– బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య ప్రధాన పోటీ
దేవరకద్ర నియోజకవర్గం 2009లో ఏర్పడింది. అప్పుడు జరిగిన ఎన్నికల్లో దేవరకద్ర నుంచి దయాకర్ రెడ్డి భార్య సీత నిలబడి గెలిచింది. ఆ తర్వాత జరిగిన 2014 -18లో జరిగిన శాసనసభ ఎన్నికలలో బీఆర్‌ఎస్ అభ్యర్థి ఆల వెంకటేశ్వర రెడ్డి విజయం సాధించారు. 2023 లో జరిగే జరిగే ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి. ప్రధాన పోటీ కాంగ్రెస్ బీఆర్‌ఎస్ మధ్యన ఉన్నప్పటికీ గెలుపోటములపై అనేక శక్తులు పనిచేయనున్నాయి. కాంగ్రెస్ నుంచి డీసీసీ అధ్యక్షులు జి మధుసూదన్ రెడ్డి ఈసారి గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
నవ తెలంగాణ -మహబూబ్‌నగర్ ప్రాంతీయ ప్రతినిధి
దేవరకద్ర నియోజకవర్గం ఏర్పడిన తర్వాత 2009లో జరిగిన ఎన్నికల్లో టిడిపి నుండి పోటీ చేసిన సీతా దయాకర్ రెడ్డి మొదటిసారి గెలిచారు. 2014లో రాష్ట్రము ఏర్పడిన తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆల వెంకటేశ్వర్ రెడ్డి చేతిలో ఆమె పరాజయం పాలయ్యింది. 14642 ఓట్ల ఆధిక్యతతో ఆల వెంకటేశ్వర్ రెడ్డి గెలిచారు. రెండోసారి 2018లో 34 385 ఓట్ల ఆధిక్యతతో ఆల వెంకటేశ్వర రెడ్డి తిరిగి గెలుపొందారు. 2023 లో జరిగిన ఎన్నికలలో సైతం ఆయన భారీ మెజార్టీ కోసం కసరత్తు చేస్తున్నారు. ముఖ్యంగా కల్వకుర్తి ఎత్తిపోతల పథకంతో పాటు పాలమూరు రంగారెడ్డి ద్వారా సాగునీటిని తన నియోజ కవర్గానికి తీసుకురావడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఈ నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివద్ధి చేయడానికి ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ తో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు. ఈసారి జరిగే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ నుంచి ఆల పోటీ చేయగా, కాంగ్రెస్ నుంచి డీసీసీ అధ్యక్షులు జి మధుసూదన్ రెడ్డి పోటీ పడనున్నారు. ప్రదీప్ కుమార్ గౌడ్ సైతం ఈసారి కాంగ్రెస్ నుంచి టికెట్ కోరుతున్నారు. డీసీసీ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి అధికార పార్టీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. మైనింగ్ ఇసుక మాఫియాగా మారి ప్రభుత్వ సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారనే ఆరోపణలు ఆయన చేస్తున్నారు. రెండు సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ ను ఈసారి ఓడించి తీరాలన్న పట్టుదలతో వారు ఉన్నారు. ఇక బీజేపీ నుంచి ఎగ్గని నరసింహులు పవన్ కుమార్ రెడ్డి, సుదర్శన్ రెడ్డిలు పోటీ పడుతున్నారు. బీజేపీ పోటి నామ మాత్రమే అయిన గెలుపోటములను నిర్ణయించే శక్తి వారికి ఉంది.
అంతుచిక్కని ఓటరు నాడి
ఇప్పటికే ఒకసారి కేటీఆర్ హరీష్ రావులు దేవరకద్ర నియోజకవర్గానికి వచ్చి పోయారు. ఆల వెంకటేశ్వర రెడ్డి పని విధానం పట్ల ప్రశంసలు కురిపించారు. అభివద్ధి కార్యక్రమాలను చూసి ఓటర్లు మరోసారి ఆల వెంకటేశ్వర్ రెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు. అయినా ఓటరు నాడి రాజకీయ పార్టీలకు చిక్కడం లేదు. ఏ రాజకీయ పార్టీ బహిరంగ సభలు పెట్టిన ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు. ఎవరు నిలబడిన మా మనసులో ఉన్న వాళ్లకే ఓట్లు వేస్తామని తెగేసి చెబు తున్నారు. దీంతో ఈసారి ఓటరు నాడి ఎటువైపు ఉందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి.