‘క్రిమినల్‌’ ముసాయిదా నిలుపుదల

నవతెవలంగాణ –  న్యూఢిల్లీ : పార్లమెంటరీ స్థాయి సంఘంలో తీవ్ర స్థాయిలో ప్రతిఘటన ఎదురుకావడంతో ప్రస్తుతమున్న క్రిమినల్‌ చట్టాల స్థానంలో ప్రతిపాదించిన మూడు బిల్లుల విషయంలో కేంద్ర ప్రభుత్వం తాత్కాలికంగా వెనక్కు తగ్గింది. ఈ మేరకు హోం వ్యవహారాల స్టాండింగ్‌ కమిటీలో ప్రవేశపెట్టిన ముసాయిదా నివేదికను నిలిపివేసింది. శుక్రవారం జరిగిన స్టాండింగ్‌ కమిటీ సమావేశంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. అంతకుముందు స్టాండింగ్‌ కమిటీలోని ప్రతిపక్ష సభ్యులు నివేదికను పరిశీలించేందుకు అవసరమైన సమయం ఇవ్వలేదని అధికార పక్షాన్ని నిలదీశారు. ముసాయిదా నివేదిక ఇంగ్లీషు ప్రతిని గత వారం సభ్యులుకు ఇవ్వగా, హిందీ ప్రతిని సమావేశం ప్రారంభం కావడానికి కొంత సమయం ముందు ఇచ్చారు. ఈ విషయాన్నే ప్రస్తావిస్తూ సభ్యులు నిలదీశారు. లోక్‌సభ కాంగ్రెస్‌ నాయకుడు అధిర్‌ రంజన్‌చౌదరి. పి, చిదంబరం, టిఎంసికి చెందిన డెరిక్‌ ఒబ్రియాన్‌లతో పాటు డిఎంకె ఇతర పార్టీల సభ్యులు కూడా తమకు మరింత సమయం కావాలని పట్టుబట్టారు. కీలకమైన బిల్లుల విషయంలో ఇలా బుల్డోజ్‌ చేయడం, ఏక పక్షంగా వ్యవహరించడం సరికాదని వారు విమర్శించారు. అత్యంత కీలకమైన బిల్లులు కాబట్టి అధ్యయనం చేసేందుకు తమకు కనీసం రెండు నుండి మూడు నెలల సమయం కావాలని వారు పట్టుపట్టారు. ఇదే విషయాలను పేర్కొంటూ కాంగ్రెస్‌ నేత చిదంబరం ప్రభుత్వానికి లేఖ కూడా రాశారు. ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లుల విషయంలో విస్తృతంగా చర్చ జరగాలని ప్రతిపక్ష సభ్యులు డిమాండ్‌ చేశారు. ఈ నేపథ్యంలో ముసాయిదాను నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించిన స్టాండింగ్‌ కమిటీ ఛైర్మన్‌ నవంబర్‌ 6న ఇదే విషయాన్ని చర్చించడానికి మరోసారి సమావేశం కానున్నట్లు తెలిపారు.

Spread the love