వాయుగుండం..కురిచిన చిరు జల్లులు

– ఆందోళనలో రైతులు
– మిచౌoగ్, తుపాన్ ప్రభావం.పడేనా.?
నవ తెలంగాణ-మల్హర్ రావు
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుపానుగా మారడంతో ఆ ప్రభావం కారణంగా మండలంలో సోమవారం రోజంతా ఆకాశం మేఘామృతమై ఉండడమే కాక మంగళవారం పలు గ్రామాల్లో చిరు జల్లులు కురిశాయి.దీంతో జిల్లాలో మీచౌoగ్ ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది.కాగా ప్రస్తుతం కురుస్తున్న చిరు జల్లులు, మబ్బులతో పంటలకు నష్టం జరుగుతోందని రైతులు ఆందోళన చెందుతున్నారు.మండలంలో చేతికందే దశలో ఉన్న పత్తి నెలరాలితే నాణ్యత దెబ్బతింటుందని చెబుతున్నారు. మరోపక్క వరి కోతలు ముమ్మరంగా సాగుతున్న నేపథ్యాన కల్లాల్లో ధాన్యం అరబోసిన రైతులు టార్పాలిన్లు కప్పుతున్నారు.
తేమతో పైర్లకు తెగుళ్లు సోకె ప్రమాదం…
తుపాను కారణంగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకోవడం,గాలిలో తేమశాతం పెరగడంతో పైర్లకు తెగుళ్లు ఆశించే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు.మిర్చిలో కాయకుళ్ళు తెగులు,వరిలో మానిపండు తెగులు ఆశించే అవకాశం ఉందని వెల్లడించారు.ఏదిఏమైనా అకాల వర్షం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది.ఓవైపు చేతికందే పంటలకు నష్టం జరగనుండగా మరోవైపు తెగుళ్లు ఆశించే ప్రమాదం ఉండడంతో రైతులకు కంటిమీద కునుకు లేకుండా పంటలను కాపాడుకోవడంలో నిమగ్నమయ్యారు.
Spread the love