ప్రేమతో గెలవాలి

– విద్వేష రాజకీయం పని చేయదు
– ఇందుకు బీజేపీకి వచ్చిన సీట్లే నిదర్శనం
– పని చేసిన రాహుల్‌ ‘మొహబ్బత్‌ కి దుకాణ్‌’ నినాదం
– రాజకీయ నిపుణులు, మేధావులు
న్యూఢిల్లీ : మోడీ ప్రధానిగా మూడోసారి బీజేపీ కేంద్రంలో తిరిగి అధికారంలోకి వచ్చింది. ఇప్పుటి వరకు మోడీ ప్రభుత్వానికి ప్రతిపక్షాలతో పోరాటం ఉండేది. అయితే, కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుతో ఆయనకు స్వపక్షంలోనూ ప్రతిపక్షం తయారయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే శాఖల కేటాయింపుల సంకీర్ణ ప్రభుత్వంలోని పార్టీల మధ్య అసంతృప్తులు, ఘర్షణలకు దారి తీస్తున్నాయని చెప్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కాషాయ పార్టీ సీట్ల సంఖ్య గణనీయంగా తగ్గింది. 543 మంది సభ్యులతో కూడిన లోక్‌సభలో మిత్రపక్షాలతో కలిసి 400 మార్కును చేరటానికి తీవ్రంగా శ్రమించింది. అయినా, ఆ పార్టీ అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపో యింది. 240 సీట్లకే పరిమితమైంది. ఇది సంపూర్ణ మెజారిటీ మార్క్‌ 272 కంటే చాలా తక్కువ. ఒకప్పుడు అత్యంత శక్తివంతమైన బీజేపీ ఇప్పుడు మిత్రపక్షాల కోసం దిగిరాక తప్పటంలేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎన్నికల ప్రచార సమయంలో మోడీని దైవ అవతారంగా కూడా కాషాయ శ్రేణులు చూపించాయి. ఇప్పుడు కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మోడీ సంకీర్ణ భాగస్వాములపై ఆధారపడవలసి వచ్చిందని వారు చెప్తున్నారు.
ద్వేషం వర్సెస్‌ ప్రేమ
2014, 2019లో బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పుడు పార్టీ మద్దతుదారులలో ఆనందోత్సాహాలు కనిపించాయి. ఇప్పుడు మెజారిటీ తగ్గగానే వారు ఆగ్రహం, కోపంతో ఉన్నారు. ఏకంగా ఓట్లు వేయని కొన్ని కీలక రాష్ట్రాల ప్రజలను దూషించటం, తక్కువ చేసి మాట్లాడటం వంటివి చేస్తున్నారు. కాషాయపార్టీ, దాని అనుబంధ సోషల్‌ మీడియా ఖాతాల్లో ఇలాంటి వీడియోలు ఎక్కువగా కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. గెలిచిన సమయంలో చూపిన ప్రేమ అనేది ఓడిన సమయంలో ద్వేషంగా మారటం ఎంత వరకు సమంజసమని వారు ప్రశ్నిస్తున్నారు.
ప్రేమతో ప్రజలను చేరదీయాలనీ, ద్వేషం ఏ మాత్రమూ పని చేయదని అంటున్నారు. ఇదే విషయాన్ని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ సైతం పలు సందర్భాల్లో గుర్తు చేశారని చెప్తున్నారు. మోడీ పాలనలో అసమానతలూ తీవ్రమయ్యాయని చెప్తున్నారు. ఈ అసమానత మహమ్మారి తర్వాత అధికమైందని అంటున్నారు. ”లాక్డౌన్‌ సమయంలో వలస కార్మికుల కష్టాలు, గంగానదిలో తేలుతున్న వేలాది శవాలు, దహన సంస్కారాల కోసం దాని తీరం వెంబడి మృతదేహాలు వరుసలో ఉన్నాయి. ఇవి ప్రపంచవ్యాప్తంగా కాలాన్ని నిర్ధారిస్తాయి. అయితే, అటువంటి పెద్ద మానవ విషాదం ఎన్నికల అంశంగా మారలేదు. ఆర్థిక సంక్షోభం సమస్య ద్వారా పరోక్షంగా మాత్రమే ప్రదర్శించబడింది” అని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు.
రాహుల్‌ గాంధీ.. ‘నఫ్రత్‌ కే బజార్‌ మే మొహబ్బత్‌ కి దుకాన్‌’ (ద్వేషపు మార్కెట్‌లో ప్రేమ దుకాణాన్ని ఏర్పాటు చేయడం) నినాదం గురించి ఎక్కువగా చెప్తూ వచ్చారు. ఇది రెండేండ్ల క్రితం భారత్‌ జోడో యాత్రలో రూపొందించబడింది. ‘బుల్డోజర్‌ న్యాయం’ అంటూ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒక వర్గాన్ని టార్గెట్‌ చేసుకుంటూ సాగిన అన్యాయాన్ని రాహుల్‌ చక్కగా ప్రశ్నించారని నిపుణులు చెప్తున్నారు. రాహుల్‌ ప్రచారాలు దేశ ప్రజలను ప్రభావితం చేశాయనీ, దీంతో బీజేపీకి తీరని నష్టం మిగిలిందని అంటున్నారు. ప్రేమతో చేసే రాజకీ యాలు మాత్రమే ఎన్నికల్లో పని చేస్తాయనీ, ద్వేషించే సంస్కృతిని ప్రజలు తిరస్కరిస్తారనీ, ఇందుకు ప్రస్తుత ఎన్నికల్లో బీజేపీకి వచ్చిన ఫలితాలే ప్రత్యక్ష ఉదాహరణ అని మేధావులు అంటున్నారు.

Spread the love