ఆనవాయితీ కొనసాగుతుందా..?

– పినపాకలో రెండోసారి గద్దెనెక్కిన నాయకుడే ఇప్పటివరకు లేడు
– నియోజకవర్గం ఏర్పడిన నుండి ఐదేళ్లే అవకాశం
– రేగా చరిత్రను తిరగరాస్తాడా ?
– పాయం పాగా వేస్తాడా?
నవతెలంగాణ-అశ్వాపురం
నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా బూర్గంపాడు నుండి పినపాకకు తరలిన నియోజకవర్గం 20 ఏళ్ల కాలంలో పినపాక ప్రజలు ఏ నాయకుడికైనా ఎమ్మెల్యేగా ఐదేళ్ల పాటే అవకాశం కల్పించారు. బూర్గంపాడు నియోజకవర్గంగా ఉన్న కాలంలో మాత్రమే నాటి కమ్యూనిస్టు పార్టీ నుంచి సారథ్యం వహించిన కుంజా బిక్షం వెంట వెంటనే రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన చరిత్రను ఇప్పటివరకు ఎవరు తిరగ రాయలేదు. అయితే రానున్న ఎన్నికలలో ఓటర్లు ఆ ఆనవాయితీని కొనసాగిస్తారా… చరిత్రను తిరగరాస్తారా అనే సందిగ్ధంలో ఉన్నాయి ప్రధాన రాజకీయ పార్టీలు. ప్రస్తుత రాజకీయాలు రసవత్తరంగా మారడంతో మరో మారు పినపాక గడ్డపై బీఆర్‌ఎస్‌ పార్టీ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న రేగా కాంతారావు మరోసారి గెలిచి నాటి కుంజా బిక్షం చరిత్రను సమం చేసేందుకు విశిష్టమైన కృషి చేస్తున్నాడు. ఓ పక్కన ప్రతిపక్ష పార్టీలు మాత్రం బీఆర్‌ఎస్‌ పార్టీని ఎలాగైనా సరే అడ్డుకోవాలననే ఉద్దేశంతో ఆలోచనలకు పదును పెడుతున్నారు. నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్‌ పార్టీ నుండి టిక్కెట్టు ఎవరికీ ప్రకటించకపోవడంతో స్తబ్దతగా ఉన్న రాజకీయాలు పాయానికి టిక్కెట్‌ కేటాయించడంతో పార్టీ శ్రేణుల్లో కాస్త ఉత్సాహం పెరిగినట్లు కనిపిస్తోంది. దీంతో పినపాక నియోజకవర్గం లోని రాజకీయాలు రసవత్తరంగా మారా యి. నువ్వా నేనా అన్నట్లుగా ప్రచా రంలో దూసు కుపోతున్నారు అ భ్యర్థులు. అభివృద్ధి మంత్రంతో అధికార పార్టీ ముందుకు సాగుతుండగా హస్తవాసిపై నమ్మకంతో ప్రజలలో చైతన్యం నింపేందుకు ముందుకు సాగుతున్నారు కాంగ్రెస్‌ పార్టీ నాయకులు.
ఓటరు చైతన్యుడే… ఆనవాయితీని మారుస్తారా ?
పినపాక నియోజకవర్గంలోని ఓటర్లు పూర్తిగా చైతన్యవంతులే. ప్రధానంగా ఈ నియోజకవర్గంలో పరిశ్రమలు అధికంగా ఉండడంతో ఉద్యోగ, విద్యావంతులే అధిక ఓటర్లు కావడంతో చైతన్యవంతంతో వారి ఓటు హక్కును వినియోగించుకుంటారు. పినపాక నియోజకవర్గం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు ఏ ఒక్క పార్టీకి గాని, ఏ ఒక్క నాయకుడికి ఎమ్మెల్యేగా రెండోసారి గెలిపించేందుకు ప్రయత్నాలు చేయలేదు ఇక్కడి ఓటర్లు. అయితే ప్రస్తుత తరుణంలో బిఆర్‌ఎస్‌ పార్టీ చేపట్టిన అభివృద్ధి మంత్రంతో ప్రజల్లోకి దూసుకెళ్లేందుకు రేగా ప్రయత్నిస్తుండగా, ఎలాగైనా సరే ఈసారి ప్రజా అండదండలతో గెలిచి పినపాకపై పట్టు సాధించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు బీఆర్‌ఎస్‌ నాయకులు. అయితే పినపాక ఓటరు చైతన్యవంతంతో ఆనవాయితీని కొనసాగిస్తారా…?లేక మరో మారు రేగాను గెలిపించి చరిత్రను తిరగరాస్తారో వేచి చూడాలి.

Spread the love