పార్కులో మహిళకు పోలీసుల లైంగిక వేధింపులు

– యూపీలో మరో దారుణం
లక్నో : కాబోయే భర్తతో కలిసి పార్కుకు వెళ్లిన మహిళను పోలీసులు లైంగికంగా వేధించారు. కోరిక తీర్చాలంటూ ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. భారీగా డబ్బులు డిమాండ్‌ చేశారు. చివరకు రూ.1000 బలవంతంగా పేటీఎం ద్వారా ట్రాన్స్‌ఫర్‌ చేయించుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఈ సంఘటన జరిగింది. సెప్టెంబర్‌ 13న నోయిడాకు చెందిన 22 ఏళ్ల మహిళ, 23 ఏళ్ల కాబోయే భర్తతో కలిసి ఘజియాబాద్‌లోని సాయి ఉపవన్‌ పార్క్‌కు వెళ్లింది. పోలీస్‌ రెస్పాన్స్‌ వాహనంలో విధులు నిర్వహించే ముగ్గురు పోలీసులు ఆ జంటను వేధించారు. కాబోయే భర్త చెంపపై కొట్టారు. కోరిక తీర్చాలని ఆ మహిళను పోలీస్‌ కానిస్టేబుల్‌ రాకేష్‌ కుమార్‌ బలవంతం చేశాడు. ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ జంటను విడిచిపెట్టేందుకు ఒక పోలీస్‌ పది వేలు, మరో పోలీస్‌ ఏకంగా రూ.5.5 లక్షలు డిమాండ్‌ చేశాడు. ఆ జంటను సుమారు మూడు గంటలపాటు వేధించారు. చివరకు ఆ మహిళ మొబైల్‌లోని పేటీఎం యాప్‌ నుంచి రూ.1,000 ట్రాన్స్‌పర్‌ చేసుకుని విడిచిపెట్టారు. ఆ తరువాత కూడా పోలీసులు ఆ మహిళను వేధించారు. సెప్టెంబర్‌ 19న రాకేష్‌ కుమార్‌ ఆమెకు ఫోన్‌ చేశాడు. తన కోరిక తీర్చాలని అసభ్యంగా మాట్లాడాడు. ఆమె ఆ కాల్‌ను రికార్డ్‌ చేసింది. సెప్టెంబర్‌ 22న ఆ ముగ్గురు ఆమె ఇంటికి వెళ్లడంతో, ఆమె విసిగిపోయింది. అత్యవసర నంబర్‌కు కాల్‌ చేసి, ఫిర్యాదు చేసింది. విషయం తెలుసుకున్న ఘజియాబాద్‌ పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తు చేశారు. ఆమెను లైంగికంగా వేధించిన పోలీసులపై పలు సెక్షన్ల కింద సెప్టెంబర్‌ 28న కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న కానిస్టేబుల్‌ రాకేష్‌ కుమార్‌, హౌంగార్డు దిగంబర్‌ కుమార్‌తోపాటు మరో వ్యక్తి కోసం వెతుకుతున్నారు. పోలీస్‌ కానిస్టేబుల్‌ రాకేష్‌ కుమార్‌ను సస్పెండ్‌ చేసినట్టు పోలీస్‌ ఉన్నతాధికారి తెలిపారు. హోంగార్డ్‌పై చర్యల కోసం ఆ విభాగానికి లేఖ రాసినట్టు చెప్పారు.

Spread the love