Monday, June 8, 2026
E-PAPER
Homeజాతీయంటీవీకే ప్రభుత్వం కనీసం మూడు నెలలైనా నిలబడుతుందా?

టీవీకే ప్రభుత్వం కనీసం మూడు నెలలైనా నిలబడుతుందా?

- Advertisement -

6 నెలల పాటు సర్కార్ పై విమర్శలకు దూరంగా ఉండాలని అనుకున్నాం
రాష్ట్రంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి
ప్రభుత్వం అస్పష్టమైన స్థితిలో నడుస్తోంది: డీఎంకే నాయకుడు ఎం.కె. స్టాలిన్


చెన్నై: తమిళనాడులోని టీవీకే ప్రభుత్వంపై డీఎంకే నేత స్టాలిన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. నూతనంగా కొలువుదీరిన టీవీకే ప్రభుత్వం కనీసం మూడు నెలలైనా నిలబడుతుందా? అని ప్రశ్నించారు. ప్రస్తుత టీవీకే ప్రభుత్వం తీరుతెన్నుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదని అన్నారు. అయితే, టీవీకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు 6 నెలల పాటు విమర్శలకు దూరంగా ఉండాలని అనుకున్నామని, కానీ, రాష్ట్రంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. టీవీకే ప్రభుత్వం అస్పష్టమైన స్థితిలో నడుస్తోందని పేర్కొన్నారు. చెన్నైలో వీసీకే మాజీ ఎమ్మెల్యే పనైయూర్ బాబు, ఆయన మద్దతుదారులు స్టాలిన్ సమక్షంలో డీఎంకేలో చేరారు. ఈ సందర్భంగా స్టాలిన్‌ ఈ మేరకు మాట్లాడారు. ఇప్పటికే చాలామంది కొత్త ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని స్టాలిన్ పేర్కొన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచే డీఎంకే, 2026 అసెంబ్లీ ఎన్నికల కోసం క్షేత్రస్థాయిలో చర్యలు మొదలు పెట్టిందని వెల్లడించారు. బూత్ స్థాయి ఏజెంట్లను నియమించడం, ప్రాంతీయ సమావేశాలు నిర్వహించడం వంటి జాగ్రత్తలు తీసుకున్నా అధికారంలోకి రాలేకపోయామని నిర్వేదం వ్యక్తం చేశారు. కానీ కొందరు మాత్రం ఓటర్లను కలవకపోయినా, బూత్ ఏజెంట్లను నియమించకపోయినా ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని పరోక్షంగా విజయ్‌ను ఉద్దేశిస్తూ స్టాలిన్‌ అన్నారు. అటువంటి ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉంటుందని తాను భావించట్లేదని తెలిపారు.

ఇక, డీఎంకేలో కొత్తగా చేరిన వారికి స్టాలిన్ పలు సూచనలు చేశారు. పార్టీ నిర్వహించే అన్ని సంస్థాగత కార్యక్రమాల్లోనూ సహకరించాలని పిలుపునిచ్చారు. అలాగే, గతంలో అనుబంధం కలిగి ఉన్న పార్టీలను విమర్శించవద్దని సూచించారు. ఈ సందర్భంగా, పార్టీ వ్యవస్థాపకుడు సీ.ఎన్. అన్నాదురై మాటలను ఉటంకిస్తూ, “ప్రత్యర్థి తోటలోని మల్లెపూవునకు కూడా సువాసన ఉంటుందని అన్నా (అన్నాదురై) గొప్పగా చెప్పారు. కాబట్టి, ఎవరినీ తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదు” అని స్టాలిన్ దిశానిర్దేశం చేశారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో వీసీకే తరపున చెయ్యూర్ నియోజకవర్గం నుంచి పనైయూర్ బాబు విజయం సాధించారు. అయితే, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల విషయంలో పార్టీ నాయకుడు తిరుమావళవన్ పరస్పర విరుద్ధమైన నిర్ణయాలు తీసుకుంటున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. తరచుగా తన వైఖరిని మారుస్తున్నారని ఆరోపిస్తూ ఆయన వీసీకేను వీడారు.

టీవీకే ఎక్కువ కాలం అధికారంలో ఉండదు : అన్నాడీఎంకే
మరోవైపు, తమిళనాడులో టీవీకే ఎక్కువ కాలం అధికారంలో ఉండదని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి వ్యాఖ్యానించారు. కుర్చీకి ఉన్న నాలుగు కాళ్లలో రెండు విరిగిపోతే అది ఎలాగైతే కుప్పకూలిపోతుందో, టీవీకే ప్రభుత్వం కూడా అలాగే కూలిపోతుందని విమర్శించారు. “ఇటీవల తమిళనాడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే సంపూర్ణ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. అంతేకాదు, రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాల్లో ఒక్క నియోజకవర్గంలో కూడా ఆ పార్టీ గెలవలేకపోయింది. టీవీకే కుర్చీకి రెండు కాళ్లు మాత్రమే ఉన్నాయి. మిగిలిన రెండు కాళ్లు డీఎంకే కూటమిలో గెలిచిన పార్టీలకు చెందినవి. కాబట్టి ఆ పార్టీలు ఎప్పుడైనా విడిపోవచ్చు” అని పళనిస్వామి వ్యాఖ్యానించారు.

‘ఆవేశపూరిత ప్రకటనలు మానుకోవాలి’
అలాగే, టీవీకే నాయకుడు ఆవేశపూరిత ప్రకటనలు చేయడం మానుకోవాలని పళనిస్వామి అన్నారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో 436 పథకాలను అమలు చేస్తామని ప్రకటించారని, అయితే, ఆ పథకాలు ఏ శాఖలకు చెందినవి అనే విషయంపై ఎటువంటి వివరాలు వెల్లడించలేదని తెలిపారు. కేవలం పథకాలను ప్రకటించడం ద్వారా టీవీకే ప్రజలను మోసం చేస్తోందని ఆయన విమర్శించారు. ఇదిలా ఉండగా, ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పళనిస్వామి రాష్ట్రంలోనే అత్యధిక ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. తనను భారీ మెజారిటీతో గెలిపించిన ఎడప్పాడి నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనే స్వయంగా వెళ్లి వారిని కలిశారు. అవిశ్రాంతంగా కృషి చేసిన అన్ని కూటమి పార్టీల నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, ఎన్నికల్లో గెలిచిన పార్టీ శాశ్వతంగా అధికారంలో ఉండదని వ్యాఖ్యానించారు. ఓటమిని చవిచూసిన పార్టీ కూడా భవిష్యత్తులో అధికారాన్ని చేజిక్కించుకోవచ్చునని, ప్రజల మద్దతుతో అన్నాడీఎంకే కచ్చితంగా తిరిగి అధికారాన్ని సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -