1098 చైల్డ్ హెల్ప్‌లైన్ పనితీరుపై పర్యవేక్షణ కరువు
ప్రజా సంఘాల నాయకురాలు పులిగంటి సుప్రియ
నవతెలంగాణ – మల్హర్ రావు
దళారుల చేతుల్లో భూపాలపల్లి జిల్లాలోని మహిళా శిశు సంక్షేమ శాఖ చిక్కుకుంది ప్రజాసంఘాల నాయకురాలు పులిగంటి సుప్రియ ఆరోపించారు. ఆదివారం విలేకరులతో ఆమె మాట్లాడారు. శిశు సంక్షేమ శాఖలో గత కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలు పలు అనుమానాలకు తావిస్తున్నాయని, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది నియామకాలు, రెన్యువల్స్, అనుభవ పత్రాల పరిశీలన, విచారణలు, ప్రభుత్వ మార్గదర్శకాల అమలు తదితర అంశాలపై ప్రజల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయన్నారు.
ఈ వ్యవహారాలపై సమగ్ర విచారణ నిర్వహించి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని సామాజిక వర్గాలు కోరుతున్నాయని తెలిపారు. జిల్లా మహిళా శిశు సంక్షేమలో నకీలు పని చేస్తున్న అధికారులు ఇట్టి నకిలీలకు ప్రతి 11 నెలలకు ఒకసారి జరగాల్సిన రెన్యువల్ ప్రక్రియను నిలిపివేసినట్లుగా ఆరోపించారు. నకీలలపై విచారణ పూర్తయ్యే వరకు వారికి ఎలాంటి బాధ్యతలు అప్పగించలేదని అప్పట్లో అధికారులే వివరణ ఇవ్వగా.. ప్రస్తుతం సదరు శాఖాధికారి అదే సిబ్బందిలో కొందరిని మళ్లీ ప్రభుత్వ కార్యక్రమాలు, అధికారిక సమావేశాల్లో భాగస్వామ్యం చేయడంపై సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.
మార్గదర్శకాల ప్రకారం కాంట్రాక్ట్ ఉద్యోగులకు నిర్దిష్ట వ్యవధిలో రెన్యువల్ చేయడం తప్పనిసరి.కానీ కొందరు సిబ్బందికి మూడు సంవత్సరాలకు పైగా రెన్యువల్ లేకపోయినా ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనడం,అధికారిక సమావేశాలకు హాజరు కావడం ఎలా జరుగుతుందని నిలదీశారు.రెన్యువల్ లేకుండా ప్రభుత్వ ఉద్యోగ బాధ్యతలు నిర్వహించడం నిబంధనలకు అనుగుణమేనా అనే అంశంపై శాఖ ఉన్నతాధికారులు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.మహిళా శిశు సంక్షేమ శాఖలో కొనసాగుతున్న వివాదాలు, పెండింగ్ విచారణలు, రెన్యువల్స్, అర్హతల పరిశీలన, 1098 సేవల పనితీరు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించి శాఖలో పాతుకుపోయిన అక్రమార్కులను ఏరివేసి సమగ్ర విచారణ జరిపించాలని కోరారు.వాస్తవాలు వెలుగులోకి వస్తే శాఖపై ప్రజల్లో విశ్వాసం మరింత పెరుగుతుందని అభిప్రాయపడ్డారు.



