రాష్ట్రవ్యాప్త నిరవధిక సమ్మెను జయప్రదం చేయండి

నవతెలంగాణ డిచ్ పల్లి
 గ్రామపంచాయతీ కార్మికుల సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిస్తూ డిచ్ పల్లి మండల కేంద్రంలో ఐఎఫ్టియు ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ సిబ్బందితో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు ఎం.వెంకన్న పాల్గొని మాట్లాడుతూ… గ్రామపంచాయతీ కార్మికులు, సిబ్బంది పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తుందన్నారు.
 పంచాయతీ కార్మికులకు జీఓ నెం. 60 ప్రకారం వేతనాలు పెంచాలన్నారు. ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ కేటాయించి వేతనాలు ఇవ్వాలన్నారు. మల్టీపర్పస్ వర్కర్ విధానం రద్దు చేయాలని, కారోబార్, బిల్ కలెక్టర్లను సహాయ కార్యదర్శులుగానియమించాలన్నారు. ప్రమాదాల్లో మరణించిన కార్మికుల కుటుంబానికి రూ.25 లక్షల నష్టపరిహారం అందించాలని, పెండింగ్ బిల్లులు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గ్రామపంచాయతీ కార్మికులను సిబ్బందిని పర్మినెంట్ చేయాలన్నారు. పై డిమాండ్ల సాధన కోసం  గ్రామ పంచాయతీ ఉద్యోగ, కార్మిక సంఘాల జె.ఎ.సి. ఆధ్వర్యంలో జూలై 6 గురువారం నుండి జరిగే రాష్ట్రవ్యాప్త నిరవధిక సమ్మెను తెలంగాణ గ్రామ పంచాయతీ ఉద్యోగ, కార్మికులందరూ జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సుధాకర్, జిల్లా నాయకులు మురళి, కిషన్, అశోక్ రాజేందర్, రవి, రమేష్ ,భాస్కర్, సుధాకర్, పోసాని తదితరులు పాల్గొన్నారు.
Spread the love