రాహుల్ గాంధీ అరెస్ట్ కునిరసనగా కాంగ్రెస్ ‘చలో లోక్ భవన్’ ఉద్రిక్తం
నెక్లెస్ రోడ్ నుంచి భారీ ర్యాలీ లోక్ భవన్ సమీపంలో అడ్డుకున్న పోలీసులు
పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు దామోదర రాజనర్సింహ,
పొంగులేటి సహా పలువురి అరెస్టు నాంపల్లి పోలీస్ స్టేషన్ కు తరలింపు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
దేశ రాజధాని ఢిల్లీలో తమ అగ్రనేత రాహుల్ గాంధీ అరెస్టును నిరసిస్తూ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ టీపీసీసీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు చేపట్టిన చలో లోక్ భవన్ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ఈ కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేయటంతో కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమన్నాయి. ప్రశ్నించే గొంతులను నొక్కేస్తారా? అంటూ కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. ‘బీజేపీ సర్కారు అరాచక పాలన నశించాలి…’ అంటూ నినదిస్తూ పది తలలున్న మోడీ ఫ్లెక్సీని ఈ సందర్భంగా ప్రదర్శించాయి. ఏఐసీసీ పిలుపులో భాగంగా బుధవారం హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్ నుంచి లోక్ భవన్ వరకు ర్యాలీ నిర్వహించేందుకు కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున బయలుదేరారు. వీరి ప్రదర్శన లోక్ భవన్ సమీపంలోకి రాగానే పోలీసులు బారికేడ్లతో అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, కాంగ్రెస్ శ్రేణులకు మధ్య తీవ్ర వాదోపవాదాలు, తోపులాట చోటు చేసుకున్నాయి. ఖైరతాబాద్ నుంచి లోక్ భవన్ రోడ్డు వైపు వచ్చే ట్రాఫిక్ ను దాదాపు గంటపాటు నిలిపేశారు. కాంగ్రెస్ రాష్ట్ర స్థాయి నాయకులను ముందుగానే అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని అక్కడి నుంచి తరలించారు. అనంతరం మిగిలిన వారిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించగా వారు అక్కడే బైఠాయించారు.
ఈ గందరగోళం మధ్యనే టీపీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షులు రోహన్ రెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి కృష్ణతేజ తోపాటు నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి, నాంపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రశ్నలకు సమాధానం చెప్పలేకే :
టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై ప్రతిపక్షాల ప్రశ్నలకు కేంద్రంలో బీజేపీ సర్కార్ సమాధానం చెప్పలేకనే అరెస్టు చేయిస్తున్నదని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ అవలంబిస్తున్న చర్యలు దాని నియంతృత్వ ధోరణికి, నిరంకుశత్వానికి పరాకాష్ట అని విమర్శించారు. నీట్ పేపర్ లీకేజీల వ్యవహారంపై పార్లమెంట్‌లో సమగ్రంగా చర్చించాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలని కోరుతూ ప్రధాని మోడీ ఇంటి ముందు ప్రతిపక్ష నేతలు ప్రజాస్వామ్యబద్ధంగా ధర్నా చేపట్టారని అన్నారు. దీనికి భయపడిన బీజేపీ ప్రభుత్వం తోక ముడిచి అరెస్టులకు పాల్పడిందని ఎద్దేవా చేశారు.
ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని తుంగలో తొక్కిన ఆ పార్టీ… పోలీసులతో రాజ్యాన్ని నడిపిస్తామంటే భారతదేశంలో సాధ్యం కాదని తేల్చిచెప్పారు. దేశ భవిష్యత్తు కోసం, విద్యార్థుల పక్షాన పోరాడుతున్న రాహుల్ గాంధీని అరెస్ట్ చేసినంత మాత్రాన ఆయన నోరు మూయించలేరని హెచ్చరించారు. అంతిమ విజయం సాధించే వరకు రాహుల్‌తోపాటు ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ప్రియాంక గాంధీ విశ్రమించబోరని హెచ్చరించారు. దాడులతో ఉద్యమాన్ని ఆపలేరు :
మంత్రి దామోదర రాజనర్సింహ దేశంలో వరుసగా జరుగుతున్న పేపర్ లీకేజీలు కేంద్ర ప్రభుత్వ వ్యవహార శైలితోపాటు పరీక్షల నిర్వహణపై అనేక అనుమానాలు కలిగిస్తున్నాయని మంత్రి దామోదర రాజనర్సింహ వ్యాఖ్యానించారు. దాడులతో ప్రశ్నించే వారిని, ఉద్యమాలను ఆపలేరని ఆయన హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో విభేదించే స్వరాలను బలప్రయోగంతో అణచివేయడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని స్పష్టం చేశారు. వారికి మద్దతు తెలిపిన నాయకులను అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని హితవు పలికారు. పరీక్షల నిర్వహణలో సాంకేతిక, పరిపాలనా సంస్కరణలు తీసుకువచ్చి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా శాశ్వత చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.



