ఎవరి భాష వారికుంటది..

– అదే మాట్లాడాలంటే వ్యతిరేకిస్తాం:ఎమ్మెల్సీ కవిత
– ఆచార్య ఎన్‌.గోపికి ప్రొ. జయశంకర్‌ సాహితీ పురస్కారం
నవతెలంగాణ-అంబర్‌పేట
”ఎవరి భాష వారికుంటది.. ఇదే మాట్లాడాలి అని అంటే తీవ్రంగా వ్యతిరేకిస్తాం.. హిందీ భాష ఇష్టమైనది.. హిందీ పాటల్లో పదాలు బాగుంటాయి.. అయితే, సాహితీ ప్రేమికులుగా ఆ భాషలోని సాహిత్యాన్ని ఆరాధిస్తాం.. కానీ ఇదే మాట్లాడాలని రూల్స్‌ పెడితే మాత్రం బ్రేక్‌ వేస్తామని” ఎమ్మెల్యే కవిత అన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, సాహిత్యాలను కాపాడుకోవడం కోసం తెలంగాణ జాగృతి ఉద్యమం చేసిందని, తెలంగాణలోని సాహితీ పుత్రులను నిరంతరం స్మరించుకోవాలని చెప్పారు. హైదరాబాద్‌ అబిడ్స్‌లోని తెలంగాణ సారస్వత పరిషత్‌లో బుధవారం భారత జాగృతి ఆధ్వర్యంలో తెలంగాణ సాహిత్య సభలు నిర్వహించారు. జయశంకర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఆచార్య ఎన్‌.గోపికి ప్రొఫెసర్‌ కొత్తపల్లి జయశంకర్‌ విశిష్ట సాహితీ పురస్కారం-2023ను అందజేసి సత్కరించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్రం సాధించుకోవడం ఎంత ముఖ్యమో.. మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవడం అంతే ముఖ్యమని జాగృతి ఉద్యమం చేసిందని గుర్తు చేశారు. ప్రతి సంవత్సరం సాహిత్య సభలు జరపాలని ఈ కార్యక్రమం రూపొందించామన్నారు. రెండ్రోజులపాటు ఈ సాహిత్య సభలు జరుగుతాయని తెలిపారు. అన్ని అంశాల మీద కూలంకషంగా చర్చలు ఉంటాయన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలుగు మహాసభలు ఘనంగా నిర్వహించుకున్నామని.. అందరినీ భాగస్వామ్యం చేస్తూ ఈ సాహిత్య సభలను విజయవంతం చేసుకుందామని అన్నారు. తెలంగాణ జాగృతి దేశంలో ఉన్న ప్రజలను జాగృతం చేసేందుకు భారత జాగృతిగా రూపుదిద్దుకుందని చెప్పారు. రాష్ట్రంలో 530 మందికి పైగా కళాకారులకు వేతనం ఇస్తూ గౌరవిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ నందిని సిధారెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్‌ గోరటి వెంకన్న, డాక్టర్‌ తిరునగరి దేవకిదేవి, డాక్టర్‌ గోగు శ్యామల, నమస్తే తెలంగాణ దినపత్రిక ఎడిటర్‌ తిగుళ్ల కృష్ణమూర్తి, డాక్టర్‌ ఏనుగు నరసింహారెడ్డి, పలువురు ప్రముఖ కవులు పాల్గొన్నారు.

Spread the love