– కేంద్ర గ్రాంట్లలో తెలంగాణకు అన్యాయం
– రావాల్సింది రూ.22,782 కోట్లు
– 11 నెలల్లో వచ్చింది రూ.6,140 కోట్లు
– నిధుల విడుదలలో మోడీ సర్కారు వివక్ష
– ఇద్దరు కేంద్రమంత్రులున్నా ప్రయోజనం అంతంతే
– కాగ్ నివేదికలో గణాంకాలు విడుదల
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
గత ఆర్థిక సంవత్సరం (2025-26) ఫిబ్రవరికి సంబంధించిన కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) నివేదికను విడుదల చేసింది. గత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం నుంచి వివిధ గ్రాంట్ల కింద తెలంగాణకు రావాల్సిన నిధులు రూ.22,782.50 కోట్లు ఉన్నాయి. ఫిబ్రవరి నాటికి 11 నెలల్లో కేవలం రూ.6,140.65 (26.95 శాతం) కోట్లు మాత్రమే విడుదల చేసింది. కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్లు ఇంకా రూ.16,641.85 (73.05 శాతం) కోట్లు ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరం ముగియడానికి ఇంకా ఒక్క నెల మాత్రమే గడువు ఉన్నది. ఒక్కనెలలోనే రూ.16,641 కోట్ల గ్రాంట్లను కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుందా?అన్నది ప్రశ్నార్ధకంగా మారింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో 2026-27 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో మాత్రం 2025-26 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో వచ్చే నిధులు సవరించిన అంచనాల ప్రకారం రూ.11,161.45 కోట్లు వస్తాయని ప్రకటించింది. ఈ లెక్కన చూసినా మార్చి నాటికి ఒక్క నెలలోనే రూ.5,020.8 కోట్లు విడుదల కావాల్సి ఉన్నది. ఒక్క నెలలో కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని నిధులు విడుదలయ్యే అవకాశం లేదని ఆర్థికవేత్తలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ప్రతిపక్ష రాష్ట్రాలపై మోడీ సర్కారు వివక్ష
నిధుల విడుదలలో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తెలంగాణ పట్ల వివక్షతను ప్రదర్శిస్తున్నది. తెలంగాణకు గ్రాంట్ల విడుదల నిధులే ఇందుకు నిదర్శనం. బీజేపీ పాలిత రాష్ట్రాలు, ఎన్డీయే భాగస్వామ్య పాలిత రాష్ట్రాలకే కేంద్ర ప్రభుత్వం నిధుల విడుదలలో ప్రాధాన్యత ఇస్తున్నది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర గ్రాంట్ల కింద గుజరాత్‌కు రూ.20,010.78 కోట్లు రావాల్సి ఉంటే ఫిబ్రవరి నాటికి రూ.13,556.95 (67.75 శాతం) నిధులొచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌కు రూ.32,284.40 కోట్లకుగాను రూ.14,737.69 (45.65 శాతం) నిధులు విడుదలయ్యాయి. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలకు మాత్రం మొండిచేయి చూపుతున్నది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల పట్ల శీతకన్ను ప్రదర్శిస్తున్నది. కేరళంకు కేంద్ర గ్రాంట్లలో రూ.13,074.90 కోట్లు రావాల్సి ఉంటే ఫిబ్రవరి నాటికి రూ.3,873.73 (29.63 శాతం) కోట్లు విడుదలయ్యాయి. ఈ గణాంకాలను బట్టి బీజేపీ ఏ రాష్ట్రాలకు అనుకూలంగా ఉందో, ఏ రాష్ట్రాల పట్ల వివక్షను ప్రదర్శిస్తున్నదో అర్థమవుతున్నది. కేంద్ర ప్రభుత్వం నిధుల విడుదలలో ఒక్కో రాష్ట్రాన్ని ఒక్కో విధంగా పరిగణించడం సమాఖ్య స్ఫూర్తికి విఘాతమని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అన్ని రాష్ట్రాలకూ సమానంగా నిధులను విడుదల చేయాలని కోరుతున్నారు.
నిధులు తేని కేంద్ర మంత్రులు
కేంద్ర ప్రభుత్వంతో సయోధ్యతోపాటు ఎక్కువ నిధులను తేవడం కోసమే తాను ప్రధాని మోడీతోపాటు కేంద్ర మంత్రులను కలుస్తున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పలు సందర్భాల్లో ప్రకటించారు. కానీ కేంద్రం నుంచి గ్రాంట్లు మాత్రం ఆశించిన స్థాయిలో రావడం లేదు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.9,933.68 కోట్లు వచ్చాయి. 2024-25లో 7,913.08 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. 2025-26లో ఫిబ్రవరి నాటికి రూ.6,140.65 కోట్లు వచ్చాయి. తెలంగాణలో బీజేపీకి ఎనిమిది మంది ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజరు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి ఎక్కువ నిధులను తేవడంలో, గ్రాంట్లను విడుదల చేయించడంలో వారు విఫలమయ్యారన్న విమర్శలు వస్తున్నాయి.
ఒక్క నెలలో రూ.16,641 కోట్లు వచ్చేనా?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



