హెచ్‌సీఏ పీఠం ఎవరిదో?

Who owns the seat of HCA?– తొలిసారి హెచ్‌సీఏలో బహుముఖ పోటీ
– అపెక్స్‌ కౌన్సిల్‌కు నేడు ఎన్నికలు
నవతెలంగాణ-హైదరాబాద్‌

వివాదాలు, అవినీతి, కోర్టు కేసులు, ఆగమ్యగోచరంగా క్రికెట్‌.. క్లుప్లంగా గత కొన్నేండ్లుగా హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) అంటే ఇదే!. సుప్రీంకోర్టు నియమిత ఏకసభ్య కమిటీ తీసుకున్న సంచలన నిర్ణయంతో హెచ్‌సీఏ అపెక్స్‌ కౌన్సిల్‌లో పోటీపడేందుకు అందరికీ సమాన అవకాశం దక్కింది. దీంతో హెచ్‌సీఏ చరిత్రలోనే తొలిసారి అపెక్స్‌ కౌన్సిల్‌కు బహుముఖ పోటీ నెలకొంది. అపెక్స్‌ కౌన్సిల్‌లో అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, కోశాధికారి పదవులకు తోడు కౌన్సిలర్‌ పదవికి సైతం నేడు ఎన్నికలు జరుగనున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం మాజీ ప్రధాన కమిషనర్‌ వి.ఎస్‌ సంపత్‌ ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తుండగా.. నేడు ఉప్పల్‌ స్టేడియంలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నాం 3 గంటలకు వరకు పోలింగ్‌ జరుగనుంది. 101 క్లబ్‌ కార్యదర్శులు, 48 ఇన్‌స్టిట్యూట్‌లు, 9 జిల్లా క్రికెట్‌ సంఘాలు, 15 మంది అంతర్జాతీయ క్రికెటర్లు నేడు హెచ్‌సీఏ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 3 గంటలకు పోలింగ్‌ ముగియనుండగా.. సాయంత్రం 6 గంటల లోపు ఎన్నికల ఫలితాలు ప్రకటించే అవకాశం ఉంది.
బరిలో ప్రభుత్వ అభ్యర్థి! : హెచ్‌సీఏ ఎన్నికల్లో నాలుగు ప్యానల్స్‌ పోటీపడుతుండగా.. ఇందులో ఓ ప్యానల్‌కు తెలంగాణ ప్రభుత్వం మద్దతు ఇస్తోంది. భారత హ్యాండ్‌బాల్‌ సంఘం (హెచ్‌ఏఐ) జాతీయ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న అర్శినపల్లి జగన్‌మోహన్‌ రావుకు రాష్ట్ర మంత్రులు కల్వకుంట్ల తారకరామారావు, తన్నీరు హరీశ్‌ రావు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితలు మద్దతు ఇస్తున్నట్టు ఆయన తెలిపారు. దీంతో, ప్రభుత్వ సూచనల మేరకు ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే 48 ఇన్‌స్టిట్యూట్‌లు జగన్‌మోహన్‌ రావుకు ఓటేస్తాయని అంచనా. నాలుగు ప్యానల్స్‌ పోటీలో ఓట్లు చీలనుండగా.. మ్యాజిక్‌ ఫిగర్‌ 60-70 మధ్య ఉండవచ్చని తెలుస్తోంది. అయితే, హెచ్‌సీఏ మాజీ బాస్‌లు శివలాల్‌ యాదవ్‌, అర్షద్‌ అయూబ్‌లో ఓ ప్యానల్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. ఏండ్లుగా హెచ్‌సీఏను ఏలుతున్న శివలాల్‌ యాదవ్‌ చరిష్మా ఇప్పటికీ ఉందా అనేది అనుమానం. హెచ్‌సీఏ నుంచి నష్ట పరిహారం సొమ్ము కోసం ఎదురుచూస్తున్న మాజీ అధ్యక్షుడు వివేక్‌ వెంకటస్వామి సైతం ఓ ప్యానల్‌కు దన్నుగా నిలిచారు. క్రికెట్‌ అభివృద్దికి కేటాయించాల్సిన సొమ్మును ఓ ప్రయివేటకు సంస్థకు చెల్లిస్తే.. ఇక హెచ్‌సీఏ బాగు పడేదెలా అనే ప్రతికూల ప్రచారం క్లబ్‌ కార్యదర్శుల్లో ఉండటం ఆ ప్యానల్‌కు బలహీనతగా మారొచ్చు. ఇండిపెండెంట్‌గా పోటీచేస్తున్న పీఎల్‌ శ్రీనివాస్‌ ప్యానల్‌ సైతం హెచ్‌సీఏను బాగు చేసేందుకు మంచి మ్యానిఫెస్టోతో ముందుకొచ్చింది. సాధారణ సమీకరణాలకు తోడు మరెన్నో ఇతర అంశాలు ప్రభావితం చేసే హెచ్‌సీఏ ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారనేది చెప్పటం అంత సులుభం కాదు.
పోటీపడుతున్న అభ్యర్థులు వీరే : నాలుగు ప్యానల్స్‌ నుంచి అపెక్స్‌ కౌన్సిల్‌కు పోటీపడుతున్నారు. బహుముఖ పోటీలో మిగతా అభ్యర్థుల కంటే ఎక్కువ ఓట్లు సాధించిన అభ్యర్థి పదవి దక్కించుకోనున్నారు. అధ్యక్ష పదవికి జగన్‌మోహన్‌ రావు, అమర్‌నాథ్‌, అనిల్‌ కుమార్‌, పీఎల్‌ శ్రీనివాస్‌.. ఉపాధ్యక్ష పదవికి బాబురావు, శ్రీనివాస రావు, శ్రీధర్‌, సర్దార్‌ దల్జీత్‌ సింగ్‌.. కార్యదర్శి పదవికి దేవరాజ్‌, ఆగమ్‌ రావు, హరి నారాయణ రావు, ఆర్‌ఎం భాస్కర్‌.. సంయుక్త కార్యదర్శి పదవికి చిట్టి శ్రీధర్‌, నోయెల్‌ డెవిడ్‌, సతీశ్‌ చంద్ర, బసవరాజు.. కోశాధికారి పదవికి శ్రీనివాసరావు, సంజీవ రెడ్డి, జెరార్డ్‌ కార్‌, మహేంద్రలు పోటీపడుతున్నారు. కౌన్సిలర్‌ పోస్టు కోసం వాల్టర్‌, అన్సార్‌ అహ్మద్‌ ఖాన్‌, సునీల్‌ కుమార్‌, వినోద్‌ కుమార్‌లు బరిలో నిలిచారు.

Spread the love