అధిష్టానం ప్రత్యేక దృష్టిసారిస్తున్నట్టు సమాచారం. ప్రధాన పార్టీలతో పాటు బీఎస్‌పీ, డీఎస్‌పీ కూడా గణనీయ సంఖ్యలో ఓట్లను సాధించాలని భావిస్తున్నాయి.

Spread the love