ఆ తేడా ఎందుకు వచ్చిందో…?

ఆ తేడా ఎందుకు వచ్చిందో...?– పోలైన, లెక్కించిన ఓట్ల మధ్య వ్యత్యాసాలు
– 362 స్థానాల్లో లెక్కకు రాని ఐదున్నర లక్షల ఓట్లు
– 176 స్థానాల్లో మిగులు ఓట్లు నమోదు
న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికలు ముగిసి కేంద్రంలో నరేంద్ర మోడీ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. అయితే అనేక లోక్‌సభ స్థానాల్లో ఈవీఎంల్లో పోలైన ఓట్లకు, లెక్కించిన ఓట్లకు మధ్య వ్యత్యాసాలు కన్పిస్తున్నాయి. 362 స్థానాల్లో అక్షరాలా 5,54,598 ఓట్ల తేడా కన్పించింది. అంతేకాదు…176 నియోజకవర్గాల్లో ఈవీఎంల్లో అదనంగా 35,093 ఓట్లు నమోదయ్యాయని ఎన్నికల కమిషన్‌ గుర్తించింది. ఓటింగ్‌కు సంబంధించి ఎన్నికల కమిషన్‌ విడుదల చేసిన రెండు రకాల సమాచారాలను ‘ది క్వింట్‌’ పోర్టల్‌ విశ్లేషించింది. మొదటిది… పోలైన ఓట్లు. రెండోది… ఫలితాల రోజు లెక్కించిన ఓట్లు. లోక్‌సభలో మొత్తం 542 స్థానాలు ఉండగా ఏకంగా 538 చోట్ల సమాచారాల మధ్య వ్యత్యాసం కన్పించింది. ఈవీఎంల్లో పడిన ఓట్లు, ఫలితాల రోజు లెక్కించిన ఓట్ల మధ్య స్పష్టమైన తేడా ఉందని ‘ది క్వింట్‌’ పోర్టల్‌ గుర్తించింది.కనీసం 267 నియోజకవర్గాల్లో ఈ వ్యత్యాసం 500 ఓట్ల కంటే ఎక్కువగానే కన్పించింది. ఉదాహరణకు తమిళనాడులోని తిరువల్లూర్‌ స్థానంలో ఈవీఎంల్లో 14,30,738 ఓట్లు పోలయ్యాయి.
కానీ ఫలితాల రోజు 14,13,947 ఓట్లను మాత్రమే లెక్కించారు. అంటే 16,791 ఓట్ల తేడా వచ్చింది. ఇలా ఎందుకు జరిగిందనే విషయంపై ఎన్నికల కమిషన్‌ ఎలాంటి వివరణ ఇవ్వలేదు. అయితే మాక్‌ పోలింగ్‌ డాటాను కంట్రోల్‌ యూనిట్‌ నుండి తొలగించకుండా ప్రిసైడింగ్‌ అధికారులు అసలైన పోలింగ్‌ను ప్రారంభిస్తే ఓట్లలో వ్యత్యాసం వస్తుందని ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల అధికారి తెలిపారు. ప్రిసైడింగ్‌ అధికారి పోలైన ఓట్లను ఫారం 17-సీలో తప్పుగా నమోదు చేసినా ఇలా జరుగుతుందని ఆయన వివరణ ఇచ్చారు.
లెక్కించిన ఓట్లే అధికం
కారణం ఏదైనప్పటికీ పలు నియోజకవర్గాల్లో ఈవీఎంల్లో పోలైన ఓట్లకు, లెక్కించిన ఓట్లకు మధ్య తేడాలు కన్పించాయి. అసోంలోని కరింగంజ్‌లో 3,811 ఓట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలులో 1,467 ఓట్లు, ఒడిషాలోని బాలాసోర్‌లో 1,173 ఓట్లు, మధ్యప్రదేశ్‌లోని మాండ్లాలో 1,089 ఓట్లు, బీహార్‌లోని బక్సర్‌ స్థానంలో 1,010 ఓట్ల వ్యత్యాసం ఉంది. ఈ స్థానాలన్నింటిలోనూ ఈవీఎంల్లో పోలైన ఓట్ల కంటే లెక్కించిన ఓట్లే అధికారంగా ఉన్నాయి.
అక్కడ ఈవీఎం ఓట్లే అధికం
ఈవీఎంల్లో పోలైన ఓట్ల కంటే లెక్కించిన ఓట్లు తక్కువగా ఉన్న నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. తమిళనాడులోని తిరువల్లూరులో 16,791, అసోంలోని కోక్రాఝార్‌లో 10,760, ఒడిషాలోని ధెన్కానాల్‌లో 9,427, కేరళలోని అలప్పుజాలో 7,928, ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో 7,928 ఓట్లు ఈ విధంగా తక్కువగా లెక్కింపుకు వచ్చాయి.
సుప్రీంకోర్టు ఏం చెప్పింది?
2019 ఎన్నికల్లో కూడా ఈవీఎం ఓట్లకు, లెక్కించిన ఓట్లకు మధ్య వ్యత్యాసాలు బయటపడ్డాయి. దీనిపై ఏడీఆర్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. వాస్తవమైన, కచ్చితమైన ఓటింగ్‌ సమాచారాన్ని సరిపోల్చుకున్న తర్వాతే తుది ఫలితాన్ని ప్రకటించేలా ఎన్నికల కమిషన్‌ను ఆదేశించాలని ఆ పిటిషన్‌లో కోరింది. ఈవీఎంలో పడిన ఓట్లను వీవీపాట్‌ స్లిప్పులతో సరిపోల్చుకోవాలంటూ దాఖలైన పలు పిటిషన్లను సుప్రీంకోర్టు ఏప్రిల్‌ 26న తోసిపుచ్చింది. తాము నాలుగు కోట్ల స్లిప్పులను వెరిఫై చేశామని, ఎక్కడా తేడా రాలేదని ఎన్నికల కమిషన్‌ సుప్రీంకోర్టుకు నివేదించిన తర్వాత ఈ తీర్పు వెలువడింది.
ఈసీ వివరణ కోరుతున్న ప్రజలు
ఈవీఎంలో పోలైన ఓట్లకు, లెక్కించిన ఓట్లకు మధ్య వ్యత్యాసం ఉంటే ప్రజల మనసుల్లో అనుమానాలు ఏర్పడతాయని ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత కోసం కృషి చేస్తున్న అంజలి భరద్వాజ్‌ తెలిపారు. ఎన్నికల ఫలితాలకు సంబంధించిన పార్ట్‌-2 సహా ఫారం 17-సీని పూర్తిగా పబ్లిక్‌ డొమైన్‌లో ఉంచితే అనుమానాలకు ఆస్కారం ఉండదని చెప్పారు.
పోలైన ఓట్లకు సంబంధించిన సమాచారం ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మిషన్‌లో కన్పిస్తుందని, కాబట్టి సాంకేతికంగా చూస్తే వ్యత్యాసం రాకూడదని, అయినప్పటికీ వస్తే నియోజకవర్గాల వారీగా కమిషన్‌ వివరణ ఇవ్వాలని ఆమె సూచించారు.

Spread the love