విధానాలు మార్చుకుంటారా… దిగిపోతారా?

Will policies change... go down?– మోడీకి వివిధ పార్టీలు, కార్మిక, రైతు, ప్రజాసంఘాల నేతల హెచ్చరిక
– పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీని ఓడిస్తేనే దేశానికి రక్షణ
– అంబానీ, అదానీలకు సంపదను దోచిపెడుతున్న కేంద్రం
– కార్పొరేట్‌, మతతత్వ విధానాలను ప్రతిఘటించాలి
– హక్కుల సాధనకు ఐక్య ఉద్యమాలే మార్గం
– కార్మికులు, కర్షకులు వేలాదిగా హాజరు
– సమ్మె-గ్రామీణ బంద్‌ విజయవంతం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
కార్పొరేట్‌ అనుకూల, ప్రజా వ్యతిరేక విధానాలను మార్చుకుంటారా… అధికారం నుంచి దిగిపోతారా?అని ప్రధాని మోడీని వివిధ రాజకీయ పార్టీలు, కార్మిక, రైతు, ప్రజాసంఘాల నేతలు హెచ్చరించారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీని ఓడిస్తేనే దేశానికి రక్షణ ఉంటుందన్నారు. మోడీ ప్రభుత్వం మళ్లీ గెలిస్తే ప్రజలు, కార్మికులు, రైతులు, కూలీల హక్కులు మరింత కాలరాయబడతాయని ఆందోళన వ్యక్తం చేశారు. కార్పొరేట్‌, మతతత్వ విధానాలను ప్రజలంతా ఐక్యంగా ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. హక్కులను సాధించుకోవడానికి ఐక్య ఉద్యమాలే మార్గమని అన్నారు. ‘కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ కార్పొరేట్‌ అనుకూల, మతతత్వ విధానాలను ప్రతిఘటిద్దాం, దేశ సార్వభౌమత్వాన్ని-రాజ్యాంగాన్ని కాపాడుకుందాం’అంటూ జాయింట్‌ ప్లాట్‌ఫామ్‌ ఆఫ్‌ ట్రేడ్‌ యూనియన్స్‌, సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం) సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌ ధర్నాచౌక్‌ వద్ద బహిరంగసభను నిర్వహించారు. కార్మికులు, కర్షకులు వేలాదిగా హాజరుకావడంతో ఈ సభకు అనూహ్య స్పందన వచ్చింది. రాష్ట్రంలో కార్మికుల సమ్మె, గ్రామీణ బంద్‌ విజయవంతమైంది. రాష్ట్రంలోని 34 జిల్లాలు, 610 మండల కేంద్రాల్లో ప్రదర్శనలు, బహిరంగసభలను నిర్వహించారు. కార్మికులు, రైతులు, అసంఘటిత కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, స్కీమ్‌ వర్కర్లు, గ్రామ పంచాయతీ, మున్సిపల్‌ కార్మికులు, హమాలీలు, రవాణారంగ, ఆటో కార్మికులు సమ్మెలో పెద్దఎత్తున పాల్గొన్నారు.
పంటలకు మద్దతు ధరల గ్యారంటీ చట్టం తేవాల్సిందే : కార్మిక సంఘాలు, ఎస్‌కేఎం నేతలు
రైతులు పండించిన పంటలకు మద్దతు ధరల గ్యారెంటీ చట్టాన్ని తేవాల్సిందేనని కేంద్ర ప్రభుత్వాన్ని కార్మిక సంఘాలు, ఎస్‌కేఎం నేతలు నాగన్నగౌడ్‌, ఎస్‌ బాలరాజు, పాలడుగు భాస్కర్‌, సుదర్శన్‌, కె సూర్యం, సాదినేని వెంకటేశ్వరరావు, ఎం శ్రీనివాస్‌, ఆర్‌ జనార్ధన్‌, జి రాంబాబు యాదవ్‌, ఎంకె బోస్‌, భరత్‌, పశ్య పద్మ, టి సాగర్‌, ప్రభాకర్‌, మండ వెంకన్న, భిక్షపతి, రమేష్‌, టి రామకృష్ణ, ప్రమీల, జక్కుల వెంకటయ్య, ప్రసాద్‌, విస్సా కిరణ్‌, ఎన్‌ బాలమల్లేష్‌, ఆర్‌ వెంకట్రాములు, గోనె రామస్వామి, భాస్కర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. విద్యుత్‌ సవరణ బిల్లును ఉపసంహరించాలని కోరారు. లేదంటే విద్యుత్‌ చార్జీల భారం ప్రజలపై పడతాయన్నారు. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్‌ సంస్థలకు కట్టబెడుతున్నారని విమర్శించారు. దేశంలో సహకార వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని అన్నారు. ఎంఎస్‌ స్వామినాథన్‌కు భారతరత్న ఇచ్చారనీ, ఆయన సిఫారసులను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రయివేటుపరం చేస్తున్నారని చెప్పారు. నిరుద్యోగం, ఆకలి, పేదరికం తీవ్రంగా పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్‌డి చంద్ర శేఖర్‌, ఎం నర్సింహ, ఎం వెంకటేశ్‌, నర్సయ్య, ఎస్‌ఎల్‌ పద్మ, జి అనురాధ, అరుణక్క, దానకర్ణాచారి, డి మోహన్‌రావు, బాబురావు అధ్యక్షవర్గంగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో జె వెంకటేశ్‌, ఆర్‌ ప్రకాష్‌గౌడ్‌, కన్నెగంటి రవి, బి వెంకటేశం, బొడ్డుపల్లి కిషన్‌, వెంకన్నగౌడ్‌, టి స్కైలాబ్‌బాబు తదితరులు పాల్గొని ప్రసంగించారు.
సమస్యలు పరిష్కరించని మోడీ ప్రధానిగా ఎందుకు? : ఎస్‌ వీరయ్య
సమస్యలు పరిష్కరించాలంటూ ప్రధాని మోడీని అడుగుతున్నామని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌ వీరయ్య అన్నారు. ఆయన మాత్రం అయోధ్యలో రాముడిని అడగమంటున్నారని చెప్పారు. సమస్యలు పరిష్కరించని మోడీ ప్రధానిగా గద్దెమీద ఎందుకుండాలని ప్రశ్నించారు. మోడీ, అంబానీ, అదానీలకు స్వర్గంపై విశ్వాసం లేదనీ, అందుకే బతికున్నప్పుడే విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారని అన్నారు. సామాన్యులు బతికున్నపుడు దుర్భరంగా జీవించి మరణించాక స్వర్గానికి వెళ్లాలంటున్నారని చెప్పారు. వారూ బతికున్నపుడే విలాసవంతంగా బతకాలన్నారు. ప్రజల సంక్షేమం గురించి పట్టించుకోని బీజేపీని పార్లమెంటు ఎన్నికల్లో ఓడించాలనీ, ఒక్కచోట కూడా గెలవకుండా మట్టికరిపించాలని ఆయన పిలుపునిచ్చారు. మోడీ పదేండ్లపాటు మాటల గారడీ తప్ప అభివృద్ధి ఏం చేయలేదని సీపీఐ(ఎంఎల్‌) ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె రమ విమర్శించారు. సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె గోవర్ధన్‌ మాట్లాడుతూ హిందూమతం పేరుతో ప్రజలను రెచ్చగొట్టి మళ్లీ అధికారంలోకి రావాలని బీజేపీ ప్రయత్నిస్తున్నదని చెప్పారు. ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న బీజేపీని వచ్చే ఎన్నికల్లో ఓడించాలని సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జెవి చలపతిరావు పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ నాయకులు గంటా సత్యనారాయణ, ఎస్‌యూసీఐ(సీ) రాష్ట్ర కార్యదర్శి మురహరి, టీడీపీ నాయకులు కాట్రగడ్డ ప్రసూన, రెడ్‌ఫ్లాగ్‌ రాష్ట్ర కార్యదర్శి రాజేష్‌ మాట్లాడుతూ కార్మికులకు కనీస వేతనాలివ్వాలనీ, ధరలను నియంత్రించాలని డిమాండ్‌ చేశారు.
అంబానీ, అదానీలకు మరిన్ని ఆర్థిక ప్రయోజనాలా? : కూనంనేని
అంబానీ, ఆదానీలకు మరిన్ని ఆర్థిక ప్రయోజనాలు కల్పించేందుకు మోడీ ప్రభుత్వం కృషిచేయటం హేయమైన చర్య అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కార్మికులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడిందన్నారు. 44 కార్మిక చట్టాల్లో 29ని సమూలంగా మార్చి నాలుగు కోడ్‌లుగా తెచ్చిందని చెప్పారు. అవి పెట్టుబడిదారులకు, కార్పొరేట్‌ శక్తులకు మేలుచేసే విధంగా రూపొందించారని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్లకు మేలు కోరడం తప్ప రైతుల సంక్షేమం కోసం పనిచేసేది శూన్యమని విమరించారు.

Spread the love